ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసుకు తెరపడింది. వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ (92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తీర్పు చెప్పింది. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.
సరైన ఆధారాలు లేనందున వారందరిపై అభియోగాలు కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పులో వెల్లడించారు. విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా కేసు విచారణలో ఉండగానే 17మంది మరణించారు. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబర్ 30న కీలక తీర్పు వెలువరించింది.
తీర్పు సమయంలో ప్రస్తుతమున్న 32మంది నిందితులంతా కోర్టులో హాజరు కావాలని సెప్టెంబర్ 16న న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అయితే, వయోభారం, కరోనా కారణంగా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మహంత్ నృత్యగోపాల్ దాస్‌లు కోర్టుకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. ఉమాభారతి, కల్యాణ్ సింగ్‌లకు కరోనా సోకడంతో వారు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో వారు తీర్పు సమయంలో కోర్టుకు హాజరుకాలేదు. వీరంతా తీర్పు సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నారు.
ఇక సాక్షి మహారాజ్, వినయ్ కటియార్, ధరమ్ దాస్, పవన్ పాండే, వేదాంతి, లల్లూసింగ్, చంపత్‌రాయ్‌లతోపాటు మిగతావారంతా కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30నాటికి పూర్తి చేసి, తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు నేడు తీర్పును వెలువరించింది. తీర్పు సందర్భంగా సీబీఐ కోర్టు బయట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి భాజపా అగ్రనేతలు, సంఘ్‌పరివార్ నేతలు, రామాలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ప్రస్తుత ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్, సాధ్వి రితంబర వంటి ప్రముఖులు నిందితులుగా ఉండడంతో ఈ కేసులో తీర్పుపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. 16వ శతాబ్దం నాటి వివాదాస్పద కట్టడాన్ని కూల్చేలా కరసేవకులను ఉసిగొల్పేందుకు వీరు కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది. అయితే, రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందని, మేము నేరం చేశామనడానికి ఎలాంటి ఆధారం లేదని విచారణలో భాగంగా నిందితులు వాదించారు. సుదీర్ఘకాలం విచారించిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది.
__విశ్వ సంవాద కేంద్రము