విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కొలనులో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యమైంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి కొలనులో పడేశారు. దీనిపై భక్తులు ఆలయ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా ఆలయంపైనున్న కొలనులో రాముడి విగ్రహం తలభాగాన్ని గుర్తించి బయటకు తీశారు. దీంతో రామతీర్థం పరిసరాలు రామనామస్మరణతో మార్మోగుతున్నాయి. చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరోవైపు శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెదేపా, భాజపా డిమాండ్ చేస్తున్నాయి. ఘటనకు నిరసనగా రామతీర్థంలో ఆ పార్టీ నేతలు దీక్ష కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)