తిరుమల శ్రీనివాసుని క్షేత్రానికి ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది భక్తులు విచ్చేస్తారు. వారిని తిరుమల ట్రస్ట్ ఆహ్వానిస్తే రావటం లేదు. వారి విశ్వాసం ప్రకారం వస్తున్నారు. భగవంతుని సన్నిధికి మరెవరి ఆహ్వానం మేరకో రావటమంటేనే అదొక దౌర్భాగ్యం.
” ఎవరి విశ్వాసం వారిది ” అని నమ్మిన సాంప్రదాయం మనది. నీకు నచ్చిన దేవుని పూజించే, ఇష్టమైన క్షేత్రం దర్శించే హక్కు ఇచ్చిన రాజ్యాంగం మనది. అటువంటి చోట శ్రీ వేంకటేశ్వరుని మీద విశ్వాసం లేనప్పుడు తిరుమలకు రావటం ఎందుకు? ఒకవేళ వస్తే ఆ సర్వేశ్వరుని మీద విశ్వాసం ఉన్నదని సంతకం చేయడానికి వెనుకంజ ఎందుకు? మనసులో మరో విశ్వాసం పెట్టుకుని శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి రావాల్సిన అవసరం ఏమి వచ్చింది? రాజకీయ లబ్ధి కోసం దైవదర్శనం చేయటం మహా పాపం.
ఇప్పుడు ఆ మహా పాపాన్ని తిరుమల ట్రస్ట్ బోర్డు స్వయంగా చేయిస్తానంటున్నది. ట్రస్ట్ బోర్డు సభ్యులు దైవానికి సేవ చేస్తామని ప్రమాణం చేసి ఆ పదవిని తీసుకుంటారు. కానీ నేటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ వేంకటేశ్వరుని సేవను వదిలి, తనకు ఆ పదవి కట్టబెట్టిన వారి సేవలో తరిస్తానంటున్నాడు.
దేవాలయాలకు తరతరాలుగా సాంప్రదాయాలు ఉన్నాయి. అందులో శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి వచ్చే హైందవేతరులు ఆ స్వామి మీద విశ్వాసముందన్న పత్రం మీద సంతకం చేయటం ఒకటి. రాష్ట్రపతి హోదాలో ఉన్న అబ్దుల్ కలాం వంటి వారే ఆ విశ్వాస పత్రం మీద సంతకం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక మిడిమిడి పదవీ గర్వంతో ఉన్న సోనియాలు, జగన్ లు ఎంత? అటువంటి వారు ఆ విశ్వాసం పాటించనప్పుడు స్వామివారి సన్నిధికి ఎందుకు రావాలి? తమ మతం తరపున వారు ఎక్కడికి వెళ్లి ఏ ప్రార్థనలు చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు కదా?
నేడు ధర్మాన్ని, సాంప్రదాయాలను రక్షించాల్సిన టీటీడీ చైర్మన్ తన బంధువు జగన్ కోసం విశ్వాస పత్ర సంతకం అక్కర లేదన్న వితండవాదం చేస్తున్నాడు. ఆ ప్రకటన చేసినప్పటి నుండి దానిని సమర్థించుకునేందుకు మరెన్నో అసత్యాలు పలుకుతున్నాడు. ” ట్రస్ట్ బోర్డు ఆహ్వానం మేరకు సీఎం వస్తున్నప్పుడు సంతకం చెయ్యమని ఎలా అడుగుతాం? ” అనే చైర్మన్ ప్రశ్న మరింత అర్థరహితం. ఆలయంలోని స్వామిపై భక్తి విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాలపై గౌరవం లేనివారినెవరినైనా, ఏ ట్రస్టు బోర్డయినా, ఏ ఆలయానికైనా ఎందుకు ఆహ్వానించాలి? సరే ఆహ్వానించారనుకుందాం. ఒక ఇంటికి వచ్చిన అతిథి ఆ ఇంటి సాంప్రదాయాలను గౌరవించాలా? వద్దా? అది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అయినా సరే…. నియమం మారదు కదా? అలాగే ఇప్పుడు సీఎం జగన్ అయినా సరే తిరుమల దర్శనానికి పెట్టిన నిబంధనలు పాటించాల్సిందే కదా? ఆ నిబంధనలు నచ్చకపోతే తన క్రైస్తవ విలువలకు కట్టుబడి ఉండే స్వేచ్ఛ జగన్ కు ఉంది. అనవసరంగా ఒక అవిశ్వాసి కోసం కోట్లాది హిందువుల విశ్వాసం దెబ్బతీయడానికి టీటీడీ చైర్మన్ పూనుకుంటానంటే మాత్రం సహించడం కష్టం.
అధికారం ఉందని ఒకరు, పదవిలో ఉన్నామని మరొకరు భావించి హిందూ ధర్మం పై దాడి చేస్తామంటే సామాన్య భక్తులు చూస్తూ ఊరుకోరు. వారి వెంట ఉన్న అధికార బలగాలకు అడ్డు చెప్పలేక ఆ క్షణంలో మౌనం వహించినా హైందవుల మనసుల్లో ఆ అవమానం ముల్లులా నాటుకుని ఉంటుంది. ముళ్ళను ఎలా తొలగించాలో హైందవ సమాజానికి బాగానే తెలుసు. గతంలో ఎందరో మత విద్వేషకులను మట్టి కరిపించిన ఘనత హైందవ సమాజానిది.
భగవంతునితో, అందునా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునితో ఆటలు వద్దు. గతంలో ఏడుకొండలను కబళించే ఎత్తుగడలు వేసిన వారి సంగతి, నాకు పదవి ఉంది కాబట్టి సంతకం చేయను, దర్శనానికి వెళ్తాను అని వెళ్ళిన మూర్ఖుల సంగతి, ఆలయ నిబంధనలను అతిక్రమించిన వారి సంగతి శ్రీ వేంకటేశ్వరుడే చూసుకున్నాడు. తిరుమలలో అలాంటి సాక్ష్యాలు ఎన్నో. తిరుమల మహత్యం అర్థం కాకపోతే చైర్మన్ హోదాలో ఉన్నవారు అక్కడి అయ్యవార్లను అడిగి తెలుసుకుని, తమ తప్పులను సరిదిద్దుకోవడం మంచిది.
రచన – డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు. ___విశ్వ సంవాద కేంద్రము