డా. అనంత లక్ష్మి - Dr. Anantha Lakshmi |
హిందూ సమాజంలో దేవాలయానికి ఎంతో ప్రాచీన, ప్రముఖ చరిత్ర ఉందని అధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు తెలిపారు. వరంగల్ పట్టణంలో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సభకు డాక్టర్ అనంత లక్ష్మి ప్రధాన వక్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు విషయాలు విశదీకరించారు.
“ద్వాపర యుగము చివరి నాటికే దేవాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఆ నాటి గ్రామాలకు,నగరాలకు చివరికి సమాజానికి కేంద్ర బిందువు దేవాలయమే. మానవ దేహము దేవాలయము ఒకే రూపంలో ఉంటాయి. శరీరంలోని హృదయం వంటిది దేవాలయంలోని గర్భ గృహం. దేవాలయంలోని మూర్తి సజీవమైనది. దానికి మంత్ర, యంత్రాలతో ప్రాణఃప్రతిష్ట చేస్తారు. దేవాలయం శ్రద్దా కేంద్రము మాత్రమే కాదు, విద్యా కేంద్రం, వైద్యకేంద్రం, కళల ప్రదర్శనా కేంద్రం, ధర్మ ప్రచార కేంద్రం కూడా! మన పూర్వీకులు దేవాలయాల సక్రమ నిర్వహణకు అనేక సౌకర్యాలు కల్పించినా అనేక కారణాల వల్ల నేడు అనేక దేవాలయాలు శిధిలమయ్యాయి. ధూప, దీప నైవేద్యాలు లేకుండా పోయాయి. నేడు నూతన మందిరాల నిర్మాణం కోసం కాక శిధిలమైన దేవాలయాల పునరుద్దరణకు, ఆ దేవాలయాల్లో దీపం వెలిగించి, ప్రసాదం నైవేద్యంగా సమర్పించే పనికి ముందుకు రావాలి ” అని డాక్టర్ అనంత లక్ష్మి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఉద్యమానికి నేతృత్వం వహించిన స్వర్గీయ టి.ఎస్.రావు గారి సేవల గురించి, ఉద్యమ వివరాలను శ్రీ శ్యామ్ ప్రసాద్ జీ, డా. భగవంత రావు, సౌమిత్రి లక్ష్మణాచార్య వివరించారు. సభ శ్రీ టి.ఎస్.రావు గారికి శ్రద్ధాంజలి ఘటించింది.
__విశ్వ సంవాద కేంద్రము
టెలిగ్రామ్లో తెలుగు-భారత్ ను అనుసరించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ప్రతిరోజు మేము అందించే ఉత్తమ కథనాలను పొందండి.