శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే బాధ కలుగుతోందని ఆయన అన్నారు. ఏపీలో ఏడాదిన్నర కాలంగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పరాకాష్ఠగా రామతీర్థంలోని ఘటన కనిపిస్తోందన్నారు. శ్రీరాముని విగ్రహాన్ని పగలగొట్టి శిరస్సు భాగాన్ని తీసుకెళ్లడం పిచ్చివాళ్ల చర్య కాదని మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాద చర్య అని మండిపడ్డారు. పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. అందువల్లే చారిత్రక ఆలయంలో దుర్మార్గపు చర్యకు తెగబడ్డారన్నారు.
పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం |
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో కాల్చివేసిన రథం |
అంతర్వేదిలో కాల్చివేసిన రథం |
ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ వ్రాశారు. ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఎంతో చరిత్ర కలిగిన రామతీర్థంలో విగ్రహాలను తాజాగా ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 18 నెలల కాలంలో రాష్ట్రంలో ఆలయాలు, విగ్రహాలపై 100కి పైగా దాడులు జరిగినట్లు ఎంపీ లేఖలో పేర్కొన్నారు.
__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)