శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం రాత్రి నుంచి మొదలవుతుందని వివరించింది.
ఒక రోజులో 250 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. పంబా ప్రాంతానికి చేరుకునే 48 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికే దర్శన భాగ్యం కల్పించేలా నిర్ణయించారు. ఆలయానికి చేరుకునేందుకు భక్తులు సుమారు 5 కిలోమీటర్ల మేర కొండ పైకి నడవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాస్కులు ధరిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. గతేడాది సాధారణంగానే 30 మంది ఆలయానికి చేరుకునే ప్రయత్నంలో శ్వాస, గుండె సంబంధిత ఇబ్బందులతో మృతి చెందారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించాలా? వద్దా అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.
‘ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంచనున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో పరిశీలిస్తాం. దీంతో పాటు భక్తుల నుంచి దర్శనానికి సంబంధించి అభిప్రాయం సేకరిస్తాం. దీని ఆధారంగా ఆలయాన్ని నవంబరు నుంచి తెరవాలో లేదో ఆలోచిస్తామ’ని ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ఛైర్మన్ వాసు వివరించారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా మార్చి 18న ఈ ఆలయాన్ని మూసి వేశారు.
__విశ్వ సంవాద కేంద్రము