అనూహ్యమైన చోటునుండి ఒక యోధురాలు భారతదేశానికి లభించింది. ఆమె భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఇంగ్లండు దేశానికి చెందిన ఒక స్త్రీ. సాటిలేని ప్రజ్ఞాపాటవాలు కలిగి, ఇంగ్లండులో ఆమెకు ఉన్న అద్భుతమైన ఉద్యోగ అవకాశాలన్నింటినీ వదులుకొని వివేకానందుని ప్రేరణతో భారతదేశ స్త్రీలకు సేవచేయటం కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమెపేరు కుమారి మార్గరెట్ నోబుల్. (హిందూ పత్రిక లండన్ విలేకరి కథనం)
సోదరి నివేదితగా మనకు బాగా పరిచయమైన మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అక్టోబరు 28, 1867న ఇంగ్లండు దేశంలోని, ఉత్తర ఐర్లాండులో దూంగన్నాన్, టైరోన్ కౌంటీలో జన్మించింది. చదువు అనంతరం కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. వారిది క్రైస్తవమత ప్రచారకుల కుటుంబం. క్రైస్తవమతంలో ఆమెకు తృప్తి కలగలేదు. అనేక ప్రశ్నలకు సమాధానం లభించలేదు. 1895లో లండన్‌లో లేడీ ఇసబెల్ మార్గెసన్ అనే మహిళ ఇంటిలో స్వామి వివేకానందుడ్ని మొదటిసారిగా దర్శించింది.
స్వామి వివేకానందుడు విదేశాలలో సనాతన (హిందూ) ధర్మప్రచారాన్ని కొనసాగించారు. విదేశాలనుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కొలంబో నుండి అల్మోరా వరకు విసృతంగా పర్యటిస్తూ, హిందూ సమాజ పతనానికి, స్వాతంత్యం కోల్పోవటానికి కారణాలను తెలిపారు. “మన మహిళలను వంటింటికే పరిమితం చేసి వారిని చిన్నబుచ్చాం. శ్రామికులను, కార్మికులను కులాచారాలపేరున రాచి, రంపాన పెట్టాం. ఇవే మనం చేసిన రెండు మహాపాతకాలు.” అని స్పష్టంగా పేర్కొన్నారు. భారతదేశంలో హిందూధర్మం పట్ల భారత జాతీయత పట్ల జాగరణకు వారు నడుం బిగించారు. భారతదేశంలోని హిందూ మహిళలను ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేయాలన్నది వివేకానందుని ఆశయం. హిందూ మహిళలను మేల్కొల్పగలిగిన ‘సివంగి’ మహిళకోసం వారు వెతుకుతున్నారు. స్వామి వివేకానందుని బోధనలచే ప్రభావితురాలైన మార్గరెట్ నోబుల్ వివేకానందున్ని తన గురువుగా స్వీకరించింది. భారత దేశానికి వచ్చి ప్రజలను సేవించాలన్న నిర్ణయానికి వచ్చి ఆమె వచ్చింది. హిందూ మహిళలను మేల్కొల్పే బృహత్ కార్యాన్ని మార్గరెట్ నోబుల్ చేయగలదని వివేకానందుడు నిశ్చయానికి వచ్చారు.
స్త్రీ జనోద్దరణ – సామాజిక సమరసత లక్ష్యంగా…..
7జూన్, 1896న స్వామి వివేకానందుడు మార్గరెట్ నోబుల్ కు ఉత్తరం రాస్తూ, “ఈ ప్రపంచం మూఢనమ్మకాల సంకెళ్ళలో చిక్కుకుని ఉంది. అణగదొక్కబడినవారు – స్త్రీలయినా, పురుషులయినా – వారంటే నాకు ఎంతో జాలి. అణగదొక్కేవారిని చూస్తే మరింత జాలి …… ఈ ప్రపంచానికి కావలసినది సత్ – శీలం. ఎవరి జీవితం నిస్వార్థమయిన ప్రేమతో ప్రజ్వలిస్తూ ఉంటుందో అటువంటివారు ఈ ప్రపంచానికి అవసరం. అటువంటి ప్రేమకు, దాన్ని కలిగినవారు పలికే ప్రతిపలుకుకు పిడుగులాంటి శక్తి వస్తుంది. ఈ ప్రపంచాన్నే కదలించగల సామర్థ్యం నీలో ఉందని నా విశ్వాసం” అని వ్రాశారు, “భారతదేశంలో స్త్రీ జనోద్ధరణకోసం నాదగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయంలో నీవు నాకు చాలా సహాయపడగలవని అనుకుంటున్నాను” అని ఒకరోజు వివేకానందుడు మార్గరెట్ నోబుల్ తో అన్నారు.
