లవ్ జీహాద్ |
జీహాద్ అంటే ‘పవిత్ర యుద్ధం’ అని అందరికీ తెలుసు. మధ్యయుగంలో ముస్లింలు మత వ్యాప్తికోసం ఇతర మతసమూహాల పై, జాతులపై చేసిన యుద్ధాలకు జిహాద్ అని పేరు. మత వ్యాప్తి కోసం చేసిన యుద్ధాలు కాబట్టి వాటిని ‘పవిత్ర యుద్ధాలు’గా వారు పేర్కొన్నారు. అయితే ఇస్లామ్ వ్యాప్తి కోసం చేసే ప్రతికృషిని ఆ పేరుతో ఆధునికులు ఇప్పుడు పిలుస్తున్నారు. యుద్ధం మాత్రమే కాదు ప్రేమ, పెళ్ళిళ్ళు కూడా ఇస్లామ్ వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయ్యా? పరిశోధకులు, పరిశీలకులు ఏమి చెప్తున్నారు?
రాబర్ట్ ఎప్సిన్ (Robert Epstein) ప్రసిద్ధి చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త |
హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ ఎప్సిన్ (Robert Epstein) ప్రసిద్ధి చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త, వివాహాల గురించి చేసిన పరిశోధనలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా అమెరికాలో ప్రేమ ముందు, పెళ్ళి తర్వాత అన్నవిషయం మనందరికీ తెలిసిందే మనదేశంలో అందుకు భిన్నంగా పెళ్ళిముందు, ప్రేమలు తర్వాత అన్న అంశమూ మనకు తెలిసిందే. ఇవే విషయాలను ఆయన సాధికారికంగా చెప్పారు. భారతదేశంలో ఈనాటికీ పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువ. ప్రేమ వివాహాలు కూడా పెద్ద పెట్టున జరుగుతున్నప్పటికి, పెద్దలు కుదిర్చే వివాహాల ప్రాధాన్యత తగ్గలేదని ఆయన అంటున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళతో పోటీపడుతున్నాయి. అయితే మరొక కొత్త రకం పెళ్ళిళ్ళు కూడా పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళకు పోటీగా నిలుస్తున్నాయి. అవే లవ్ జిహాద్ పెళ్ళిళ్ళు. ఒక దశాబ్దం కిందట మతాంతీకరణ లక్ష్యంగా చేసుకొనే పెళ్ళిళ్ళు కేరళలో మొదలయ్యాయి. ఇప్పుడు వ్యూహత్మకంగా భారతదేశమంతటా వ్యాపించాయి
'లవ్ జీహాద్’ అనే పదం మొదటిగా పుట్టినప్పుడు హిందూ మతోన్మాదులు’ మత విద్వేషాలను రెచ్చగొట్టటానికి చేస్తున్న ప్రచారంగా కొట్టి వేసిన వాళ్ళు సైతం ఇప్పుడు ఈ సమస్యను గుర్తిస్తున్నారు. ఈ సమస్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు, హిందూమతోన్మాదులకు అతీతంగా సమాజం ఇస్లాం వ్యాప్తి చేస్తున్న ఈ వలపు ఉద్యమపు సవాలును గురించి ఆందోళన చెందుతోంది. మతవ్యాప్తికి వలపును ఒక పనిముట్టుగా, సాధనంగా వాడుకోవచ్చునని గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించటం, కృషి చేయటం మతవ్యాప్తికి ఉపయోగపడే సాధనాలలో గొప్ప ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. మానవులలో సహజంగా ఉండే రెండు అనురక్తులు రక్తి, భక్తిలను కలగలిపి, వ్యక్తిగత భావోద్వేగాలను సామూహిక భావోద్వేగమైన మతంతో ముడిపెట్టగలగటం సామాన్యమైన వ్యూహమేమి కాదు. అయితే ఆ వ్యూహ ఫలితాలు మాత్రము దారుణంగా ఉన్నాయి. వలపు ఉద్యమం వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, సంప్రదాయాలు మంట కలసిపోతున్నాయి. మత సమూహాల మధ్య అవిశ్వాసం పెరుగుతున్నది. అభద్రతా భావం పెచ్చు పెరుగుతున్నది. వ్యూహత్మకంగా ముస్లిమేతర యువతులను లక్ష్యంగా చేసుకొని చేపడుతున్న కొత్తరకపు వలపు మతాంతీకరణ శాశ్వత ముస్లింలకు, ఇతరులకు మధ్య అగాథాలను సృష్టించటంతో మత విద్వేషాలు పెరుగుతున్నాయి.
