అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో చారిత్రక ప్రాధాన్యం గల సూర్యుని విగ్రహం బయల్పడింది. కలుగోడు గ్రామానికి చెందిన రైతు హరిజన వన్నూరప్ప కుమారుడు నాగేంద్ర శుక్రవారం తన పొలంలో దుక్కి దున్నుతుండగా సుమారు రెండడుగుల ఎత్తు గల రాతి విగ్రహం బయల్పడింది. విగ్రహం బయల్పడిన విషయం తెలుసుకున్న రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీ గుడేకోట శివకుమార్ ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళారు. విగ్రహం యొక్క ఫోటోలు పంపారు.
ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించిన శ్రీ శివకుమార్ వేదవతి నది ఒడ్డున బయల్పడిన ఈ విగ్రహం సూర్యునిదని రెండు చేతులలో పద్మాలు ధరించాడని, శిల్ప శైలిని బట్టి ఇది ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవుల శైలికి అద్దం పడుతుందని, క్రీస్తుశకం పదవ శతాబ్దానికి చెందినదని తెలిపారు.
పొలంలో రాతి విగ్రహం బయటపడటంతో ఈ విషయం పొలం యజమాని గ్రామ తలారి గంగప్ప, గ్రామ రెవెన్యూ అధికారి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన గుమ్మగట్ట మండలం తహసిల్దార్ వెంకట చలపతి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పోలీస్ రాజేష్ వచ్చి విగ్రహాన్ని పరిశీలించారు. బొమ్మక్క పల్లి రాజరాజేశ్వరి ఆలయ అర్చకులు విగ్రహం లభించిన చోట విగ్రహానికి పూజలు జరిపారు. ఈ విగ్రహం లభించిన చోటుకు సమీపంలో మరికొన్ని విగ్రహాలు లభించే అవకాశం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
సూర్య భగవానుని శిల్పం లభించడంతో పూర్వం ఈ ప్రాంతంలో సూర్యదేవాలయం ఉండి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. చరిత్ర, పురావస్తు శాఖ అధికారులు ఈ విగ్రహాన్ని పరిరక్షించి అనంతపురంలోని ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలలో ప్రజల సందర్శనార్థం ఉంచాలని రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీ గుడేకోట శివకుమార్ కోరారు.
__విశ్వ సంవాద కేంద్రము