తన విదేశీ సహచరుల మధ్య స్వామి వివేకానందతో….. |
జులై 29, 1897న రాసిన ఉత్తరంలో “భారతదేశంలో చేయబోయే పనిలో నీకు చాలా గొప్ప భవిషత్తు ఉండగలదని నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది. నిజానికి ఇక్కడ కావలసింది ఒక స్త్రీయే కాని, పురుషుడు కాదు. ఒక ‘సివంగి’లాంటి నారి, ప్రత్యేకంగా భారతీయ స్త్రీలకోసం పనిచేయడానికి కావాలి. అయితే ఇక్కడ కష్టనష్టాలు చాలా ఉంటాయి. ఇక్కడ నెలకొని ఉన్న దుఃఖాల గురించి, సామాజిక అసమానతల గురించి, మూఢనమ్మకాల గురించి, బానిసత్వం గురించి నీవు ఊహించనైనా ఊహించలేవు. అర్ధనగ్నంగా తిరిగే స్త్రీ పురుషుల మధ్య, కుల వివక్షత గురించి అంటరానితనం గురించి విచిత్రమైన అపోహలతో ఉండేవారి మధ్య తెల్లజాతి వారంటే భయంతోను అసహ్యంతోను ఉండేవారిమధ్య నీవు జీవించాల్సి వస్తుంది. తెల్లజాతివారందరు నిన్నొక పిచ్చిదాన్నిగా చూస్తారు. నీ ప్రతి కదలికను అనుమానంగా చూస్తారు” అని వ్రాశారు. జనవరి 28, 1898న మార్గరెట్ కలకత్తా చేరింది. 1898 లో మార్గరెట్ నోబుల్ తన స్నేహితులయిన ఎరిక్ హామండ్ దంపతులకు వ్రాసిన ఉత్తరంలో, “సుమారు 3000ల సం॥లుగా ఒకే వర్ణానికి (బ్రాహ్మణులు) చెందిన వారివద్దనే ఈ వేదాంతసారం బందీగా ఉండిపోయింది. ఈ వేదాంతసారాన్ని తమ జాతికే చెందిన తక్కువ వర్ణాలకు అందజేయాలని స్వామీజీ ఆశయం. దీని కోసం మనం ఇంగ్లాండునుండి ధనసహాయం చేయాలి” అని వ్రాసింది.
చేదు అనుభవాలు :
1898 ఫిబ్రవరి 22న, శ్రీరామకృష్ణుల జయంతి. ఆ సందర్భంగా శ్రీరామకృష్ణుడు సేవించిన జగన్మాతను దర్శించాలన్నది మార్గరెట్ నోబుల్ కోరిక. ఆమె హైందవేతరురాలు అయిన కారణంగా, శ్రీ రామకృష్ణుడు సేవించిన దక్షిణేశ్వర మందిరంలోకి ప్రవేశం కలగలేదు. విదేశీయురాలైన మార్గరెట్ నోబుల్ కే కాదు, స్వామి వివేకానందుడికే ప్రవేశం దొరకలేదు. స్వామి వివేకానందుడు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళాడన్న కారణాన వారికి దేవాలయ ప్రవేశం దొరకలేదు. కుమారి ముల్లర్ కాషాయరంగు చీర కట్టుకున్నది. “ఈ విదేశీయులకు కాషాయ రంగు చీరకట్టుకునే హక్కు ఎక్కడిది?” అని ఒక బెంగాలీ పెద్దమనిషి వాదించాడు. ఇది ఆనాటి సామాజిక స్థితి. చివరకు శ్రీ రామకృష్ణుడు నివసించిన గదిలోకి మార్గరెట్ నోబుల్, తదితర విదేశీ మహిళలకు ప్రవేశం లభించింది. 1898నాటి సంగతి. సోదరి నివేదిత కోసం ఒక ఇంటిని కేటాయించారు. ఆమెకు సహకరించటం కోసం ఒక వృద్ధురాలైన పనిమనిషిని ఇచ్చారు. ఆనాడు విదేశీయులకు సేవచేయడానికి హిందూ మహిళలు వచ్చేవారు కాదు. ‘టీ’ కానీ, ఇతర ఏ వస్తువును గానీ నివేదికకు ఇవ్వాలన్నా ముందువెనుక శుద్ధికొరకు తన ఒంటిపై నీటిని గుమ్మరించుకునేది. ఆనాటి ఆచారం అది. అయినప్పటికీ ఎంతో ప్రేమగా నివేదితకు అన్ని పనులు చేస్తుండేది. ఇలాంటి అనేక చేదు అనుభవాలను నివేదిత రుచిచూసింది.
