శివ పూజ |
పూజ చేయకపోయినా ఉపవాసం ఉంటే..
ఓంకారం ఆది ప్రణవనాదం.. వేదాలన్నింటకీ తాత్పర్యం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీసి పలికితే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు.
శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. రాత్రి ‘చీకటి’ అజ్ఞానానికి సంకేతం కదా, మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవు తుంది. మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి.
ఓంకారం ఆది ప్రణవనాదం.. వేదాలన్నింటకీ తాత్పర్యం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీసి పలికితే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు... ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. అందుకే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివుడు ఉన్నాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హులే. పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన తిథి ఏకాదశి. ఇది నెలలో రెండుసార్లు వస్తుంది.
ఒకసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతీ అడిగిన సందర్భంలో.. శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం.. పగలంతా నియమనిష్ఠతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నేయి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు బ్రహ్మ విధులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తిచేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడు తెలిపాడు.
సాధారణంగా ప్రతి మాసంలోని కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేక మహత్తు ఉంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థం చాల మందికి తెలియదు. ‘రా’ అన్నది దానార్థక ధాతు నుంచి ‘రాత్రి’ అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేదంలోని రాత్రి సూక్తం యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పారు.. హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!… వగైరా ‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్! ఉష ఋణేవ యాతయ|’
నిజంగానే రాత్రి ఆనందదాయిని.. అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలదు. అందుకే రాత్రిని ప్రశంసించడం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేసి, రాత్రి జాగరణ ఉంటారో వారికి పునర్జన్మ ఉండదని, భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా వివరించారు. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.
‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం! మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!’ కాబట్టి గరుడ, స్కంద, పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో శివపూజను ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా ఉన్నా విషయం ఒకటే. ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి, బిల్వ పత్రాలతో శివపూజ చేసి, రాత్రి జాగరణ ఉంటారో వారిని శివుడు నరకం నుంచి రక్షించి, ఆనందం, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమవుతాడు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిసినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ శివపూజ ప్రధానమైంది...
శ్రీ మాత్రే నమః
టెలిగ్రామ్లో తెలుగు-భారత్ ను అనుసరించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ప్రతిరోజు మేము అందించే ఉత్తమ కథనాలను పొందండి.