గోవధలను నివారించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘గోవధ నిషేధం, పశువుల సంరక్షణ బిల్లు 2020’కు కర్ణాటక శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి ప్రభు చవాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ఎవరైనా గోవధ, గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షకు అర్హులవుతారని భాజపా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా నిందితులపై వేగంగా విచారణ జరపడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా పెట్టారు.
చర్చ లేకుండా బిల్లును సభలో ఆమోదించారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. బీఏసీ సమావేశంలో చర్చించకుండానే ఈ బిల్లును ఉన్నపళంగా సభలో ప్రవేశ పెట్టారని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. అనంతరం భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
__విశ్వ సంవాద కేంద్రము