1910వ సం||లో స్వామి వివేకానందుడు సమాధి పొందిన తరువాత దేశవ్యాప్తంగా పర్యటిస్తూ నివేదిత జూన్ మాసంలో హరిద్వార్ కేదారనాథ్, బదరీనాధ్ వెళ్ళారు. కేదార్నాధ్ నుంచి బదరీనాధ్ కు ప్రయాణం ఎంతో శ్రమతో కూడినది. కొండలను ఎక్కివెళ్ళాలి. జూన్ 13న బదరీనాధ్ దేవాలయం వద్దకు చేరింది. ఆమె విదేశీయురాలైన కారణంగా ఆనాటి ఛాందస ఆచారాల మేరకు అమెను లోపలకు అనుమతించలేదు. ఆమె విచలితురాలైంది. అంతదూరం, అన్ని కష్టాలకు ఓర్చి అక్కడకు నడచి వచ్చిన తరువాత లోపలకు రానీయకపోవటం చాలా బాధను కలిగించింది. కానీ సనాతన ధర్మాలను గౌరవించటం అలవాటైన ఆమె వెంటనే ఆ నిరాశనుండి బయటపడి దేవాలయం బయటనే జపమాల తిప్పుతూ ప్రార్థనలో మునిగిపోయింది.
సోదరి నివేదితది ముక్కుసూటి వ్యవహారం. తాను నమ్మిన మంచి విషయాన్ని నిర్మొహమాటంగా స్పష్టంగా చెప్పటం ఆమె స్వభావం. భారతీయ మహిళల మధ్య పనిచేస్తూ మంచి మార్పును తేవాలన్నప్పుడు ఎంతో ఓర్పు అవసరం. నివేదిత పైన చెప్పిన అనేక చేదు అనుభావాల సందర్భంలో సంయమనంతో వ్యవహరించింది. సామాజిక మార్పును కోరే, మహిళా జాగృతికి వనిచేసే అందరమూ నివేదితకు గల ఈ ఓపికను నేర్చుకోవాలి.
ఫిబ్రవరి22, 1898 రెండు విధాలుగా ప్రముఖమైనది. శ్రీరామకృష్ణుని జయంతి ఆరోజు. ఆరోజుననే మార్గరెట్ నోబుల్ తన సహచర విదేశీ మహిళలతో కలసి మొదటిసారి ఉత్సవాలలో పాల్గొన్నది. వీరే భారతీయ మహిళా జాగృతికి నడుం బిగించారు. అదే రోజు ఆ ఉత్సవంలో స్వామి వివేకానందుడు నూతన ప్రయోగం చేశారు. 50మంది బ్రాహ్మణేతర బాలురను గంగానదిలో స్నానం చేయించి వారికి గాయిత్రీ మంత్రం ఉపదేశించారు. ఉపవీతం ధరింపచేశారు. శ్రీరామకృష్ణ జయంతి ఉత్సవం అనంతరం ఆ 50 మంది బాలుర తలలపై ఉపనిషత్తులు, శ్రీభాష్యంవంటి పుస్తకాలను ఉంచి నేటినుండి మీకు వేదాధ్యయనానికి అనుజ్ఞ ఇస్తున్నాను”అని బహిరంగంగా ప్రకటించారు. ఈ బ్రాహ్మణేతర బాలురలో అంటరానివారుగా పిలువబడే కులాలవారు సైతం ఉన్నారు. కార్యక్రమ చివరి భాగంలో స్వామీజీ విబూది, చేతిలో త్రిశూలంతో శివుని రూపంలో దర్శనమిచ్చారు. శ్రీరామకృష్ణుని మాటలలో శివుడే సరేంద్రుడుగా జన్మించాడు. స్వామీజీ ఆశించిన ధార్మిక సమతా ఉద్యమానికి వారు ఒక ఉదాహరణను స్వయంగా చేసి చూపించారు.
