Sri Chaitanya Mahaprabhu |
ఎవరికైన ఒకరియందు అత్యంత ప్రేమ కలిగితే ఆ నాటి నుండి ఆ వ్యక్తేప్రాణంగా అంతవరకు ఉన్న చాలావాటిని మర్చిపోయి జీవిస్తాడు. అది ఎలాగంటే ఈ జన్మలోకి వచ్చాక గతజన్మలోవి మర్చిపోయి కొత్త జీవితం ఎలా ప్రారంభం అవుతుందో అలా ఉంటుంది. అదే విధంగా భగవంతునిపై భక్తి కలిగితే అలాగే ఉండాలి....ఉంటుంది కూడా.
ఒకే రోగం వచ్చినా అందరికీ వైద్యుడు ఒకే మందు ఇవ్వకుండా వారి యొక్క శరీర ధర్మాన్ని అనుసరించి ఇస్తాడు. అలాగే ఆహారం తినేటపుడు కూడా శరీరానికి పుష్టి, తృప్తి, ఆకలి తీరడం అనే మూడు ప్రయోజనాలు ఉంటాయి. కానీ దానికోసం అందరికీ ఒకే ఆహారం తృప్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వదు. కానీ భగవత్ ప్రాప్తికి మాత్రం శాస్త్రం సర్వమానవాళిని ఉద్దేశించి ఇచ్చిన మహా ఔషధం. భగవన్నామ కీర్తన, నామకీర్తనకు ఏ విశేష ప్రక్రియ కూడా అవసరం లేదు. ఏ దశలో ఉన్నా ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా భగవన్నామాన్ని కీర్తించుకోవచ్చు. మనకు అత్యంత ఇష్టం కలిగిన భగవానుని ఏ మూర్తినైనా ధ్యానం చేస్తూ, నామాన్ని కీర్తిస్తూ, భగవానుని గుణాలను గానం చేస్తూ
భగవంతుని లీలలు వింటూ...ఏ విధంగానైనా సరే శరీరం, ప్రాణం ఇంద్రియాలు, మనస్సు అన్నీ భగవంతుని పరాయణం కావాలి.
ఎప్పుడైనా భగవంతుని విస్మరించినట్లు అనిపిస్తే వెంటనే ఒకసారి ఊర్వదృష్టితో భగవానుని తలచుకుని, అతని మన్మోహన మూర్తిని ధ్యానం చేసుకుని మరల అతనితో అనుబంధం కొనసాగించే ప్రయత్నం చెయ్యాలి. అలా మాటిమాటికీ చేస్తే అది అభ్యాసంగా మారి యోగమవుతుంది.
శ్రీ చైతన్య మహాప్రభువు-(తే 28.03.2021 ది - జయంతి )