చిత్తూరు జిల్లా పీలేరు నేషనల్ హైవే నందు గల శ్రీ సిధ్ధగిరి క్షేత్ర భగవాన్ శ్రీ రామతీర్ధ సేవా ఆశ్రమం నందు ఆశ్రమ పిఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ అచ్యుతానందగిరి స్వామి వారు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు కొందరు స్వామిని హత్య చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షుల కథనం.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ పరిధిలోని అక్కంచెరువు పల్లి శివాలయంలో గత 20 సంవత్సరాలుగా పూజలు నిర్వహిస్తూ ఉండిన శ్రీ శ్రీ శ్రీ అచ్యుతానంద గిరి స్వామిమంగళవారం రాత్రి 8.30 గంటలకు హత్యకు గురయ్యారు. స్వామి అచ్యుతానంద స్వగ్రామం చిత్తూరు జిల్లా తమలంపల్లె మండలం అరగొండ. శివాలయం సమీపంలోనే రామతీర్థ సేవా ఆశ్రమం పేరుతో అచ్యుతానంద ఒక ఆశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. పాకాల మండలం మగరాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ గత 13 సంవత్సరాలుగా ఆశ్రమంలోనే ఉంటూ దైవ సేవ చేసుకుంటూ ఉన్నారు. ఘటన జరిగినప్పుడు లక్ష్మమ్మ కూడా ఆశ్రమం లోనే ఉన్నారు. అయితే దుండగులు స్వామీజీని చంపడానికి యత్నిస్తుండడంతో తాను ప్రాణభయంతో పక్కనే ఉన్న మామిడి తోపులోకి పారిపోయానని ఆమె తెలిపారు.
కేసు పూర్వాపరాలను విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. స్థానిక బిజెపి కార్యకర్తలు ఆదినారాయణ, మునీంద్రాచారి తదితరులు ఘటనాస్థలిని సందర్శించారు. తన జీవితాన్ని భగవత్సేవకు అంకితం చేసిన ఒక నిస్వార్థ సేవామూర్తి ఇంత దారుణంగా హత్యకు గురికావడం అత్యంత బాధాకరమని, నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు చిత్తూరు డీ ఎస్పీని కోరారు.
__విశ్వ సంవాద కేంద్రము