11 మార్చి, 1898న రామకృష్ణామిషన్ ప్రారంభ సమావేశం బహిరంగసభకు స్వామి వివేకానందుడు అధ్యక్షత వహించారు. మార్గరెట్ వక్తగా మాట్లాడుతు, “ఒకటిన్నర సం||రం క్రితం మీ సంస్కృతిలోని ఆధ్యాత్మిక భావాలు ఇంగ్లండు దేశంలోని మాకు పరిచయమయ్యాయి. పూర్వాచార పరాయణులయిన మీరు ఇంతకాలంగా కాపాడుకుంటూ వస్తున్న ఈ ఆధ్యాత్మిక నిధులు ప్రపంచానికి ఎంతో మేలుచేస్తాయి అనటంలో సందేహం లేదు. ఈ విషయంలో సేవచేయాలన్న ప్రగాఢమైన కోరికతో నేను ఇక్కడికి వచ్చాను. శ్రీ రామకృష్ణులకు జయమగుగాక !” అని అన్నారు.
మార్చి 17న శ్రీ శారదామాత దర్శనం మార్గరెట్ నోబుల్ తదితర విదేశీ మహిళలకు లభించింది. శారదామాత ఈ విదేశీ మహిళలను ‘నా కుమార్తెలు’ అంటూ ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి భోజనం చేశారు. ఇలా భోజనం చేయటం మనకు ఈనాడు చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ ఆనాటి, అక్కడి, పరిస్థితుల దృష్ట్యా అది చాలా ప్రాముఖ్యంగల సంఘటన. శ్రీ శారదామాత చూపించిన ఆప్యాయత, సాంప్రదాయకమైన హిందూధర్మ ఆచారాలకు అనుగుణమైనది కాదు. ఆరోజులలో ఇంకో మతానికి సంబంధించినవారితో, విదేశీయులతో భుజించటాన్ని తప్పుగానేకాక, హిందూమతానికి వ్యతిరేకంగా కూడా పరిగణిస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణకులంలో పుట్టి, నిత్యజీవనాన్ని ఛాందసమైన ఆచార వ్యవహారాలతో గడిపేవారు ఇటువంటి పనులు చేస్తే వారిని వారి ఉన్నత కులం నుంచి వెలివేస్తారు. ఇలా అయినప్పటికి ఆ విదేశీ వనితలతో శ్రీ శారదామాత భోజనం చేయటం వెనుక ఎంతో లోతైన భావం ఉంది. విదేశీయులయిన శిష్యులందరినీ కూడా హిందూ సంఘ సంప్రదాయపు అక్కున చేర్చుకోవటమే దీని అంతరార్ధంగా మనం చెప్పుకోవచ్చును.
శారదా మాతతో సోదరి నివేదిత…. |
శారదామాత అనంతర కాలంలో అనేకమందికి కులంతో నిమిత్తం లేకుండా దీక్షను ఇచ్చారు. ఈ సంఘటనతో నోబుల్ సేవలను హిందూ సమాజం, హిందూ మహిళలు స్వాగతించగలరన్న విశ్వాసం స్వామి వివేకానందునికి కలిగింది. మార్చి 25, 1898న మార్గరెట్ నోబుల్ బ్రహ్మచర్య దీక్షను తీసుకుంది. వివేకానందుడు ఆమెకు ‘నివేదిత’ అని నామకరణం చేశారు. సోదరి నివేదిత స్వామి వివేకానందునితో కలిసి ఉత్తరభారత దేశం విస్తృతంగా పర్యటించారు. వివేకానందుని ద్వారా భారతదేశ చరిత్రను, అనేక పుణ్యక్షేత్రాల దర్శనాన్ని, వాటి చరిత్రను తెలుసుకుంది. 1899 మార్చి 25, శనివారంనాడు సోదరి నివేదితకు ‘వైష్టిక బ్రహ్మచారిణిగా మంత్రదీక్ష’ ఇయ్యబడింది. అప్పటి నుండి నివేదితకు ‘ఒక సనాతన హిందూ బ్రాహ్మణ బ్రహ్మచారిణిగా’ జీవించే సదవకాశం లభించింది.
బాలికలకు పాఠశాల ప్రారంభం :
13 నవంబరు, 1898 కాళీ పూజ పండుగరోజు 16-బోస్ పారావీధిలో నివేదిత ఉన్న భవనానికి శ్రీ శారదామాత వచ్చి మహిళలకోసం పాఠశాలను ప్రారంభించారు. అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు నచ్చచెప్పి వారి బాలికలను పాఠశాలకు పంపమని కోరారు. కొందరు బాలికలకు చిన్ననాటనే వివాహమయింది. భర్తను కోల్పోయారు. బయటకు వచ్చే స్థితిలేదు. అలాంటి దయనీయ స్థితిలో ఉన్న బాలికలను చేరదీసి వారితో పాఠశాలను నడపటం ప్రారంభించారు. నివేదితకు స్థానిక ప్రజల భాష బెంగాలీ రాదు. నివేదిత మాట్లాడే భాష స్థానికులకు రాదు. అయినప్పటికీ స్థానిక ప్రజలలో మమేకమై పాఠశాలను నడపటంలో నివేదితకు ఏదీ ఆటంకం కాలేదు.
ఆనాటి సమాజంనుండి పెళ్ళికాని యువతులు కార్యకర్తలుగా రాగలరన్న నమ్మకం స్వామీజీకి ఏమాత్రం లేదు. అందుకే ఆయన తన దృష్టిని హిందూ వితంతువులకు, అనాధలకు శిక్షణ ఇవ్వటంమీద మళ్ళించారు. తాను చేపట్టవలసిన సేవాకార్యక్రమాలకోసం అవసరమైన ధనం కోసం నివేదిత ఇంగ్లండు, అమెరికాలలో విస్తృతంగా రెండుసార్లు పర్యటించారు. అనేక విమర్శల మధ్య హిందూధర్మ ఔన్నత్యం గురించి అక్కడ ప్రచారం చేశారు. తిరిగి నివేదిత భారతదేశం వచ్చారు.
1901 ఫిబ్రవరి నెలలో సరస్వతీమాత పూజరోజున పాఠశాల పునః ప్రారంభించారు. ఒక ఉపాధ్యాయురాలుగా పాఠశాలను నడపటంలో ఆమె చేసిన నూతన ప్రయోగాలు, బోధనల తీరు, విద్యార్థినులలో ఉన్న శక్తియుక్తుల గుర్తింపు, ఆ విద్యార్థినులకు కుట్టుపనులు, అనేక కళలను నేర్పటం ఆమెచేశారు. ప్రతి విద్యార్థిని గురించి, ఆమె కుటుంబ పరిస్థితులు, ఆమె సమర్థతలు, చదువు ఇలాంటి విషయాలపై ఒక పాతిక పంక్తులు ఆమె నోటుపుస్తకంలో కనిపిస్తాయి. ప్రతి విద్యార్థిని గురించి నివేదిత వ్యక్తిగత శ్రద్ద తీసుకునేవారు. బాల వితంతువులమీద నివేదితకు ప్రత్యేకమయిన ఆప్యాయత ఉండేది. ఎందుకంటే వారి ఆహారం విషయంలో చాలా కఠినమైన నియమాలు ఉండేవి. ఏకాదశి రోజున వీరందరూ తప్పనిసరిగా ఉపవాసం చేయాలన్న విషయం తెలిసిన నివేదిత హృదయం కరిగిపోయింది.
ప్రపుల్లముఖి అనే విద్యార్థిని బాల వితంతువు. ఆ అమ్మాయి చురుకైనది, తెలివికలది, పాఠశాలకు దగ్గరలో ఉండేది. ప్రతి ఏకాదశి రోజున నివేదిత ఆ బాలిక కోసం మిఠాయిలు, పండ్లు పంపించేవారు. ఒక ఏకాదశి రోజున నివేదిత ఆ రోజంతా ఎంతో హడావిడిగా ఉండి పాఠశాల పనులు అయిన వెంటనే డా॥ జగదీష్ చంద్రబోస్ గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉండగా, నివేదితకు ఆరోజు ఏకాదశి అని హఠాత్తుగా జ్ఞప్తికి వచ్చింది. ఆ రోజు ప్రపల్లముఖికి తాను ఏమీ వంపలేదని గుర్తుకువచ్చింది. ఇక నివేదిత అక్కడ ఒక్కనిమిషం కూడా ఉండలేకపోయారు. వెంటనే తన ఇంటికి వెళ్ళి ప్రపుల్లముఖి కోసం కబురు చేశారు. ఆ అమ్మాయిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఎన్నోసార్లు క్షమాపణ కోరుతూ, “అమ్మాయీ నేను పూర్తిగా మర్చిపోయాను. ఎంత అన్యాయం చేశాను? నీకు ఈరోజు తినడానికి ఏమీ ఇవ్వకుండా, నేను మాత్రం తిన్నాను. ఎంత ఆలోచన లేకుండా పనిచేస్తున్నానో ” అంటూ నివేదిత బాధపడ్డారు. గిరిబాల మరొక 20 ఏళ్ళ వితంతువు, ఒక బిడ్డకు కూడా తల్లి. మహామాయ అనే మరొక బాలికకు క్షయవ్యాధి. ఇలాంటి అనేకమంది బాలికల ఇళ్ళకు వెళ్ళి ఆ ఇంటిలోని పెద్దలకు నచ్చచెప్పి వారందరిని పాఠశాలలకు వచ్చేట్టు చేసిన నివేదిత, స్వీకరించిన సవాళ్ళు ఇదొక పెద్ద చరిత్ర.
