శివ భగవానుడు |
ప్రదోష వ్రతం లేదా ప్రడోశం (హిందీ: प्रदोष Tamil, తమిళం: మాదళం, తెలుగు: ఇక్కడే, మలయాళం: మదళం:! కృష్ణ పక్ష మరియు శుక్ల పక్ష రెండింటి యొక్క త్రయోదశి తిథి (13 వ రోజు) లో ప్రదోష్ వ్రతాన్ని గమనించవచ్చు. కాబట్టి, ఇది హిందూ క్యాలెండర్లో ప్రతి నెలా రెండుసార్లు వస్తుంది.
ప్రదోష వ్రతాన్ని వయస్సు, లింగభేదం లేకుండా అందరూ ఆచరించవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ వ్రతాన్ని పూర్తి భక్తి, అంకితభావంతో ఆచరిస్తారు. ఈ వ్రతం పరమశివుడు మరియు పార్వతీదేవి గౌరవార్థం జరుపబడుతుంది.
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు.
దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం. ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్థనారీశ్వరునిగా అతిప్రసన్నుడై దర్శనమిస్తాడు. శనివారం, త్రయోదశి, ప్రదోషం మూడూ కలిస్తే అవి శుభఘడియలుగా పరిగణించవచ్చు. గ్రహపీడా నివారణకు, శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్నవారికి శని ప్రదోష సమయం దైవానుగ్రహ కాలంగా పరిగణిస్తారు. ప్రదోషకాలం అంటే ఏమిటి, ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకోండి.
మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో,హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహారించేటప్పుడు,అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.
- త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం
- త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం
- త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషం
- త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం
- త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం
- త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం
- త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.
ప్రదోష వ్రతం ఆచరించే విధానం:
ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.
వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానమాచరించి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయం వరకు గడపాలి. ఉపవాసం చేయలేనివారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు అంటే పాలు, పండ్లు వంటివి తిని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అయితే త్రయోదశి నాడు వండని అంటే ఉడికించని పదార్థాలను స్వీకరించి, మరుసటి రోజు వండిన ఆహారం భుజించాలి. అంటే వ్రతం నాడు పక్వపదార్థాలు నిషేధం అని చెబుతారు. సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం, సూర్యాస్తమయం తర్వాత ఒక గంట వరకూ ఉంటుంది. ఈ సమయంలోనే ప్రదోష వ్రతం నిర్వహించాలి. అంటే రెండున్నర గంటలపాటు పూజ జరుగుతుంది.
ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. సాయంత్రం ఈ పూజ జరుగుతుంది. ఏ వయసు వారైనా, స్త్రీపురుష భేదం లేకుండా ప్రదోషవ్రతం ఆచరింపవచ్చు. స్కందపురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని రెండు విధాలుగా ఆచరింపవచ్చు. మొదటిది రాత్రి, పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం. రెండవ విధానం క్రింద సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం. సాయింత్రం శివపూజ జరిపిన తర్వాత ప్రసాదం స్వీకరించి వ్రతం పూర్తిచేయడం. నిర్వహించేవారి ఓపిక, సానుకూలత ప్రకారం వ్రతం జరపవచ్చు.