శ్లోకము - 29
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే |
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిధహ్యతే ||
వేపథుః - దేహము కంపించడము; చ - కూడ; శరీరే - శరీరముపై; మే - నా యొక్క; రోమహర్షః - రోమాంచము; చ - కూడా; జాయతే - కలుగుతున్నది; గాండీవం - అర్జునుని ధనస్సు; స్రంసతే - జారిపోతోంది; హస్తాత్ - చేతి నుండి,; త్వక్ - చర్మము; చ - కూడా; ఏవ - నిక్కముగా; పరిధహ్యతే - మండిపోతున్నది.
నా శరీరమంతా కంపిస్తున్నది, నాకు రోమాంచమౌతోంది, గాండీవధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మము మండిపోతున్నది.
భాష్యము : రెండు రకాల దేహకంపనాలు, రెండు రకాల రోమాంచాలు ఉన్నాయి. అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యంలో గాని, భౌతికపరిస్థితిలో మహాభయంలో గాని కలుగుతాయి. దివ్యానుభూతిలో భయమనేదే ఉండదు. ఈ స్థితిలో అర్జునుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతికభయం వలన కలుగుతున్నాయి. ఇతర లక్షణాల నుండి కూడ ఇది నిరూపితమౌతోంది. అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాండీవధనస్సు .. అతని చేతి నుండి జారిపోతోంది. హృదయము దహించుకుపోతున్న కారణంగా అతనికి చర్మం మండుతున్న భావన కలిగింది. ఇవన్నీ జీవితపు భౌతికభావన వలననే కలిగాయి.
శ్లోకము - 30
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః |
నిమిత్తాని చ వశ్యామి విపరీతాని కేశవ ||
న చ శక్నోమి - శక్తుడను కాను; అవస్థాతుం - నిలబడడానికి; భ్రమతి - మరచి పోతున్నాను; ఇవ - వలె; చ - మరియు; మే - నా యొక్క; మనః - మనస్సు; నిమిత్తాని చ - కారణములను కూడ; పశ్యామి - చూస్తున్నాను; విపరీతాని - విపరీతాలను; కేశవ - కేశి యనే అసురుని సంహరించినవాడా (శ్రీకృష్ణా).
ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మరిచిపోతున్నాను, నా మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణా! కేశిసంహారీ! నేను కేవలము విపరీతాలనే చూస్తున్నాను.
భాష్యము : అసహనం వలన అర్జునుడు యుద్దరంగంలో నిలబడడానికి అశక్తుడయ్యాడు. ఈ మనోదుర్భలత కారణంగా అతడు తననే మరచిపోసాగాడు. భౌతిక విషయాల పట్ల అమితానురక్తి మనిషిని ఇటువంటి భ్రాంతిమయ స్థితిలో నిలుపుతుంది. “భయం ద్వితీయాభినివేశతః స్యాత్ (భాగవతము 11.2.37) భౌతికపరిస్థితులచే అతిగా ప్రభావితులైనవారిలోనే ఇటువంటి భయము, మానసిక అస్థిరత్వము కలుగుతాయి.
అర్జునుడు యుద్ధరంగంలో కేవలము బాధామయమైన విపరీతాలనే దర్శించాడు. శత్రువుపై విజయము సాధించినప్పటికిని అతడు సుఖీ కాలేనట్లుగా అనిపించింది. ఇక్కడ "నిమిత్తాని-విపరీతాని” అనే పదాలు ముఖ్యమైనవి. మనిషి తన ఆకాంక్షలలో కేవలము వైఫల్యమునే చవిచూసినపుడు “నేనిక్కడ ఎందుకు ఉన్నాను?” అని అనుకుంటాడు.
ప్రతియొక్కడు తన గురించి, తన క్షేమము గురించి ఇష్టము కలిగి ఉంటాడు. ఎవ్వడూ భగవంతుని పట్ల ఇష్టమును కలిగి ఉండడు. శ్రీకృషమ్ణని సంకల్పముచే అర్జునుడు ఇక్కడ తన నిజమైన లాభము పట్ల జ్ఞానశూన్యతను ప్రదర్శినస్తున్నాడు. ప్రతియొక్కని నిజలాభము విష్ణువు లేదా కృష్ణుని యందే ఉంటుంది. బద్దజీవుడు ఇది మరచిపోతాడు. అందుకే భాతికక్లేశాలను అనుభవిస్తాడు. యుద్ధంలో తనకు లభించే విజయము కేవలము తనకు దుఖకారణమే అవుతుందని అర్జునుడు అనుకున్నాడు.
శ్లోకము - 31
న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే |
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ||
శ్రేయు - మేలు; న చ అనుపశ్యామి - గాంచలేకపోతున్నాను; హత్వా - చంపి; స్వజనం - నా వారిని; ఆహవే - యుద్ధంలో; న కాంక్షే- కోరను; విజయం - విజయమును; కృష్ణ - ఓ కృష్ణా; న చ రాజ్యం - రాజ్యమును కూడ; సుఖాని చ - దాని వలన కలిగే సౌఖ్యములను కూడ.
కృష్ణా! ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను.
భాష్యము : తన నిజలాభము విష్ణువులోనే (లేదా కృష్ణునిలోనే) ఉన్నదని ఎరుగక బద్దజీవులు దేహసంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖభాగులమౌతామని ఆశపడతారు. జీవితపు అట్టి గుడ్డిభావనలో వారు భౌతికసుఖానికి హేతువులను కూడ మరచిపోతారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియుని నైతికధర్మాలను కూడ మరచిపోయినట్లు కనిపిస్తున్నది.
శ్రీకృష్ణుని ప్రత్యక్షాదేశములో యుద్ధరంగములో మరణించే క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకే అంకితమైన సన్యాసి అనే రెండు రకాల వ్యక్తులు ఎంతో శక్తివంతము, దేదీప్యమానము అయినట్టి సూర్యమండలములో ప్రవేశించడానికి యోగ్యులౌతారని చెప్పబడింది. బంధువుల మాట అటుంచి తన శత్రువులను చంపడానికైనా అర్జునుడు విముఖుడై ఉన్నాడు, తన వారిని చంపడం ద్వారా జీవితంలో సుఖం కలగదని అతడు తలచాడు. అందుకే ఆకలి లేనివాడు వంట చేయడానికి ఇష్టపడనట్లుగా అతడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు.
అతడు ఇప్పుడు అడవికి వెళ్ళి వ్యర్థంగా ఒంటరి జీవితాన్ని గడపడానికే నిశ్చయించుకున్నాడు. కాని క్షత్రియునిగా అతనికి జీవనార్ధము ఒక రాజ్యము అవసరము. ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తులలోను నెలకొనలేరు. కాని అర్జునునికి రాజ్యం లేదు. జ్ఞాతులతో, సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందడము ఒక్కటే అర్జునునికి ఏకైక రాజ్యప్రాప్తి అవకాశముగా ఉన్నది. అయినా దానిని అతడు చేయగోరడం లేదు. అందుకే అడవికి వెళ్ళి ఒంటరిగా భగ్నజీవితాన్ని గడపడమే తనకు తగినదని అతడు భావించాడు.
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |