తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో 22/ 10/ 2020 న గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ IYR కృష్ణారావు IAS, శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం IAS లు పాల్గొన్నారు. వీరితో పాటుగా మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు. సీనియర్ పాత్రికేయులు శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు, సీనియర్ ఆడిటర్ శ్రీ సుంకవల్లి రామకృష్ణ లు కూడా పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ హరి కృష్ణ మూర్తి అధ్యక్షతన, తిరుపతి నగర అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ నిర్వహణలో కార్యక్రమం జరిగింది.
తిరుమల తిరపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోష్ఠి
అంశాలు:
- 1) తి.తీ.దే.నిధులను ఎక్కువ వడ్డీ కోసం కేంద్ర,రాష్ట్ర ఖజానాకు మళ్ళించడం సరి అయినదా? పర్యవసానాలు
- 2) తి. టి.దే.జమా ఖర్చులను కాగ్ పరిధి లోకి తీసుకురావడం
- 3) టి.టి.దే.నిధులను
- ధార్మికేతర ఖర్చులకు గతంలో మళ్ళించడం=జాగ్రత్తలు,
- 4) హైందవేతర ఉద్యోగస్తుల తొలగింపు పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు?
- 5) టి.టి. డి.ఎంత మేరకు హిందూ ధర్మ ప్రచారానికి ఖర్చు పెడుతున్నది?
మొదటగా శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పాలకులు TTD కి చెందిన ప్రతి అంశాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తున్నారని, పాలకులలో ఒక విధమైన బరితెగింపు ధోరణి కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీ వస్తుందనే కారణంతో టీటీడీ నిధులను బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించాలనుకోవడం ఏమాత్రమూ సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అసలు ఇలాంటి ఆలోచన చేసేముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించిందా? అని ఆయన ప్రశ్నించారు.
అయితే ఈ అంశంపై శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం స్పందిస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కాదని, పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనని, అధిక వడ్డీల కోసం టిటిడి నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించాలని TTD నే మొదట ప్రతిపాదించిందని ఆయన వివరించారు.
అనంతరం దుగ్గరాజు శ్రీనివాస రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ TTD అధిక వడ్డీ సంపాదించాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు? ఒకవేళ ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ అంతకంటే అధిక వడ్డీ ఇస్తామని ముందుకొస్తే అప్పుడు ఆ నిధులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. టీటీడీ ఆదాయాలు, ఆస్తులపై సమగ్రమైన ఆడిట్ జరుగుతోందా? ఒకవేళ జరుగుతూ ఉంటే సక్రమంగా జరుగుతున్నదా? రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చేత కాకుండా రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ చేత చేయించ నిర్ణయం స్వాగతించాలి అని తెలిపారు.
టిటిడి నిధులను ధార్మిక అవసరాలకు కాకుండా, ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం కూడా సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపైన కూడా సమగ్ర అధ్యయనం జరగాలని, గత ప్రభుత్వాలు కూడా ఆ విధంగా టీటీడీ నిధులను ధార్మికేతర అవసరాలకు వినియోగించారా? ఇప్పటి ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ధార్మికేతర అవసరాలకు వినియోగించింది? తెలుసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టిటిడి లో హైందవేతరులు ఇంకా కొలువులలో కొనసాగుతూ ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటివరకూ అన్యమత ఆచారాలను పాటిస్తూ కూడా ఉద్యోగం కోసం అప్పటికప్పుడు శ్రీ వేంకటేశ్వరునిపై తమకు విశ్వాసమున్నదని ప్రకటించుకుని కొంతమంది టీటీడీలో ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన తెలిపారు. మతాన్ని ఎలాగంటే అలా, ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవటం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
శ్రీ దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ టీటీడీ ఆదాయ వ్యయాలపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు. టిటిడి నిధులు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల రక్షణ విషయమై తిరుమల తిరుపతి సంరక్షణ సమితి దృష్టి పెట్టాలన్నారు. టీటీడీ ఆదాయ వ్యయాల లెక్కలు తెలియాలన్నారు. వివిధ చోట్ల అత్యంత విలువైన టీటీడీ ఆస్తులు ఎలా అన్యా క్రాంతం అవుతున్నది సోదాహరణంగా వివరించారు.
అనంతరం ఆడిటర్ శ్రీ సుంకవల్లి రామకృష్ణ మాట్లాడుతూ టిటిడి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఎలాంటి మొహమాటాలకు పోకుండా ప్రశ్నించి తీరాలన్నారు. గతంలో కూడా ప్రభుత్వాలు దేవాలయాల భూములను స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని,ఆ భూముల విలువతో సమానమైన నిధులను 25 యేళ్లు అయినా దేవాదాయ శాఖ ఆ దేవాలయానికి ఇవ్వని ఉదాహరణ తమగ్రామంలోనే ఉందనీ తెలిపారు. అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. దేవాలయాల నిధులు ధార్మికేతర వ్యవహారాలకు వ్యయం చేయడం సబబు కాదన్నారు. నిధుల మళ్లింపును గట్టిగా వ్యతిరేకించాలన్నారు. దేవాలయాల ఆస్తుల రక్షణకై నడుం బిగించాలన్నారు.
డాక్టర్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ” ఇలాంటి ప్రయోజనకరమైన చర్చా కార్యక్రమాన్ని రికార్డు చేసి ప్రజలందరికీ తెలియపరచాలన్నారు. ప్రజలందరి స్పందన కారణంగానే గతంలో ప్రభుత్వం టీటీడీ భూముల వేలానికి చేసిన ప్రయత్నం ఆగిందన్నారు.
టిటిడి నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మదుపు చేయాలంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హామీ ద్వారా చేయాల్సిందేనని, ఒకవేళ టిటిడి, ప్రభుత్వాల ఉద్దేశం అదే అయితే దానిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ఆ అంశాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో TTD తమ విధానాన్నిస్పష్టం చేయాలని, కేంద్రరాష్ట్ర పథకాలకు మళ్లించడానికి ఉపసంహరణ చేస్తూ తీర్మానం చేయాలని కోరారు.
ధర్మ ప్రచార పరిషత్ ద్వారా టీటీడీ హిందూ ధర్మ ప్రచారం, సంరక్షణ చేయవలసి ఉండగా ఆ అంశాన్ని టిటిడి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ధార్మిక ప్రచారం కోసం టీటీడీ సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తున్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. తిరుమల తిరుపతి సంరక్షణ సమితి కార్యకలాపాలను మరింతగా విస్తరించవలసి అవసరమున్నదన్నారు.
అలాగే వివిధ ధార్మిక సంస్థలతో టిటిడి సమన్వయాన్ని సాధిస్తున్నదా? టిటిడి విషయంలో వెలుగు చూస్తున్న అనేక అంశాలకు సంబంధించి టీటీడీ స్పందనపై సమీక్ష జరగాలన్నారు. కరోనాని సాకుగా చూపి తిరుమల దేవాలయంలో ఉచిత దర్శనాలను నిలిపి వేయడం ఎంత మాత్రమూ సమంజసం కాదని, టీటీడీ ఉచిత దర్శనాలను,ప్రత్యేకించి నడచి వచ్చే భక్తులకు వెంటనే పునరుద్ధరించాలని ఆయన కోరారు. టీటీడీ మరియు ప్రభుత్వ వ్యవహారాలపై ప్రజలలో విస్తృత చర్చ జరిగేలా చూడాలన్నారు.”
శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టిటిడికి విస్తృతమైన ఆదాయ వనరులు ఉన్నప్పటికీ జీతభత్యాల రూపంలో, నిర్వహణా ఖర్చుల రూపంలో పెద్ద ఎత్తున ఖర్చవుతుంటుందని, ఆదాయం కొరవడినప్పుడు టిటిడి తన ఖర్చులకోసం డిపాజిట్లపై ఆధారపడాల్సి వస్తుందని, బ్యాంకులలోని డిపాజిట్లకు తక్కువ వడ్డీ గిట్టుబాటవుతున్నప్పుడు దానిని పెంచుకునే ప్రయత్నం చేయడం టిటిడికి అత్యంత అవసరమని, దానికోసం అధిక వడ్డీలు వచ్చే మార్గాలను అన్వేషించడం తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే టిటిడికి భూములు మరియు ఇతరత్రా స్థిరాస్తులను సమర్పించే భక్తులు కొన్ని చిన్న చిన్న స్థలాలను కూడా సమర్పిస్తూ ఉంటారని, అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడం టిటిడికి, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నదని, దాని విషయంలో కొంత సానుకూల దృక్పథంతో ఆలోచించవలసిన అవసరం ఉన్నదని అయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం టిటిడి భూముల వేలానికి చేసిన ప్రయత్నం అనుమానాస్పదంగా ఉండటంతోనే భక్తులు, ప్రజలు అందరూ దానిని వ్యతిరేకించ వలసి వచ్చిందని ఆయన తెలిపారు.
ఎన్నడూ లేని విధంగా 35 మందితో అతిపెద్ద టిటిడి బోర్డును ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, నిజానికి అంత అవసరం ఉందా? వారందరికీ పని ఉందా? దేవాలయ అభివృద్ధి కోసం వారు ఏమి కృషి చేస్తున్నారు? ఏమి ఆలోచిస్తున్నారు? ఏమి ప్రయత్నం చేస్తున్నారు? దీనిపైన ప్రభుత్వం పునరాలోచించవలసి ఉన్నదని ఆయన తెలిపారు.
తిరుమలలో వేంకటేశ్వరునిపై ఏమాత్రమూ భక్తి విశ్వాసాలు లేని అన్యమతస్తులు ఉద్యోగాలలో ఉన్నారని, తాను దేవస్థాన ఈవోగా ఉండగా అన్యమత ఉద్యోగుల అభ్యంతరకర ప్రవర్తన అనేక సందర్భాలలో దృష్టికి వచ్చిందని కానీ అక్కడ ఏమీ చేయలేని దుస్థితి నెలకొని ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తిరుమల దేవాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన ఆధ్యాత్మిక శిక్షణ కొరవడిందని, ఉద్యోగులందరికీ తరచుగా ఆధ్యాత్మిక శిక్షణను అందించవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.అనుమానాస్పదంగా నకిలీ కుల సర్టిఫికేట్లు తో చేరిన ఉద్యోగస్తుల ఇండ్లకు వెళ్లి వారు తమ ఇండ్లలో యే యే దేవి,దేవతలను పూజిస్తున్నారు? అన్న విషయం పరిశీలించాలని కోరారు.
డా.శ్రీధర్ 2006 సమితి ఆవిర్భావం నుండి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి నేటి వరకు చేపట్టిన వివిధ కార్యక్రమాలను,ఉద్యమాలను వివరించారు.
__విశ్వ సంవాద కేంద్రము