దేవాలయము ! |
హిందూ ఆలయాల సొమ్ము - సెక్యులర్ సర్కార్ల పాలు
రాజుల సొమ్ము రాళ్లపాలు అనేవారు. ఆధునిక కాలంలో ఏం జరుగుతోంది? తమిళనాడులో 30,000 గుళ్ళలు, 56మఠాలు , వీటికి చెందిన 4,78,000 ఎకరాలు ప్రభుత్వం గుప్పెట్లో ఉన్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ఎవరికి ఎవరూ తీసిపోకుండా ఆలయ ఆస్తులను తస్కరిస్తూనే ఉన్నారు. దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో (34,000) కుడా అత్యధికంగా హిందూ దేవాలయాలు ప్రభుత్వం చెరలో ఉన్నాయి. అటు శ్రీకూర్మం అరసవల్లి, సింహాచలం, అన్నవరం, విజయవాడ దుర్గ, ద్వారకా తిరుమల, అంతర్వేది.. వందలాది దేవాలయాలు.. ఒకటి రెండు తప్ప మిగిలిన వాటి పాలన గురించి ఎవరూ మంచిమాట చెప్పలేరు.
దేవస్థానాల ఉద్దరిస్తామని తీసుకున్న ప్రభుత్వం కనీసంగా తన కర్తవ్యం నిర్వహించడం లేదని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నదే సాక్ష్యం. తిరుమల బంగారం తాకట్టు వ్యవహారం, దుర్గుడి రథం వెండి సింహాల మాయం, రామతీర్థంలో దుర్ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఇవన్నీ ప్రభుత్వ అధికారుల హయాంలోనే జరిగాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 445 ఆలయాలు ఉన్నాయి. చిలుకూరు బాలాజీ దేవాలయం, బాసర, యాదగిరిగుట్ట, కీసర వేములవాడ వంటి గొప్ప క్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి.
లక్షల ఎకరాలు అన్యాక్రాంతం :
చెన్నై భక్త సంఘం అధ్యక్షుడు టీఆర్ రమేశ్ ఇచ్చిన వివరాలు చూద్దాం. 1986- 2005 మధ్య 47,000 ఎకరాల తమిళనాడు ఆలయాల భూమి అన్యాక్రాంతమైందని ఆయన లెక్క చెప్పారు. ఎంతో విలువ చేసే కోటి చదరపుటడుగుల స్థలాలు కూడా కబ్జాలో ఉన్నాయని అన్నారు. తమిళనాడులోని హిందూ దేవాలయాలకు 4,78,000 ఎకరాల భూమి, 2.44 చదరపు అడుగుల కోట్ల విలువచేసే స్థలాలు ఉన్నాయి. వీటన్నిటి మీద రాష్ట్ర దేవాదాయ శాఖ పొందుతున్నది కేవలం ఏడాదికి రూ.58 కోట్లు.. ఇక దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఆలయాల నుంచి అదృశ్యమైన అద్భుత కళాఖండాలు ఎన్నో!
కేరళ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. హిందూధర్మం మీద గౌరవం లేని కమ్యూనిస్టుల పాలనలో అక్కడి హిందూ దేవాలయాలు ఎలాంటి దుస్థితికి లోనవుతున్నాయో అయ్యప్ప ధర్మసేన ఆ అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ చెప్పారు. కేరళలో నాలుగు దేవస్థానాలు ఉన్నాయి. గురువాయుర్, మలబార్, తిరువనంతపురం, కొచ్చిన్. ప్రతి దేవస్థానానికి సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుంది. కమ్మూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల పార్టీ సభ్యులతో దేవస్థానం బోర్డులను నింపుతారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎజువాలు, నాయర్ల మధ్య సమతౌల్యం పాటిస్తుంది. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల ప్రాతిపదికగానే జరుగుతుంది' అన్నారాయన.
