పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకలాపాలున్న తొమ్మిది రాష్ట్రాల్లో కనీసం 26 ప్రదేశాలలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం దాడి చేసింది. మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా పిఎఫ్ఐ చైర్మన్ ఓ ఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర అధ్యక్షుడు నసరుద్దీన్ ఎలామరోమ్ స్థావరాలపై ED దాడి చేసింది.
తమిళనాడు, కర్ణాటక, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ మరియు కేరళలోని మలప్పురం, తిరువనంతపురం జిల్లాల్లోనూ ఈడీ శోధిస్తున్నట్లు తెలిసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రాల్లోని కనీసం 26 ప్రదేశాలలో ఈ దాడులు జరుగుతున్నాయి. సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సిఎఎ వ్యతిరేక అల్లర్లలో పిఎఫ్ఐ యొక్క “ఆర్థిక సంబంధాలను” కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. పిఎఫ్ఐ నాయకుడు మరియు కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డులో ఉన్నతాధికారి అయిన సలాం మరియు రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థలకు చెందిన ఇతర నాయకుల వాంగ్మూలాలను ఏజెన్సీ ఇంతకుముందే రికార్డ్ చేసింది.
“పిఎఫ్ఐ నాయకుల ఇళ్లలో ED సోదాలు నిర్వహిస్తోంది. అయితే ఇది రైతుల సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను దాచడానికి ప్రభుత్వం చేస్తున్న ఘోరమైన ప్రయత్నం” అని సలాంను ఉటంకిస్తూ పిఎఫ్ఐ తెలిపింది. “రాజ్యాంగ సంస్థలను ఈ ప్రభుత్వం రాజకీయ సాధనాలుగా ఉపయోగిస్తున్నదనటానికి ఇది మరొక ఉదాహరణ. ఇటువంటి చర్యలు న్యాయం కోసం గొంతెత్తుతున్న మమ్మల్ని ఆపలేవు. హక్కుల కోసం చేసే ప్రజాస్వామ్యయుత పోరాటాలను బలహీనపరచలేవు” అని కూడా PFI తెలిపింది.
సిఎఎ వ్యతిరేక అల్లర్లకు సంబంధించి పిఎఫ్ఐ, భీమ్ ఆర్మీల మధ్య జరిగిన “ఆర్థిక లావాదేవీలను” పరిశీలిస్తున్నట్లు ఏజెన్సీ గత నెలలో తెలిపింది. “సీనియర్ పిఎఫ్ఐ అధికారుల నుండి స్వాధీనం చేసుకున్న విశ్వసనీయ ఆధారాల ఆధారంగా పిఎఫ్ఐ మరియు భీమ్ ఆర్మీల మధ్య ఆర్థిక సంబంధాలను ఇడి పరిశీలిస్తోంది” అని ఏజెన్సీ ట్వీట్లో పేర్కొంది.
ఇదిలావుండగా, కేరళలోని వివిధ ప్రాంతాల్లో ED నిర్వహించిన దాడులపై పిఎఫ్ఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. కోపంతో ఉన్న గుంపు తిరువనంతపురం, కొచ్చిలోని ఇడి అధికారులకు వ్యతిరేకంగా నారా-ఎ-తక్బీర్, అల్లాహు అక్బర్ వంటి నినాదాలు చేశారు.
Source: The Print
__ విశ్వ సంవాద కేంద్రము