పెద్దజీయర్ స్వామి - ఇవి.రామస్వామి నాయకర్ (పిరియార్) |
దేశవ్యాప్తంగా రామ జన్మభూమి మందిర నిర్మాణ ఉద్యమం జోరుగా సాగుతోంది. అత్యంత పేదలు సైతం శక్తికి మించి ధనాన్ని సమర్పించుకుంటున్నారు. మరోప్రక్క ఆంధ్రప్రదేశ్‌లో రామ అపచారం కొనసాగుతోంది. రామాపచారం, దర్శాపచారం, దైవ దూషణ జరిగినప్పుడు క్రోధం, దుఃఖం చాలదు. సామాన్య హిందువులను ఉద్యమం మార్గాన నడిపించే దారిని దర్మాచార్యులు ఎలా చూపవచ్చు అని తెలిపే వ్యాసం, ఒక చరిత్ర.
రాముడికి అపచారం జరిగిన చోటే శ్రీరామ క్రతువు..
పెరియార్‌గా పిలిచే 'ఇ.వి. రామస్వామి నాయకర్' రాజకీయ జీవితం జాతీయ కాంగ్రెస్ తో ప్రారంభమైంది. తర్వాత ఆయన బ్రిటీష్ పాలకులకు అనుకూలమైన, బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్పా ర్టీలో చేరారు. విదేశీ పర్యటనల ప్రభావంతో హిందూమత వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన సామాజిక అసమానతల నిర్మూలన ఉద్యమం " హిందూమత వ్యతిరేక ఉద్యమ దిశలో " నడిచింది.పెరియార్ పై కమ్యూనిస్టు నాయకుల ప్రభావం కూడా ఉండేది. 1956లో పెరియార్ మద్రాస్ నగర వీధులలో శ్రీరాముని చిత్రపటానికి చెప్పుల మాల వేసి అవమానపరుస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఘటనతో హిందూసమాజం విస్తుపోయింది.
పెద్దజీయర్ స్వామిగా మనం పిలుచుకునేవారు అప్పటికి ఇంకా సన్యాస దీక్షను స్వీకరించలేదు. వారు గృహస్క బాధ్యతలను పూర్తి చేసుకొని సన్యాసం స్వీకరించి పెద్దజీయర్ స్వామి అయ్యారు. చెన్నై నగర వీధులలో జరిగిన రామాపచారాన్ని తొలగించే కార్యాచరణకు వారు ఉపక్రమించారు.
చెన్నై నగరంలో ఏయే వీధుల గుండా శ్రీరాముని చిత్రపటానికి అవమానం జరిగిందో అదే వీధులలో రోజులపాటు శ్రీరామపూజా కార్యక్రమం నిర్ణయంచేశారు. పూజ నిర్వహణ కోసం వేదపండితులను రప్పించారు. కానీ వారికి ఆశ్రయం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. వారు రోడ్డుపక్కనే ఫుట్ పాత్ మీద కొన్ని రాత్రులు నిద్రించారు. దీనిని చూసి హిందువులు చలించిపోయారు. మూడు నాలుగు రోజుల తర్వాత స్థానికులు ధైర్యం తెచ్చుకొని ఆ వేద పండితులకు ఆశ్రయం ఇచ్చారు. ప్రజలు శ్రీరామ పూజలో పెద్దఎత్తున పాల్గొనడం, అన్ని విధాలా సహకరించడం ప్రారంభమైంది. ప్రజల్లో అంతరంగంగా ఉన్న రామభక్తి బయటకు వ్యక్తం కావడం ప్రారంభమైంది. పూజ చివరినాటికి ప్రజలందరూ శ్రీరామ భక్తి ప్రవాహంలో మునిగి తేలారు. నగరమంతా రామమయం అయింది. రామ పూజ ప్రభావం తమిళనాడు మొత్తం విస్తరించింది. ఈ రామభక్తి సాగరాన్ని దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పెద్దజీయర్‌స్వామి
ఇంటింటా రామకోటి :
ఇంటింటా శ్రీరామ నామాన్ని. 'కోటిసార్లు రాయాలి' అని స్వామిజీ పిలుపునిచ్చారు. అలా రామకోటి రాసినవారు ఆ పుస్తకాలతో శ్రీరామ క్రతువుకు రావాలి. 28 రోజులపాటు శ్రీరామ క్రతువు జరుగుతుంది. చివరలో అక్కడ శ్రీరామ క్రతువు జరిగినట్లుగా శ్రీరామ జపస్తంభం నిర్మాణం ప్రారంభం అవుతుంది. అయితే అందుకయ్యే ఖర్చు ఎలా? ఒకరో, ఇద్దరో ధనవంతులు ఇవ్వడం కాదు దీనిలో రామభక్తులందరి భాగస్వామ్యం ఉండాలి. శ్రీరామ స్తంభం నిర్మాణం కోసం తెప్పించిన 10వేల ఇటుకలపై ప్రతిఒక్క రామ భక్తుడు శ్రీరామ అని రాసి, ఒక్కో ఇటుకపై ఒక రూపాయి సమర్పించాలి. ఆ విధంగా వచ్చిన 10వేల రూపాయలు, ఆ పదివేల ఇటుకలతో శ్రీరామ జపస్తంభం నిర్మాణం జరిగింది.
