విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాములవారి విగ్రహం స్థానంలో ప్రతిష్టించేందుకు లక్ష్మణ సమేత సీతారాముల వారి విగ్రహాల తయారీ తుది దశకు చేరుకుంది. విగ్రహాల తయారీకి దేవాదాయశాఖ నుంచి తితిదేకు ఈనెల 8న విజ్ఞప్తి వచ్చింది. వెంటనే కంచి నుంచి కృష్ణశిలను తెప్పించి, ముగ్గురు స్థపతులు విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు.
శ్రీరాముడి విగ్రహం పీఠంతో కలిపి మూడున్నర అడుగుల ఎత్తు, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులుగా తయారు చేస్తున్నారు. స్థపతులు తొలుత 15 రోజుల వ్యవధిలో విగ్రహాలు ఇస్తామని చెప్పినా.. కేవలం 10 రోజుల్లోనే పూర్తిచేశారు. బుధవారం సాయంత్రానికి పూర్తి కానున్నాయని, 21న తితిదే శిల్ప తయారీ కేంద్రం నుంచి దేవాదాయశాఖ అధికారులు విగ్రహాలకు పూజలు నిర్వహించి రామతీర్థానికి తీసుకెళ్తారని సమాచారం.
___విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)