హుండీల ద్వారా వచ్చిన ధనాన్ని సనాతన ధర్మానికి గాని, పేద హిందువుల కోసం గాని, ఆసుపత్రుల కోసం గాని, అనాథాశ్రమాల కోసం గాని వినియోగించరు. కానీ ఖర్చు మాత్రం కనిపిస్తుందని కూడా చెప్పారాయన. కర్ణాటకలో 34,500 ఆలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. హిందూత్వం మీద నమ్మకం లేని కమ్యూనిస్టులు, ద్రవిడ పార్టీలు ఆలయాల వ్యవహారాలలోకి చొరబడుతున్నారంటే దండుకోవడానికి తప్ప మరొక ఉద్దేశంతో కానేకాదు.
మధుర మీనాక్షి: ఏప్రిల్, మే మాసాలలో జరిగే తిరు కల్యాణోత్సవానికి పది లక్షల మంది హాజరవుతారు. పదిరోజుల పాటు జరుగుతుంది. వార్షికాదాయం రూ.6 కోట్లు |
కొవిడ్ 19 కోసం దేవుడి డబ్బా!
ఏప్రిల్ 22, 2020న తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఒక ఆదేశం పంపించింది. కొవిడ్ 19ని ఎదుర్కొనడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల సేకరణకు సంబంధించిన దివ్య సందేశమది. ఈ సందేశం మీద, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం మీద రెండువారాలు మాటల యుద్ధం జరిగిన తరువాత, ఎవరో ఆ రాష్ట్ర హైకోర్టును అశ్రయించిన మీదట ప్రభుత్వం మొత్తానికి వెనక్కి తగ్గింది.
ప్రభుత్వం చెరలో ఉన్న 47 హిందూ దేవాలయాలకు కూడా ఆ సందేశం వెళ్లింది. కొవిడ్ 19తో పోరు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 కోట్లు అందచేయమని ఆ సందేశం సారాంశం. కానీ ఈ సందేశం చర్చ్లకీ, మసీదులకీ వెళ్లలేదు. ఇంకొక మార్పును కూడా ఈ సందేశం విషయంలో గమనించాలి. గతంలో అయితే ద్రావిడ పార్టీల ప్రభుత్వాలు కోర్టులకి ఎక్కి తమ ఆశయాలు ఎంత గొప్పవో వాదించేవి. కానీ ఈసారి మాత్రం ప్రస్తుత ప్రభుత్వం ఆ సందేశాన్నే ఉపసంహరించుకుంది. ఈ తాజా పరిణామం కూడా అసలు హిందూ దేవాలయాలు ప్రభుత్వాల చెరలో ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకు పదును పెట్టింది.
అదేం కర్మమో తెలియదు కానీ, తమిళ ప్రాంత హిందువులు మత విశ్వాసాల పట్ల చాలా అనురక్తితో ఉంటారు. అయినా అక్కడ హిందూధర్మానికీ, హిందూ ఆలయాలకీ, దేవతామూర్తులకూ జరిగినంత అవమానం ఎక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు బూటకపు ద్రవిడ ఉద్యమం కారణం. అక్కడ రాజకీయాలు కూడా హిందూ వ్యతిరేకతే కేంద్ర డీఎంకే బిందువుగా సాగుతూ ఉంటాయి. అన్నా ఈ తిక్క నుంచి అన్నా డిఎంకె నుంచి కొంచెం బయటపడినా, డీఎంకే మాత్రం ఇంకా ఆ తలతిక్కతోనే బతుకుతోంది.
ప్రజలలో హిందూధర్మం పట్ల వైయక్తికమైన చింతనే తప్ప, సమైక్య శక్తిగా ఆవిర్భవించాలన్న దృష్టి కనిపించదు. కరుణానిధి అనే డీఎంకే నాయకుడు హిందూ ధర్మాన్నీ, హిందూ దేవుళ్లనీ అంతగా కించపరిచినా ఆయనకే ప్రజలు 'పూజలు' చేయడం కనిపిస్తుంది. అక్కడ రాజకీయాలు, పాలకులు హిందూ ద్వేషంతో నడిచాయి. అందుకే ఆలయాల రక్షణకు తరచుగా కోర్టులను ఆశ్రయించవలసిన పరిస్థితి.