108చోట్ల శ్రీరామ క్రతువులు :
ఒకచోట 28 రోజుల శ్రీరామ క్రతువు పూర్తయిన వెంటనే ముందస్తు యోజనతో పెద్దజీయర్ స్వామి మరొక స్థలంలో శ్రీరామ క్రతువు ప్రారంభించేందుకు వెళ్లేవారు. ఈ విధంగా నేపాల్ తో సహా దేశవ్యాప్తంగా 107 చోట్ల శ్రీరామ క్రతువులు, శ్రీరామ జప స్తంభాల నిర్మాణం చేపట్టారు. ఈ శ్రీరామ ధర్మ ప్రచార ఉద్యమాన్ని ఏకబికిన పది సంవత్సరాలు చేశారు. 108వ శ్రీరామ క్రతువును కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల దివ్య క్షేత్రంలో చేశారు.
ప్రతి ఇంటా శ్రీరామ కోటి రాయడం, అలా 10 వేల మందితో 28 రోజుల శ్రీరామ క్రతువు, ఆలా 10 వేల మంది రామభక్తులు సమర్పించిన ఒక్కో రూపాయి ద్వారా శ్రీరామ జపస్తంభ నిర్మాణం, ఈ విధంగా దేశవ్యాప్తంగా 108 చోట్ల నిర్వహణ, ప్రతిచోట, ప్రతి అడుగులో సామాన్య రామభక్తుల భాగస్వామ్యం. ఇది శ్రీరామ జపయజ్ఞ ఉద్యమ చరిత్ర. దీనితోనే కథ పూర్తికాలేదు.
ఆ మౌనం వెనుక ఎన్నో అర్ధాలు :
దేశవ్యాప్తంగా 108చోట్ల కార్యక్రమాలు పూర్తి చేసుకొని పెరియార్ 1972లో పెద్దజీయర్ స్వామి
ట్రిచిలో కలిశారు. వీరి రాకతో పెరియార్ ఆశ్చర్యపోయారు. తన స్వీయ అనుభవాలను పెరియార్వి వరించారు. 'నా తండ్రి శ్రీరామ భక్తుడు. అలాంటి కుటుంబంలో నేను పుట్టాను. ఒకరోజు శ్రీరాముని విగ్రహంపై సాలెపురుగు ప్రాకడం చూశాను. తనపై సాలెపురుగు ప్రాకుతున్నా ఏమీ చేయలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు? అని హిందూ మత వ్యతిరేకి అయ్యాను' అని వివరించారు.
దానికి పెద్దజీయర్ స్వామి సమాధానమిస్తూ " మీరు మీ అబ్బాయిని తలపైకి ఎక్కించుకోరు. మీ ఒళ్లో కూర్చోపెట్టుకుంటారు. మీ మనవడిని అయితే భుజంపై ఎక్కించుకుంటారు. మీ ముని మనవడిని అయితే తలపైకి ఎక్కించుకుంటారు. అంతేకదా! ఇది సహజం. అలాగే భగవంతుడు ఆ అల్పప్రాణి సాలె పురుగు తనపైన ప్రాకుతూ ఉంటే ఎందుకు తోసేస్తాడు? మనలాగా మరింతగా ఆనందించడా? దేవునికి మనుషుల పట్లే కాదు, అన్ని జీవులపట్ల ఎంతో ప్రేమ, వాత్సల్యం ఉంటుంది' అని వివరించారు. 'నాడు నేను ఈ రకంగా ఆలోచించలేకపోయాను' అని పెరియార్ చెప్పారు.
పెద్దజీయర్ స్వామి లేచి 'నాకంటే మీరు పెద్ద రామభక్తులు. మీ అమ్మ, నాన్న మీకు పెట్టిన పేరు రామస్వామి నాయకర్. మీ 93 ఏళ్ల దీర్ఘ జీవనంలో మీ పేరుతో సంతకాన్ని లక్షల సార్లు పెట్టారు. కాబట్టి మీరు పెద్ద రామభక్తులే. నమస్కారం.' అని సెలవు తీసుకుని వచ్చేశారు. పెరియార్ చకితులై మౌనం వహించారు. ఆ మౌనం వెనుక ఎన్ని అర్థాలో....
వ్యాసకర్త : అఖిల భారత కన్వీనర్ - కె.శ్యామ్ ప్రసాద్
సామాజిక సమరసతా వేదిక