తేడా ఎక్కడుంది?
ఆహార, నిద్ర, భయ, మైథునాలు సర్వప్రాణులకు సహజం. మానవ ప్రకృతిలోనే ప్రేమించటం, కామించటం ఉంటాయి. యువతీ యువకుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సహజం. వయసురాగానే పొందుకోసం తహతహలాడటం కూడా సహజ పరిణామం. కులాలు, మతాలు వేరైనా ఇద్దరు యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టటమో, కామం జనించటమో సర్వసాధారణం. కనుక ప్రేమను, ప్రేమ వివాహాలను తప్పుపట్టనవసరంలేదు. అయితే ‘లవ్ జిహాద్’ ప్రేమ విలక్షణమైనది. ముస్లిం యువకులు ముస్లిమేతర యువతుల మధ్యే ప్రేమపుడ్తుంది. వలపు వికసిస్తుంది. అంతేకానీ ముస్లిం యువతులు, ముస్లిమేతర యువకుల మధ్య ప్రేమ పుట్టనే పుట్టదు. ఇస్లామ్ ముస్లిం యువతులకు ముస్లిమేతరులను ఎంచుకొనే స్వేచ్ఛను యివ్వలేదు. యువకులకు మాత్రం పూర్తి స్వేచ్ఛను యిచ్చింది. కనుక ముస్లిం యువకులు ముస్లిమేతర యువతులను ప్రలోభ పెట్టి, వలపు వలవిసిరి, తమకు లోబడిన తర్వాత పెళ్ళి చేసుకోవటానికి మతాంతీకరణ తప్పనిసరి చేస్తున్నారు. ఒకరికంటే ఎక్కువ మందిని భార్యలుగా చేసుకొనేందుకు వీలు ఉన్నది కాబట్టి పెళ్ళి అయిన యువకులు సైతం వలపువలలు విసురుతూ ఉంటారు. చిక్కిన వారిని మతం మార్చి భార్యలుగా చేసుకుంటున్నారు. సాధారణ ప్రేమ వ్యవహారాలకు, లవ్ జీహాద్ కు ఇదే ముఖ్యమైన తేడా.
ముస్లిం వ్యతిరేక భయం నుండి పుట్టలేదు
ఇస్లామ్ వ్యతిరేకత నుండి పుట్టుకొచ్చిన భావమే ‘లవ్ జిహాద్’ అని కొందరు అనుకొంటున్నారు. అయితే అందులో ఏమాత్రమూ వాస్తవం లేదు. వివిధ ముస్లిమేతర వర్గాల స్వానుభవం నుండే ఈ భావన పుట్టుకొచ్చింది. హిందువులు మాత్రమే కాదు. క్రైస్తవులు, బౌద్ధులు, ఇతరులు సైతం ‘లవ్ జిహాద్’ బాధితులే ముస్లిమేతరులందరిలోనూ లవ్ జిహాద్ పట్ల ఆందోళన ఉంది. లవ్ జిహాద్ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు ఇప్పటికే మనకు అర్ధం అయి ఉంటుంది. జిహాద్ కు, ప్రేమకు సంబంధమే లేదు. జీహాద్ అంటే వ్యతిరేకులపై చేసే యుద్ధం. ప్రేమ అంటే అభిమానించే వారిపట్ల యిష్టాన్ని ప్రకటించటం. ఇవిరెండూ పరస్పరం విరుద్ధమైన అంశాలు. కానీ జిహాద్ కు విస్తృతమైన అర్ధం కూడా ఉంది. జీహాద్ అంటే యుద్ధం మాత్రమేకాదు. యుద్దానికి మాత్రమే పరిమితంగా ఆ పదాన్ని ఆధునిక కాలంలో వాడటం లేదు. మతాన్ని వ్యాప్తి చెయ్యటానికి, సంఖ్యాబలాన్ని పెంచుకోవటానికి చేసే ప్రతి ప్రయత్నమూ జీహాద్ కిందకే వస్తుంది. కనుక కత్తితో చేయలేని పని కళ్ళతో సులభంగా చేయకలిగినపుడు కత్తిని ఉపయోగించటం అనవసరం కదా? కత్తిని ఎప్పుడు వాడాలో, కళ్ళను ఎప్పుడు వాడాలో తెలిసిన వారికి “లవ్ జీహాద్” అనేది ఇస్లామీకరణకు ఉపయోగపడే ఒకతేనె పూసిన కత్తి.
ఈ అంశానికి సంబంధించి చేసిన పరిశోధనలు ఆసక్తికరంగా ఉన్నాయి. స్వతంత్ర పరిశోధకులు, పరిశీలకులు చేసిన అధ్యయనాలు, వెలువరించిన పరిశోధనా పత్రాలు కీలకమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఫిలిప్సీ ఫార్యూస్ (Philippe Fargues) అనే పరిశోధకుడు ఇస్లామీకరణలో బలప్రయోగం, హింస ఒకప్పుడు ఎంత పాత్ర పోషించాయో, ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు కూడా అంతే పాత్ర పోషిస్తున్నాయని తన విశేష అధ్యయనం ముగిస్తూ వ్రాశాడు. హుస్సామ్ మునీర్ అనే ఇస్లామిక్ పండితుడు కత్తిబలంతో ఇస్లాం వ్యాప్తి చెందిందన్న అభిప్రాయం తప్పని వాదిస్తూ, ప్రేమ పెళ్ళిళ్ళు ఇస్లామీకరణలో ప్రధాన పాత్ర పోషించాయని సోదాహరణంగా వివరించాడు. ముస్లింలు, ముస్లిమేతురుల మధ్య జరిగిన పెళ్ళిళ్ళ వల్ల ముస్లింల సంఖ్యాబలం పెరిగిందని, అయితే ఈ ప్రేమ, పెళ్ళి వ్యవహారాల వల్ల మతం మారిన వారందరూ ముస్లిమేతరులేనని, పై పెచ్చు వారందరూ మహిళలే అని పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో ఈ అంశంపై ఆసక్తి పెరిగి, విస్తృత పరిశోధనలు వివిధ దేశాలలో మొదలయ్యాయని కూడా తన అధ్యయన పత్రంలో పేర్కొన్నాడు. ఇస్లామిక్ వలపు ఉద్యమం ద్వారా ఇస్లాం మత వ్యాప్తి చెందిన దేశాల జాబితాను కూడా ఆయన ప్రకటించాడు. స్పెయిన్ దేశంలో ప్రపథమ ముస్లిం సమాజం ఆవిధంగా ఏర్పడిందేనని, ఒట్టమాన్ల సామ్రాజ్య విస్తరణలోనూ ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ప్రధాన పాత్ర పోషించాయనే వాస్తవాలు వెలుగులోకి తెచ్చాడు. వలస పాలనాకాలంలోనూ అనేకమంది దళిత యువతులు ముస్లిం యువకులను పెళ్ళిళ్ళు చేసుకున్న కారణంగా ముస్లింలుగా మార్చబడ్డారని వ్రాశాడు. బలవంతపు మత మార్పిళ్ళ స్థానంలో ఆధునిక కాలంలో ముస్లిమేతర యువతులతో ముస్లిం యువకుల ప్రేమ పెళ్ళిళ్ళు మతాంతీకరణకు సాధనాలు అయ్యాయని ఫిలప్పీ సిద్ధాంత ప్రతిపాదనకు మునీర్ చూపిన సాక్ష్యాధారాలు బలాన్ని చేకూర్చాయి. కేవలం కొందరు ముస్లింలుగా మారటానికి మాత్రమే కాక దేశాలకు దేశాలు ఇస్లామిక్ దేశాలుగా మారిపోవటానికి ప్రేమలు, పెళ్ళిళ్ళు కారణ భూతమయ్యాయని నిరూపించటానికి అవసరమైన సాక్ష్యాధారాలు మునీర్ చూపించాడు
సి. సహ్నేర్ (Christian C. Sahner) అనే పరిశోధకుడు పై యిద్దరి పరిశోధకులతో ఏకీభవిస్తూ తన ఉద్గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నాడు…. “క్రైస్తవ ప్రపంచంలో పడకగది ద్వారా ఇస్లామ్ వ్యాపించింది. ముస్లిం యువకులు ముస్లిమేతర యువతుల పట్ల కనపరుస్తున్న ఉత్సుకతకు, ప్రేమకు కారణం వారిని ఇస్లామ్ లోకి మార్చాలన్న ఆకాంక్ష, తద్వారా సంఖ్యాబలాన్ని పెంచుకోవాలన్న నిగూఢమైన మత పెద్దల వ్యూహమే. సహజంగానే యువకులకు వయస్సులో స్త్రీ వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహాన్ని నియంత్రించటానికి బదులు, భుజం తట్టి ప్రోత్సాహిస్తున్నారు. ముస్లిమేతర యువతులను ముగ్గులోకి దించి, మతం మార్చి పెళ్ళి చేసుకుంటే వారికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు యిస్తున్నారు. ముస్లిమేతర యువతులతో, స్త్రీలతో ముస్లిం యువకులకు, పురుషులకు ఉన్న ఏకైక లక్ష్యం వారిని పొందటంతో పాటుగా వారిని ముస్లింలుగా మార్చటమేనని సుస్పష్టం అవుతున్నది.
ఏకపక్ష ప్రేమలు, పెళ్ళిళ్ళు
ఎందుకంటే ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య జరిగే పెళ్ళిళ్ళలో వరులు ఎప్పుడూ ముస్లిం యువకులే. వధువులు ఎప్పుడూ ముస్లిమేతరులే. ముస్లిం యువతులు ముస్లిమేతర యువకులను ప్రేమించటం, పెళ్ళి చేసుకోవటం చాలా అరుదు. ప్రేమలు, పెళ్ళిళ్ళు అన్నీ ఏకపక్షమే. ముస్లిం యువతులు ముస్లిమేతరులను పెళ్ళి చేసుకోవటాన్ని ఇస్లామ్ శతాబ్దల కింద నిషేధించింది. ఆ నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికాలో పిల్లల పెళ్ళిళ్ళుకు సంబంధించి ఒక ప్రముఖ సంస్థ (Pew Research center) తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ చేసింది. మగ పిల్లలు ముస్లిమేతరులను చేసుకోవటానికి అంగీకరించిన ముస్లిం తల్లిదండ్రులు తమ ఆడపిల్లలు ముస్లిమేతరులను చేసుకోవటానికి అయిష్టత చూపారని తేల్చి చెప్పింది. ఏ కొద్దిమందో అభ్యుదయ వాదులు తప్ప అత్యధికులు తమ ఆడపిల్లలు ముస్లిమేతరులను మనువు ఆడటానికి యిష్టపడటం లేదు.
