వివాహానంతరం బలవంతపు మతమార్పిడిని నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ చట్టాల చెల్లుబాటును పరీక్షించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక చట్టాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ‘సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ అనే ఎన్జీవో, న్యాయవాది విశాల్ఠాక్రే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ చట్టాల్లోని కొన్ని నిబంధనలు దౌర్జన్యంగా ఉన్నాయని, ప్రభుత్వం అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనడం విచారకరమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నిబంధనలు లౌకికవాదం, సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. చట్టాల చెల్లుబాటును సర్వోన్నత న్యాయస్థానం సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అప్పటివరకు చట్టాల అమలుపై స్టే విధించాలని కోరారు.
ఈ పిటిషన్లను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వీటిపై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వాల వాదన వినకుండా చట్టాలపై స్టే ఇవ్వడం కుదరదని సీజేఐ జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు.
వివాహల కోసం మతమార్పిడిని నేరంగా పరిగణిస్తూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇటీవల కొత్తచట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం.. పెళ్లి తర్వాత మతం మారాలనుకుంటే రెండు నెలలు ముందుగానే జిల్లా అధికారులకు సమాచారం అందజేయాలి. అంతేగాక, ఎవరి బలవంతం లేకుండా మతం మార్చుకుంటున్నానని రుజువు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చట్టాల కింద ఆయా రాష్ట్రాలు పలువురిని అరెస్టు చేశాయి. అటు మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్లలోనూ ఈ చట్టాలను తీసుకొచ్చారు.
__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)