1906లో కాంగ్రెస్ వారు ఏర్పాటుచేసిన స్వదేశీ వస్తుప్రదర్శనలో, నివేదిత తన పాఠశాల విద్యార్థులు చేసిన చేతిపనుల వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. పాఠశాలలో నూలు వడకటాన్ని ప్రవేశపెట్టి ఆ పనిని నేర్పటానికి ఒక వృద్ధురాలిని నియమించారు. ప్రభుత్వం వందేమాతర గీతాన్ని ఆలపించరాదని నిషేధించిన కాలంలో, నివేదిత తన పాఠశాల దైనందిత ప్రార్ధనా గీతాలలో దాన్ని ప్రవేశపెట్టారు. తెరచాటు వీడి బయటకు రాని పెద్దింటి వివాహిత స్త్రీలు వారి ఇండ్లను వదిలి ఒక యురోపియన్ ఇంట పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళడాన్ని ఎవరైనా ఊహించగలరా? సోదరి నివేదిత ఆ పనిని నిజంచేసి చూపారు.
పాఠశాల నిర్వహణకోసం నిధులు ఇచ్చేవారు భారతదేశంలో ఆనాడు లేరు. కనుక సోదరి నివేదిత పాఠశాల ప్రారంభించిన తరువాత రెండుసార్లు విదేశాలలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనల ద్వారా పాఠశాలకు అవసరమైన నిధుల సేకరణ ఒకపని కాగా, విదేశాలలో శ్రీ రామకృష్ణ వివేకానందుల – జీవన సందేశాన్ని, హిందూధర్మ ప్రచారాన్ని చేయడం రెండవపని. ఆ సమయంలో కూడా పాఠశాలను ‘క్రిస్టియన్,’ ‘సోదరి సుధీరా ‘వంటి మహిళలు పాఠశాలను నిర్వహించారు. నివేదిత మరణించిన తరువాత 1918లో ఆ పాఠశాలను శ్రీ రామకృష్ణ మిషన్ తో అనుసంధానించి దానికి శ్రీ రామకృష్ణ మిషన్, “సోదరి నివేదిత బాలికా పాఠశాలగా” నామకరణం చేశారు. 1963లో ఆగష్టు 9న, ఈ పాఠశాలను రామకృష్ణ మఠానికి సమాంతరంగా శ్రీ శారదమఠ సన్యాసినులచేత నడపబడుతున్న రామకృష్ణ – శారదా మిషన్ కు ఇచ్చారు. అప్పటినుండీ దానికి రామకృష్ణ శారదామిషన్, సోదరి నివేదిత బాలికా పాఠశాలగా” పేరు పెట్టారు.
రామకృష్ణ మిషన్ తో పాటే మహిళలకు విడిగా ఒక మహిళల మఠం ప్రారంభించాలని స్వామిజీ కోరిక. సోదరి సుధీర ఒక బాలికల గృహాన్ని ప్రారంభించి దానికి ‘మాతృమందిర్’ అని పేరు పెట్టారు. ఆ తరువాత దాని పేరును ‘శారదా మందిరంగా’ మార్చారు. ఈ పేరుతోనే ఈనాటికీ బాలికల వసతిగృహం నిర్వహించబడుతోంది. 1954లో శ్రీ రామకృష్ణ మఠంవలే మహిళలకు శ్రీ శారదామఠం ప్రారంభించబడింది.
పేదప్రజల సేవలో….