భారతదేశంలోనూ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. జరుగుతున్న మతాంతర వివాహాలలో వరులలో అత్యధికులు ముస్లిం యువకులు. 2012లో కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెసుకు చెందిన ఉమన్ చాందీ పనిచేశారు. 2012-2019 మధ్య 2667 మంది ముస్లిమేతర యువతులు తమ స్వమతం వీడి ఇస్లాంలోకి వచ్చారని పేర్కొన్నారు. వీరందరూ పెళ్ళి కారణంగా మతం మారిన వారేనని వేరే చెప్పనక్కరలేదు. ముస్లిం యువతులలో కేవలం 81 మంది మాత్రమే ఇతర మతాలలోకి వెళ్ళారని చెప్పారు. అంటే పెళ్ళిళ్ళ కారణంగా ఇస్లామ్ లోకి మార్చబడిన వారి సంఖ్య ఇస్లామ్ నుండి ఇతరమతాలోకి వెళ్ళిన వారి సంఖ్య కంటె 33 రెట్లు అధికం.
కేరళ ‘లవ్ జిహాద్’ |
కేరళ ‘లవ్ జిహాద్’ ప్రపంచ వ్యాప్తం అయ్యింది
'లవ్ జిహాద్’ అనే పదం కేరళలో మొదటిసారిగా 2009లో వాడుకలోకి వచ్చింది. ముస్లిం యువకులు ముస్లిమేతర యువతులను పెళ్ళి చేసుకోవటం ఒక నిరంతర ప్రక్రియగా ప్రజల గమనంలోకి వచ్చిన తర్వాతే ఈ పదాన్ని వాడటం మొదలెట్టారు. ఏదో ఒక మూల ఎప్పుడో ఒకసారి మతాంతర వివాహాలు జరిగితే ఎవరూ పట్టించుకొనేవారు కాదు. కాని నిరంతరంగా అలాంటి పెళ్ళిళ్ళు జరుగుతుండటంతో సమాజంలో ఆందోళన మొదలైంది. దానితో కేరళ రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం ఈ పెళ్ళిళ్ళ వ్యవహారాలను పరిశోధించమని ఆదేశించింది. ‘హిందూత్వమూకలు’ చేస్తున్న పనికిమాలిన ప్రచారంగా కొట్టివేసిన వాళ్ళు సైతం ఈ సమస్య గురించి ఆలోచించక తప్పలేదు.
కేరళ క్రిస్టియన్ సంఘాలు (Christian Association for Social Action) వారు ‘లవ్ జిహాద్’ ను క్రైస్తవ యువతులను ఆకర్షించి, మత మార్పిడికి చేస్తున్న ప్రయత్నంగా ఆరోపించింది. సెప్టెంబరు 13, 2009న వారి పత్రికలో ఈ అంశాన్ని పతాక శీర్షికగా ప్రచురించారు. కాథలిక్ చర్చి అనేక సార్లు ‘లవ్ జిహాద్’ పట్ల తన ఆందోళనను వ్యక్తపరిచింది. కర్ణాటక ప్రభుత్వం సైతం లవ్ జిహాద్ సమస్యను తీవ్రంగా పరిగణించటం మొదలెట్టింది. 2010లో కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న సి.పి.యంకు చెందిన అచ్యుతానందన్, కేరళను రెండు దశాబ్దలలో పూర్తిగా ఇస్లామీకరణ చెయ్యటానికి ముస్లిం పక్షమైన పాపులర్ ఫ్రంట్ ప్రణాళికలు సిద్ధం చేసిందని కుండబద్దలు కొట్టారు. అందుకు ధనాన్ని వెదజల్లటం, ముస్లిమేతర యువతులను వలపు వల విసిరి ఆకర్షించి మత మార్పిడి చేయటం వారి ప్రణాళికలో ముఖ్యమైన వ్యూహమని గూడా ఆయన చెప్పటం విశేషం.
