దేవుడి భూమి గురించి జరిగిన గొడవలో పూజారిని సజీవదహనం చేసిన దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కరౌలిలోని బుక్నా గ్రామానికి చెందిన బాబూ లాల్ వైష్ణవ్ స్థానిక రాధాకృష్ణ ఆలయంలో పూజారిగా ఉన్నారు. ఈ ఆలయ ట్రస్ట్‌కు చెందిన భూమిలో బాబూలాల్ గతకొంతకాలంగా తన కుటుంబంతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆలయానికి చెందిన భూములను అక్కడి పూజారులకు ఇస్తుంటారు. అయితే పూజారి వ్యవసాయం చేసుకుంటున్న భూమి తనదేనంటూ కైలాష్ మీనా అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం బాబూలాల్‌తో గొడవపెట్టుకున్నాడు. ఈ విషయం పంచాయతీ పెద్దల దాకా వెళ్లగా.. పూజారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
Rajasthan ke karauli m babu pujari ki petrol dal kar hathya kar di gayi... pic.twitter.com/mOE980WHlP
— Susheel Singh Rajput (@SusheelSinghR16) October 8, 2020
అయినప్పటికీ కైలాష్ ఇవేవీ పట్టించుకోకుండా భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. గురువారం తన వర్గానికి చెందిన కొంతమందిని తీసుకెళ్లి ఆ స్థలంలో గుడిసె నిర్మాణం మొదలుపెట్టాడు. దీన్ని బాబూలాల్ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కైలాష్ వర్గానికి చెందిన కొందరు పూజారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాబూలాల్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
పూజారి సజీవదహనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఇది చాలా దిగ్భ్రాంతికరమని, ప్రభుత్వం తక్షణమే స్పందిచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చనిపోయే ముందు బాబూలాల్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకూ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
___విశ్వ సంవాద కేంద్రము