శ్లోకము - 10
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ||
అపర్యాప్తం - అపరిమితము; తత్ - అది; అస్మాకం - మన యొక్క బలం - బలము; భీష్మ - భీష్మపితామహునిచే; ఆభిరక్షితం - సంపూర్లంగా రక్షింపబడేది; పర్యాప్తం - పరిమితమైంది; తు - కాని; ఇదం -ఈ; ఏతేషాం - పాండవుల యొక్క బలం-బలము; భీమ - భీమునిచే; అభిరక్షితం - జాగ్రత్తగా రక్షించబడేది.
మన బలము అపరిమితంగా ఉన్నది, మనము భీష్మపితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పొండవబలము పరిమితముగా ఉన్నది.
భాష్యము : ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్య అంచనా వేయబడుతోంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మపితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్యబలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షించబడే పాండవ సేనాబలము పరిమితంగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడు భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలము భీముని చేతనే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. కాని అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయము సాధించడం తథ్యమనేదే అతని తుది అభిప్రాయము.
శ్లోకము - 11
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షన్తు భవస్థం సర్వ ఏవ హి ||
అయనేషు - ముఖ్యస్థానాలలో; చ - కూడ; సర్వేషు - సర్వత్ర; యథాభాగం - వివిధముగా ఏర్పాటు చేయబడినట్లు; అవస్థితాః - నిలిచి; భీష్మం - భీవ్మపితామహునికి; ఏవ - నిశ్చయముగా; అభిరక్షస్తు - రక్షణను చేకూర్చాలి; భవస్తః - మీరు; సర్వే - అందరు; ఏవ హి - నిశ్చయముగా.
సేనావ్యూహ ద్వారములోని మీ ముఖ్యస్థానాలలో నిలిచి మీరందరు భీష్మపితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి.
భాష్యము : భీష్ముని పరాక్రమాన్ని పొగడిన తరువాత దుర్యోధనుడు ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కబరిచే యత్నం చేసాడు. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడేయైనా వృద్ధుడు కనుక ప్రతియొక్కరు అన్ని వైపుల నుండి ఆయన రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతడు నొక్కి చెప్పాడు. యుద్ధంలో నెలకొనినపుడు ఒకే ప్రక్క ఆయన పూర్తి సంలగ్నతను శత్రువు అనువుగా తీసికొనే అవకాశం ఉన్నది. అందుకే ఇతర వీరులందరు తమ ముఖ్యస్థానాలను వీడకపోవడం, సేనావ్యూహాన్ని శత్రువు ఛేదించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనవి. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలచాడు. యుద్ధంలో భీష్మదేవుని, ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారము పట్ల అతనికి నమ్మకము ఉన్నది. ఎందుకంటే సభలో అందరు మహాసేనానాయకుల సమక్షంలో నగ్నంగా నిలపడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని పత్నియైన ద్రౌపది నిస్సహాయస్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినపుడు వారు ఒక్కమాటైనా పలకలేదని అతనికి తెలుసు. ఆ ఇద్దరు సేనానులు పాండవుల పట్ల కలిగి ఉన్నారని తెలిసినప్పటికిని పాచికల సమయంలో చేసినట్లుగా వారిప్పుడు దానిని ఏదో రకమైన మమకారము పూర్తిగా విడిచిపెడతారని అతడు ఆశించాడు.
శ్లోకము - 12
తస్య సంజనయన్ హర్షం కురువృద్దః పితామహః |
సింహనాదం వినద్యోచ్చెః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
తస్య - అతనికి; సంజనయన్ - వృద్ధి చేస్తూ; హర్షం - ఆనందము; కురువృద్దః - కురు వంశ వృద్ధుడు (భీష్ముడు); పితామహః - పితామహుడు; సింహనాదం - సింహగర్జన వంటి ధ్వని; వినద్య - కలిగేటట్లు; ఉచ్చెైమ్ - బిగ్గరగా; శంఖం - శంఖమును; దధ్మౌ - పూరించాడు; ప్రతాపవాన్ - పరాక్రమవంతుడు.
అప్పుడు కురువృద్ధుడు, యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు.
భాష్యము : కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయంలోని భావనను తెలిసికోగలిగాడు. అతని పట్ల ఉన్నట్టి సహజకరుణతో ఆయన సింహములాగా తన స్థితికి తగినట్లు అతిబిగ్గరగా శంఖము పూరించి అతనిని సంతోషింపజేయడానికి యత్నించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షములో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయావకాశమే లేదని శంఖము సంకేతము ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియజేసాడు. అయినా యుద్ధము చేయడము ఆయన కర్తవ్యము. ఆ విషయంలో ఎటువంటి కష్టముకైనా ఆయన వెనుదీయడు.
శ్లోకము - 13
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్య్త స శబ్దస్తుములోకభవత్ ||
తతః - తరువాత; శంఖాః - శంఖములు; చ - కూడ; భేర్యః - భేరులు; చ - మరియు; పణవానక - చిన్నభేరులు, డంకాలు; గోముఖాః - కొమ్ములు; సహసా - అకస్మాత్తుగా; ఏవ - నిశ్చయముగా; అభ్యహన్యస్త - ఒకేసారి మ్రోగించబడ్డాయి; సః - ఆః శబ్దః - సంఘటిత ధ్వని; తుములః - దట్టముగా; అభవత్ - అయింది.
తరువాత శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతిభీకరంగా ఉన్నది.
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |