(తిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల భద్రత, స్వామివారి కల్యాణాల నిర్వహణ స్థలం మార్పిడి వివాదం, మరోప్రాకారం వివాదం ఇలాంటి అనేక అంశాల సందర్భంగా వారి నాయకత్వంలోనే వివాదాలు పరిష్కరింపబడ్డాయి. పది సంవత్సారాలపాటు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సలహాదారుడుగా పనిచేశారు. జీవిత చరమాంకంలో హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉంటూ అనేక ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ భౌతిక శరీరాన్ని వీడారు. వారు వ్రాసిన ‘తిరుమల చరితామృతం’ (ఎమెస్కో ప్రచురణ) అనే తిరుపతి చరిత్ర గ్రంథం నుండి నేడు మనకు కావలసిన కొన్ని ముఖ్యాంశాలు)
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సనాతన ధర్మంలోని అందరికీ – శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణపత్యులు, ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు అన్ని సాంప్రదాయాల వారికీ ఇష్టదైవం. 12,13వ శతాబ్దాలలో విదేశీ ముస్లిం దురాక్రమణల వల్ల దేవాలయాలకు, సనాతన ధర్మానికీ రక్షణలేని ఆకాలంలో అనేక కష్టాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు భక్తులు వస్తుండేవారు. 17 – 19 శతాబ్దాల కాలంలో గోసాయిలు తిరుమల దేవాలయ ప్రతినిధులుగా వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేస్తూ గ్రామాలు తిరుగుతూ ఉండేవారు. తమవెంట తిరుమలకు భక్తులను ఉచితంగా తెచ్చేవారు. తిరుమలకు రాలేని భక్తుల ముడుపులను ప్రజలందరి ముందూ స్వీకరించి వాటిని ప్రజలందరిముందూ మూటతో సహా తిరుమల హుండీలో వేస్తుండేవారు. అనేకమంది కవులు తరిగొండ వెంగమాంబ, అన్నమయ్య, జన్మత: అంధుడయిన శ్రీనివాస దాసరు వంటి దేవుడి దర్శనం పొందిన భక్తులకు కేంద్రం తిరుమల. తెలుగునాట సమరసతా స్వరాలను పలికించిన సద్గురు మళయాళస్వామి తిరుమల దివ్యక్షేత్రంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ప్రపంచంలోనే తిరుమల దేవాలయానికి ఆదాయం కూడా ఎక్కువే. మంచి పరిపాలనా వ్యవస్థలు కూడా ఉన్నాయి.
తిరుమల దేవాలయం వద్ద అన్యమత ప్రచారం :
అనేక శతాబ్దాలుగా గ్రామగ్రామాన ప్రత్యేకంగా పేద, బలహీన వర్గాల అనుసూచిత, గిరిజన వర్గాలలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేవారు కరువయ్యారు. విదేశీ పరిపాలనా కాలంలో అనేకమంది హిందువులు మతం మారారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఈ మతమార్పిడి కార్యక్రమం కొనసాగుతోంది. రాజకీయ నాయకులు ఈ మత మార్పిడి చేస్తున్న వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు. దేశం మొత్తం మీద ఎక్కువ మత మార్పిడికి గురయ్యే రాష్ట్రాలు నేడు తెలుగు భాషా రాష్ట్రాలే. అంగ్లేయ పాలనా కాలంలో ఆంగ్లేయ అధికారులు సైతం తిరుమల కొండపైకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. 2005 వ సంవత్సరంలో తిరుపతిలోని దేవస్థానం పాఠశాలల వద్ద, తిరుమలలోనూ అన్యమత ప్రచారం ప్రారంభమైంది. 2005లో తిరుమల నుండి తిరుపతికి వస్తున్న బస్సులో కొద్దిమంది క్రైస్తవులు తమ మత ప్రచార కరపత్రాలను హిందూ భక్తులకు అందజేశారు. వీరిపై పోలీసు స్టేషనులో కేసు నమోదుకూడా అయ్యింది. 7 సం॥ల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన ఒక క్రైస్తవ మత ప్రచారకుడు తిరుమల కొండపై క్రైస్తవమత ప్రచారంపై చేసిన వీడియో ప్రసంగం దేశంలో ప్రజలందరూ విన్నారు. ఇలాంటి దుందుడుకు కార్యక్రమాలు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల వద్ద కూడా జరిగాయి. పూజ్య విశ్వేశ తీర్ధులు (పెజావర్ స్వామి) వారి అభ్యర్ధనతో జస్టిస్ బిక్షపతి ఆధ్వర్యంలోని నిజనిర్ధారణ కమిటి ఈ అంశాలపై తన నివేదికను సమర్పించింది. భక్తులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉద్యమ రూపం దాల్చింది. చివరకు భక్తుల మనోభావాలను గుర్తించి, గౌరవించి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి రెండు జీవోలను విడుదల చేశారు. 1. తిరుమల ఏడుకొండలూ స్వామి వారి దివ్యక్షేత్రమే. ” అన్యమతస్థులెవరూ అక్కడ ప్రచారం చేయరాదు. అలా చేస్తే శిక్షార్హులు. 2. ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన ప్రముఖ దేవాలయాల వద్ద అన్యమతస్థులు ఎవరూ మత ప్రచారం చేయడం శిక్షార్హం.