ఒకరోజు రాత్రి నివేదిత భోజనానికి కూర్చోబోతున్న సమయంలో తన ఇంటికి ఎదురుగా ఉన్న గుడిసెలోనించి పేదవారి ఆర్తనాదాలు వినిపించాయి. ఆమె అక్కడకు వెళ్ళింది. ఒక తల్లి ఒడిలో ఒక బాలిక చావుబతుకుల్లో ఉన్నది. ఒక గంటసేపు కాళీమాత నామాన్ని శ్రీ రామకృష్ణ నామాన్ని పాడుతూ నివేదిత ఆక్కడే ఉన్నది. కొద్దిసేపటికి ఆ బాలిక మరణించింది, “బాధపడకు తల్లీ! నీ బిడ్డ ఇప్పుడు కాళీమాత సన్నిధికి చేరింది” అని ఆ తల్లిని నివేదిత ఓదార్చింది. అన్నీ మరచి ఆ తల్లి, నివేదిత ఒకరిచేతిలో ఒకరు ఒదిగిపోయారు. ఇలా నివేదిత పేదరికంలో మగ్గుతున్న హిందూ మహిళలను అనేక సందర్భాలలో అనేక రకాలుగా సేవించింది. భారతీయ పేద ప్రజలలో ఒకతెగా కలిసిపోయింది.
1899లో మార్చి నెలలో కలకత్తాలో ప్లేగువ్యాధి విస్తరించింది. నివేదిత స్వయంగా అక్కడి మురికివాడలను శుభ్రపరచ సాగింది. అది చూసి స్థానిక యువకులు సిగ్గుపడి, వారూ వీధులను శుభ్రపరచసాగారు. ఆ క్లిష్ట పరిస్థితిలో ప్లేగువ్యాధి బారిన పడిన రోగులకు ప్రాణాలకు తెగించి సేవచేశారు. నివేదిత చేసిన సేవలకు ప్రత్యక్ష సాక్షి అయిన డా॥ రాధా గోవిందకర్ ఈ విధంగా వ్రాశారు. “ఒకరోజు భాగ్ బజార్‌లోని మురికి వాడలలోకి నేను వెళ్ళాను. ఆ సమయంలో నివేదిత మురికివాడలోని ఎండవానలకు దెబ్బతిన్న గుడిసెలో తడిగాఉన్న నేలమీద చిన్న పాపను ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉన్నది. రాత్రిపగలు తేడా లేకుండా ఆ పాపకు సేవచేసింది. గుడిసెను శుద్ధిచేయటానికి గోడకు నిచ్చెన వేసుకుని ఆ గోడకు సున్నం కొట్టింది. ఆ తరువాత రెండు రోజులకు ఆ పాప సోదరి నివేదిత ఒడిలోనే కన్నుమూసింది.” ఇలాంటి సంఘటనలు సోదరి నివేదిత జీవితంలో ఎన్నో ఎన్నో…
1906లో తూర్పుబెంగాల్ లో కఱవు, వఱదలు వచ్చాయి ఆ సందర్భంగా మోకాటిలోతు నీటిలో నడుస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతూ వఱద సహాయక కార్యక్రమాలు చేపట్టారు. నిరాశా నిసృహలతో ఉన్న ఎంతో మంది స్త్రీలకు నివేదిత చూపించిన ప్రేమ ఓదార్పునిచ్చింది. వారందరికీ ఆమె సొంత సోదరిలా కనిపించారు. ఆమె ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళే సమయంలో ఆ గ్రామంలోని స్త్రీలందరూ ఆ ఊరి చివరికి వచ్చి, ఆమెకు వీడ్కోలు ఇవ్వటానికి పడవవద్దకు చేరేవారు. ఆమె ఎక్కిన పడవ తీరాన్ని దాటగానే నివేదిత వెనక్కి తిరిగి చూసినప్పుడు వారందరూ వారి వారి చేతులను పైకెత్తి ప్రార్ధిస్తూ నిలబడి ఉండేవారు. తాముగా ఎన్నో కష్టాలలో ఉన్నప్పటికీ, ఎన్నో అవసరాలలో ఉన్నప్పటికీ మంచి దుస్తులు ధరించి, అన్ని సౌకర్యాలు కలిగిన తనకు ఆశీర్వాదాలు అందజేసే ఆ పేద స్త్రీల గొప్పతనానికి నివేదిత ఆశ్చర్య పడకుండా ఉండలేకపోయారు.
నివేదితకు అండగా…..