'లవ్ జిహాద్’ గురించిన ఆందోళన ఏ ఒక్క రాజకీయ పక్షానికో, మత వర్గానికో పరిమితం అవలేదు. సందర్భానుసారం కాంగ్రెసు, బిజెపి, కమ్యూనిష్టులు ఈ అంశంపై కేరళలో మాట్లాతూనే ఉన్నారు. హిందువులే కాదు క్రైస్తవులు, బౌద్ధులు సైతం ఈ అంశం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. సామాజిక ప్రాధాన్యత అంశంగా చర్చకు పెడున్నారంటే లవ్ జిహాద్ ప్రక్రియ పట్ల భయాందోళనలకు గురవుతున్నారనమాట. 2017లో కేరళ హైకోర్టు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిని ఈ అంశం పట్ల సమగ్రంగా పరిశోధించమని అదేశించింది. జాతీయ పరిశోధనా సంస్థ NIA కూడా ముస్లిం యువకుల మతాంతర వివాహాలలో లవ్ జిహాద్ కోణం ఉన్నట్లుగా తన పరిశోధనలో తేల్చింది. కేరళ మైనారిటీ కమీషన్ అధ్యక్షులు 2017లో…. క్రైస్తవ యువతులను ఇస్లామ్ లోకి మార్చటమే కాక వారిని ఇస్లామిక్ ఉగ్రవాదులుగా మలుస్తున్న వైనం గురించి ఆందోళన వ్యక్తపరుస్తూ కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఇందరి భయాందోళనల మధ్య లవ్ జిహాద్ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉందని పై సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. సిరియన్ మలబార్ చర్చి లవ్ జిహాద్ పెళ్ళిళ్ళు సంఖ్యాపరంగా పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తవ సమాజపు ఆందోళనను బయట పెట్టింది. ‘లవ్ జిహాద్’ పదం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ జాఢ్యం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. బర్మా, థాయిలాండ్ దేశాలకు కూడా వ్యాపించింది. ఆ దేశాలకు చెందిన బౌద్ధులు లవ్ జిహాద్ వలన ఇస్లామీకరణకు, మిశ్రమ వివాహాలు పెరగటం మాత్రమే కాక బౌద్ధం మనుగడకు సైతం పెనుసవాలు అయ్యిందని వాపోతున్నారు.
ఆలోచనా ధోరణిలో మార్పురావాలి
కేవలం ఆందోళన వ్యక్తపరిచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు. మన ఆలోచన ధోరణిలోనూ సమగ్రమైన మార్పు వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. 20వ శతాబ్దపు మూల భావనల కొనసాగింపే నేడు ప్రమాదంలో పడింది. వాస్తవాలను గుర్తించటానికి మనం వెనుకాడుతున్నాం. విజ్ఞాన శాస్త్రం ప్రగతితో మతంకు ప్రాధాన్యత తగ్గుతుందని, మతం మత్తు నుండి మానవాళి బయటికి వస్తుందని ఒకప్పుడు అందరూ అనుకొన్నారు. కానీ ఆ ఆశాభావానికి, ఆలోచనకు కాలం చెల్లింది. నేటి వాస్తవం ఏమిటంటే మతం అదృశ్యం కాలేదు. అంతేకాదు మతానికి ఇదివరకు ఎన్నడూ లేని ప్రాధాన్యత పెరిగింది. మేథావులకు 1918లో మార్క్ వెబర్ ఏమి చెప్పాడో గుర్తువుండే ఉంటుంది. విజ్ఞానశాస్త్ర పురోగతి మతాన్ని, మూఢనమ్మకాలను కొంతవరకు దెబ్బతీసినప్పటికి, అనేక పారలౌకిక అంశాలపట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేసినప్పటికీ మానవాళికి ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని ఆయన ప్రకటించాడు. విజ్ఞానశాస్త్ర పరిమితులను స్పష్టంగా ఆయన చూడగలిగాడు. ఆ కారణంగానే మతం ఆధునిక ప్రపంచంలో ఒక ప్రాథమిక ప్రతిష్టంబనకు దారితీయగల సంభావ్యతను ఆయన గుర్తించాడు. మధ్యకాలపు మతవిశ్వాసాలను తిరిగి నెత్తిన పెట్టుకోవటం జరగకపోవచ్చు, కానీ అటువంటి పోకడలు కూడా ఇటీవలి కాలంలో మనకు అనుభవంలోకి వచ్చాయి. అది అథమ స్థాయి పరిష్కారం అయిన్పటికీ ఆయన భయపడింది ఒక 100 సంవత్సరాల తర్వాత జరగుతున్నది. ఆశ్చర్యకరంగా ప్రపంచమంతా నేడు మతమయం అయింది. మతమే భౌగోళిక రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యింది.