తిరుమలలో ధర్మ చార్య సదస్సుకు రాజకీయ ఆటంకాలు :
తిరుమల తిరుపతి దేవస్థానం చొరవతో హిందూ ధర్మ ప్రచారం కొనసాగాలని కొందరు పెద్దలు ఆలోచించారు. వారి ఆలోచనల మేరకు 2008లో ప్రముఖ పీఠాధిపతులతో ధర్మప్రచారానికి ఒక సలహామండలి నియమించడం జరిగింది. దానిలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ నారాయణ పెదజియరు స్వామి, కర్ణాటక నుండి శ్రీశ్రీశ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ, తమిళనాడు నుండి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి, మధుర ఆధీనం స్వామీజీలు ఉన్నారు. వీరితో మొదటి సమావేశం 2008లో జరిగింది. అనేక ధర్మోపచార కార్యక్రమాలను TTD నిర్వహించింది. రెండో సదస్సుకూడా మరొక 20 మంది కొత్త మఠాధిపతులతో విజయవంతంగా జరిగింది. మూడవ సమావేశానికి యధావిధిగా ఏర్పాట్లు అన్నీ జరిగాయి. సదస్సు మూడురోజులున్నదనగా సదస్సును వాయిదా వేయవలసిందిగా ఢిల్లీ నుండి కబురు వచ్చింది. (వారు చెప్పిన కారణం ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయని) దాంతో సదస్సు వాయిదా పడింది. 2009 ఎన్నికల తరువాత ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్యగారితో సంప్రదించి సదస్సు తేదీలు ఖరారు చేసి అందరికీ ఆహ్వానం పంపారు. కానీ షరా మామూలే. సదస్సు వాయిదా వేయమని పైనుండి ఆదేశాలు వచ్చాయి. మళ్ళీ సదస్సు వాయిదా పడింది. ఈ రెండు సందర్భాలలో దేశ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు. చక్రం తిప్పింది శ్రీమతి సోనియాగాంధీ.
2015 డిసెంబర్ లో తిరుమలలో ధర్మాచార్య సమ్మేళనం జరిగింది. కొన్ని నిర్ణయాలు జరిగాయి. 2017 ఫిబ్రవరిలో తిరిగి ధర్మాచార్య సమ్మేళనం జరిగింది. జరుగుతున్న ధర్యప్రచార కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలపై స్వామీజీలు సంతృప్తిని తెలియజేశారు. మరికొన్ని సలహాలను తెలిపారు. పై నాలుగు సదస్సుల నిర్వహణలోనూ ప్రధాన సూత్రధారి శ్రీ PVRK ప్రసాద్ గారు. వారికి అన్ని విధాలా సహకరించినది రాష్ట్ర దేవాదాయ శాఖ, తిరుమల తిరుమల దేవస్థానం. 4వ సదస్సు జరిగిన తరువాత 7 నెలలకు 21 ఆగష్టు 2017న శ్రీ PVRK ప్రసాద్ గారు స్వస్థులయ్యారు. వారి తర్వాత ఎవరికి ఎన్ని విన్నపాలు చేసినా తిరుమలలో ఇంతవరకూ ధర్మాచార్య సమ్మేళనమే జరగలేదు. ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు కార్యాలయం నుండి అనుమతి రాలేదు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ధర్మాచార్య సమ్మేళనం కొరకు నిర్ణయం తీసుకోగలదా తిరుమల దేవాలయం హిందువుల దేవాలయం. ప్రపంచంలోనే ప్రముఖ దేవాలయం.
హిందూ ధర్మ ప్రచారం చేసే బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంది. నేడు హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఏ రీతిలో హిందూ ధర్మ ప్రచారం చేయాలి? అనే విషయంలో మార్గదర్శనం చేయాల్సింది ధర్మాచార్య సదస్సు. ఈ సదస్సు నిర్వహణకే అనుమతి ఢిల్లీ నుండో, ముఖ్యమంత్రి నుండో ఎదురు చూసే పరిస్థితి ఎంత దురదృష్టకరం? (పుట 543-555)
సంకలనం : K. శ్యాంప్రసాద్, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.
సంకలనం : K. శ్యాంప్రసాద్, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.
సంకలనం : K. శ్యాంప్రసాద్, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.