ఇతరులు వండిన భోజనం తినడాన్ని గురించి, ఇతరులతో భోజనం చేయటం గురించి హిందువులలో ఉన్న అంటరానితనం గురించి స్వామీజీ తరచుగా విమర్శించేవారు. స్వామీజీ తరచుగా నివేదితను తనతో భోజనం చేయమని ఆహ్వానించేవారు. తన సోదర శిష్యులను, ఇతర స్నేహితులను కూడా తనతో భోజనం చేయమని చెప్పేవారు. కొన్నిసార్లు ఇతర శిష్యులతో కలిసి సోదరి నివేదిత ఇంటికి వెళ్ళి కొన్ని వంటకాలు అడిగి మరీ చేయించుకు తినేవారు. ఆమె చేతి వంటను తానుతింటూ ఇతరులకు పెట్టేవారు. ఇలా చేయటం ద్వారా వివేకానంద స్వామి, శారదామాత ఎంతో ముందుచూపుతో తనలాంటి విదేశీయురాలికి హిందూ సమాజంలో స్థానం కల్పించటానికే ఇలా చేస్తున్నారని నివేదిత తెలుసుకుంది.
1902సం||, జులై4లో స్వామి వివేకానందుడు సమాధి పొందారు. ఆ తరువాత నివేదిత భారతదేశానికి బహుముఖంగా సేవలను అందించారు. దేశమంతా విస్తృతంగా తిరిగి భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణను కలిగించారు. స్వదేశీ జ్వాలలను రగులుకొల్పారు. జగదీష్ చంద్రబోసు తన పరిశోధనా వ్యాసాలు వ్రాయటంలో అన్నివిధాలా అండగా నిలిచారు. ఆంగ్లేయుల దమనకాండను బహిరంగంగా విమర్శించారు. భారతీయ (స్వదేశీ) చిత్రకళకు పునాదులు వేశారు. ఒకటేమిటి ! అనేకరంగాలలో స్వదేశీ ఉద్యమాన్ని కదిలించారు.
రవీంద్రనాధ ఠాగూర్ |
నివేదిత ఎంతో మంచి వక్త. లోతయిన అధ్యయనం ఆమె ప్రత్యేకత, భారతీయ ఆత్మను ఆమె దర్శించింది. అనేక పుస్తకాలను రచించింది. సోదరి నివేదితను చూడడానికి, ఆమెతో మాట్లాడడానికి, ఆమె చేస్తున్న సేవను దర్శించటానికి ఆనాటి దేశనాయకులు బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాధ బెనర్జీ, రవీంద్రనాధ ఠాగూర్, గాంధీజీ, జగదీష్ చంద్రబోస్, అరవిందుడు, సుబ్రహ్మణ్యభారతి ఇలా ఒకరేమిటి ఎందరో ఎందరో కలిశారు. విదేశీయులయిన వైశ్రాయి భార్య లేడి మింటో, ఎస్.కె. రాడ్ క్లిఫ్ (సంపాదకులు, ది స్టేట్స్‌మన్ పత్రిక), రామ్ సే మెకోనాల్డ్ (తరువాత కాలంలో బ్రిటీషుప్రధాని) ఇలా ఎందరో నివేదితను కలిశారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వారు పరోక్షంగా ఆమెనుండి ప్రేరణ పొందారు.
1911, అక్టోబరు 7న డార్జిలింగ్ పట్నంలోని ఆమె సమాధి |
1911, అక్టోబరు 7న డార్జిలింగ్ పట్నంలో ఆమె తనువు చాలించారు. ఆ సమాధిమీద శిలాఫలకంలో ఇలాఉంది. “తన జీవిత సర్వస్వాన్ని భారత దేశానికి ధారపోసిన శ్రీ రామకృష్ణ, వివేకానందుల నివేదిత ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నది.” నిజానికి స్త్రీలను విద్యావంతులుగా చేయటమంటే స్త్రీలలో విశాల భావాలను కలిగించటం, ‘కుటుంబం’ అనే పరిధిని దాటి ఆలోచించేట్లు చూడటం. – సోదరి నివేదిత
ఆమె నిజానికి మన దేశ ప్రజలకు తల్లి. ఈ విధంగా, మాతృత్వం తన కుటుంబ పరిధిని దాటి, దేశం మొత్తాన్ని వ్యాపించడాన్ని ఇంతకు మునుపెన్నడూ చూడలేదు.
- ఆమె, ‘నా ప్రజలు’ అన్న మాటలను పలికినప్పుడు, ఆ గొంతులో వినిపించిన స్వచ్ఛమైన, ప్రేమజనితమైన, వాత్సల్య పూర్వకమైన భావం, మనలో మరెవరి నోటా వినిపించ లేదు. – విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్
సేకరణ : K. శ్యాంప్రసాద్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్.
_విశ్వ సంవాద కేంద్రము