కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ |
షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు హిందూ మతం వీడి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు అర్హత కోల్పోతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టం చేశారు.
గురువారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అనేకమంది క్రైస్తవంలోకి మారుతున్నప్పటికీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసి, పదవులు అనుభవిస్తున్నారని, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన ఏమైనా ఉందా అని జీవీఎల్ నరసింహారావు సభలో ప్రశ్నించారు.
దీనికి మంత్రి రవిశంకర్ ప్రసాద్ బదులిస్తూ.. ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదన్నారు. ఈ సందర్భంగా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులలోని అంశాలను ఉటంకిస్తూ.. సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా క్రైస్తవం, ఇస్లాం మతాలను స్వీకరించిన ఎస్సీలు తమకు రాజ్యాంగం కేటాయించిన రిజర్వేషన్లు కోల్పోతారని, అటువంటి వ్యక్తులు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించేందుకు చట్టబద్ధమైన అవకాశం లేదని స్పష్టం చేశారు.
మతం మారిన ఎస్సీలు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి పోటీకి దిగుతున్న సమయంలోనే వారు మతం మార్చుకున్నట్టు రిటర్నింగ్ అధికారులకు సాక్ష్యాలతో ధ్రువీకరిస్తే వారి నామినేష్లను తిరస్కరించవచ్చని చెప్పారు.
ఇది కూడా చదవండి: ఏపీ హోంమంత్రి ఎస్సీ హోదా దుర్వినియోగం ఫిర్యాదుపై రాష్ట్రపతి భవన్ స్పందన
__విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)