ధర్మానికి చెర' ఇక్కడి నుంచే :
పాలకుల అధీనంలోకి హిందూ దేవాలయాలు వాటి ఆస్తులు వెళ్లడం తమిళ ప్రాంతంలోనే ఆరంభమైంది. 1789లో ఈస్టిండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదకరమైన ధోరణిని ప్రవేశపెట్టింది. మద్రాసు ప్రెసిడెన్సీ అంతా అంటురోగంలా అంటించింది. అంతవరకు స్థానికంగా ఉండే భక్తులు, వర్గాలే ఆలయాల నిర్వహణ చూసుకునేవి. చాలా దేవాలయాలు సమాజ శ్రేయస్సుకు ఉపకరించే కార్యక్రమాలు సహజంగానే నిర్వహించేవి. ధర్మశాలలు, గోశాలలు, పాఠశాలలు ఆలయాల ద్వారా అందుబాటులో ఉండేవి. మరి ఇప్పుడేవి? ఈస్టిండియా కంపెనీ ఈ దేశానికి ఒక చేత్తో కత్తితో, ఒక చేత్తో బైబిల్ పట్టుకునే వచ్చింది. కొద్దికాలానికి బైబిల్ ఇక్కడి వాళ్ల చేతికి వచ్చి, భూమి వాళ్ల చేతుల్లోకి పోయింది. కంపెనీ లక్ష్యాలలో క్రైస్తవ విస్తరణ ఒకటి. కానీ హిందూ దేవాలయాలను ఆక్రమించుకున్నా అంతా తామే చక్కబెట్టడం లేదనీ హిందువుల ధార్మిక వ్యవహారాలలో చొరబడడం లేదనీ నమ్మించడానికి స్థానిక పూజారులు, అర్చకులు వేదపండితులు వంటివారిని ఆలయాల వ్యవహారాల లోకి అనుమతిస్తూ ఉండేది.
నెమ్మదిగా 1840 ప్రాంతానికి ఆలయాల బాధ్యత మఠాలకు, ఆశ్రమాలకు వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. హిందూదేవుళ్ల ఆస్తుల బాధ్యత కంపెనీ స్వీకరించడం మిషనరీలకు నచ్చలేదు. అందుకే గుడుల మీద మఠాల మీద కంపెనీ అజమాయిషీ ఎనభయ్ సంవత్సరాల కంటే సాగలేదు. బ్రిటిష్ రాణి పాలనలో 'అంటే 1863లో ది రెలిజియస్ ఎండోమెంట్స్ యాక్ట్, వచ్చింది. దీని ఉద్దేశం కూడా అధికారుల చేతిలో ఉన్న దేవాలయాల నిర్వహణ ధర్మకర్తలకు అప్పగించడమే. తరువాత, బ్రిటిష్ తొత్తు జస్టిస్ పార్టీ తెల్లవాళ్లను మించి హిందూధర్మానికీ, ఆ ధర్మానికి కేంద్రంగా ఉండే దేవాలయాలకీ కీడు తలపెట్టింది.
మద్రాస్ హిందూ రెలిజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ 1925 జస్టిస్ పార్టీ పైత్యమే, దీని ప్రకారం ఏర్పడినదే హిందూ రెలిజియస్ ఎండోమెంట్ బోర్డ్, ఇక్కడే ఒక సంగతి గుర్తు చేసుకోవాలి. మొదట ఈ చట్టం పరిధిలోకి చర్చ్లనీ, మసీదులనీ తెచ్చారు. కానీ ఆ రెండు వర్గాలు పెద్ద ఎత్తున తిరగబడడంతో వాటిని మినహాయించి హిందూ ఆలయాలను మాత్రం లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడ ఇలా జరిగితే దేశంలోని గురుద్వారాల గురించి ఆంగ్ల ప్రభుత్వం ఇంకొక చట్టం చేసింది. దాని ప్రకారం గురుద్వారాలను ఎంపికైన ధర్మకర్తల మండళ్లు నిర్వహించుకుంటాయి. అంటే హిందువులకు ఒక న్యాయం సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులకు ఒక న్యాయం.
__జాగృతి సౌజన్యంతో {full_page}