ఉత్తర కేరళ కాసరగోడ్లోని శ్రీ అనంతపుర ఆలయ ప్రాంగణంలోకి ఒక పెద్ద మొసలి వచ్చింది.
ఈ ఆలయం అనంతపుర అనే చిన్న గ్రామంలో ఉంది. ఒక పెద్ద సరస్సు మధ్యలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయంలో ప్రార్థన చేసిన తరువాత చాలా మంది భక్తులు సరస్సు ముందు కూడా ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయాన్ని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం యొక్క మూలస్థానం (అసలు మూలం) అని పెద్దలు చెబుతారు. ఆ సరస్సులో ఎన్నో ఏళ్ళుగా ‘బాబియా’ అనే మొసలి నివసిస్తోంది. బాబియా పద్మనాభ స్వామి (విష్ణువు) యొక్క ‘దూత’ అని భక్తులు నమ్ముతారు. బాబియా ఈ ఆలయంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది విందు సమయంలో మాత్రమే సందర్శకులకు కనిపిస్తుంది అని ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ పూజారి ఇచ్చిన సమాచారం ప్రకారం, బాబియా ఆలయంలోకి రావటం ఇదే మొదటిసారి. తన అభ్యర్థనతో ఆ మొసలి ఆలయ ప్రాంగణాన్ని విడిచిపెట్టి తిరిగి కొలనులోకి వెళ్ళినట్లుగా ఆయన తెలిపారు.
ఆలయం చుట్టూ వున్న కొలనులో ఎన్నో ఏళ్ళుగా నివసిస్తూ వున్న మొసలి మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోకి వచ్చి అక్కడ కొంత సమయం గడిపింది. ఆలయ ప్రధాన పూజారి చంద్రప్రకాష్ నంబిసన్ ఆలయానికి వచ్చే భక్తులు భయపడతారని, తన శాశ్వత నివాసానికి వెళ్ళమని మొసలిని కోరిన తరువాత అది తిరిగి ఆలయ సరస్సులోకి వెళ్ళిపోయింది.
బాబియా శాఖాహార మొసలి. అది ఆలయ సరస్సు వద్దకు ఎప్పుడు, ఎలా వచ్చిందో? ఎవరు పేరు పెట్టారో? ఆలయంలోని ఎవరికీ తెలియదు. ఈ మొసలి గత 70 సంవత్సరాలకు ముందు నుంచే ఆలయ సరస్సులోనే నివసిస్తున్నదని, ఏనాడూ హింసాత్మకంగా ప్రవర్తించలేదని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు. ఆలయంలో బాబియా పోషణకు, నిర్వహణకు ప్రత్యేకమైన ఏర్పాటేమీ లేదు. దేవునికి నివేదించిన తరువాత అందించే ఆలయ ప్రసాదమే ఆ మొసలి ఆహారమంటే ఆశ్చర్యకరమైన విషయమైనా నమ్మక తప్పదు.
“పూజారి రోజుకు రెండుసార్లు బాబియాకు ఆహారం ఇస్తాడు. కొన్ని సమయాల్లో అతను అన్నపు ముద్దను దాని నోటికి అందిస్తాడు కూడా. పూజారికి బాబియాతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆలయ కొలనులో చాలా చేపలు ఉన్నాయి. కానీ ఆ మొసలి ఎప్పుడూ ఆ చేపలపై దాడి చేయదు, తినదు అని మేము నమ్ముతున్నాం. ఇది పూర్తిగా శాఖాహార మొసలి. పురాతన ఆలయ సంప్రదాయానికి అనుగుణంగానే అది ఆ కొలనులో నివసిస్తోంది.” అని ఆలయ ఉద్యోగి ఒకరు చెప్పారు. కేరళలో ఆ విధంగా సరస్సు మధ్యలో నిర్మించబడిన ఏకైక ఆలయం అనంతపుర ఆలయం.
Source : Hindustan Times - విశ్వ సంవాద కేంద్రము
Source : Hindustan Times - విశ్వ సంవాద కేంద్రము