మతాన్ని విశ్వసించే వారి సంఖ్య 2050 నాటికి 2.3 బిలియన్లు మేర పెరగగలదని, అవిశ్వాసుల సంఖ్య కేవలం 0.1 బిలియను మేర మాత్రమే పెరగగలదని అంచనాలు చెప్తున్నాయి. 1970వ దశకంలో ప్రతి ఐదుగురిలో ఒకరు మతం పట్ల విశ్వాసం లేని వారు కాగా, 2050 నాటికి వారి సంఖ్య తగ్గి ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రమే అవిశ్వాసులుగా ఉంటారని చెప్తున్నారు. రాబోయే కాలంలో మతాన్ని విశ్వసించేవారి శాతం పెరిగి అవిశ్వాసుల శాతం గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఈ అంచనాల ఆధారంగా ఇలా అంటున్నది “వ్యవస్థీకృత మతం అదృశ్యం అవుతుందనే నివేదికలు అతిశయోక్తులతో కూడినవి. ఇటీవల పరిశోధనల సారాంశం ప్రకారం 2010, 2050 మధ్య ప్రపంచవ్యాప్తంగా మతాన్ని విశ్వసించే వారి జనాభా, విశ్వసించని వారి జనాభాకంటె 23 రెట్లు పెరుగుతుందని అంచనా”. శామ్యూల్ హంటీంగ్టంన్ ‘నాగరికత ఘర్షణల సిద్ధాంతం’, హార్వర్డు విశ్వవిద్యాలయపు ‘ప్లూరలిజం ప్రాజెక్టు 1995 రెండూ కూడా సమీప భవిష్యత్తులో మతానికి ఎనలేని ప్రాధాన్యత వస్తుందన్న అంచనా ఆధారంగానే అభివృద్ధి చేయబడ్డవి.
ప్రపంచం వేగంగా మారుతున్నది. వెబరనీయనిజం తగ్గుతున్నది. మతం పట్ల విశ్వాసం పెరుగుతున్నది. మతతత్వం విస్తరిస్తున్నది. అటువంటి ప్రపంచంలో ఉదారవాద భావనలకు కాలం చెల్లినట్లు అన్నిస్తున్నది. అంతేకాదు మతాంతీకరణ కోసం ప్రేమించటం, పెళ్ళాడటం అనే భయంకర సమస్యలకు అటువంటి ఉదారవాద భావనలు తగిన పరిష్కార మార్గాన్ని చూపకపోగా, ముస్లిమేతర యువతులు ముస్లిం యువకుల వలపు వలలో చిక్కుకోవడానికి ఉదారవాద భావనలే ఒకరకంగా కారణమవుతున్నాయి. కాలానికి తగ్గట్లు భావజాలంలో కూడా మార్పు రావాలి. మతం పట్ల విశ్వాసం తగ్గుతున్న కాలంలో మనం ఏర్పరచుకొన్న ఉదారవాద భావనలు మతతత్వం పెరుగుతున్న కాలానికి సరిపోవు. కనుక నిజాయితీగా, ధైర్యంగా బహిరంగంగా ఈ అంశాలపై చర్చించటం ఈనాటి అవసరం. అయితే భారతదేశపు వక్రీకరించబడ్డ లౌకికవాదం అటువంటి చర్చకు తెరతీయటానికి అనుమతిస్తుందా అన్నది సంశయాత్మకమే!
ఆంగ్ల మూలం: శ్రీ యస్. గురుమూర్తి
స్వేచ్ఛానువాదం: డా|| బి. సారంగపాణి
వ్యాస మూలము: విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర రాష్ట్రము)