ఏపీలోని ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీతానగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చినజీయర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే దారుణమైన స్థితి దాపురించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈనెల 14తో ధనుర్మాస దీక్ష పూర్తవుతుందని.. 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు ధ్వంసమైన ఆలయాల సందర్శనకు యాత్ర చేపడతామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులను కలిసి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవాలని భావిస్తున్నామన్నారు. ధర్మజాగృతి కలిగిన పెద్దలందరినీ కలిసి వారి సహకారంతో చేయాల్సిన కార్యక్రమాలను త్వరలో నిర్ణయిస్తామని చినజీయర్ వివరించారు.
ఆలయాలపై సరైన విధంగా దృష్టి పెట్టకపోవడంతోనే అక్కడ జరిగే లోపాలు క్రమంగా బయటపడుతున్నాయని చినజీయర్ స్వామి అన్నారు. ఘటనలు జరిగిన చోట్ల ఆలయాలు దెబ్బతగిలిన స్థితిలో ఉన్నాయని.. ఉపశనం కలిగించేలా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆలయాల ఉనికికే భంగం కలిగే స్థితి వచ్చినపుడు మౌనంగా ఉండకూడదనే తాము బయటకు వస్తున్నామని చెప్పారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరు ఎలాంటి తప్పు చేసినా తగిన రీతిలో వారిని దండించాల్సిన అవసరముందన్నారు. ఆలయం, చర్చి, మసీదు.. ఇలా ఏ విషయంలో జరిగినా బాధ్యులను గుర్తించి శిక్షించాలన్నారు. వ్యక్తులు తమ ప్రచారం కోసం ఈరకమైన పద్ధతిని ఎంచుకోవడం మంచిది కాదన్నారు. వ్యక్తులు, సమాజం సహనాన్ని పరీక్షించడానికీ ఓ హద్దు ఉంటుందని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మతపరమైన విషయాల్లో రాజకీయాలను ముడిపెట్టకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రభుత్వాల పెద్దలు ప్రజలకు భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని.. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిలో ఆధ్యాత్మిక భద్రత ఏర్పడితే అక్రమాలు, అన్యాయాలు చాలా వరకు తగ్గిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)