ఆర్యులు - అనార్యులు (ద్రావిడులు) అన్న చర్చ భారతదేశంలో ఇవ్వటికీ కొనసాగుతోంది. ఈ సిద్ధాంతం గురించి రకరకాల దృష్టికోణాలతో పరిశోధనా పత్రాలను, పుస్తకాలను ప్రచురిస్తున్నారు. క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల క్రితం ఇప్పటి ఇరాన్, ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చినవారే ఆర్యులు' అని; ఇండో-యూరోపియన్ భాషలు మాట్లాడే వీరు దక్షిణాసియాకు వచ్చారని రకరకాల వాదనలు, ఆలోచనలు చరిత్రకారులుగా చెప్పుకునేవారు చేస్తూ ఉన్నారు. రాస్తూ ఉన్నారు.
వాదన చేసేవారంతా భారతదేశం పైకి ఆర్యులు మహా దండయాత్ర చేశారని లేదా మహావలస వచ్చారని, గడ్డిభూములు జాడ వెతుక్కుంటూ వచ్చారని, వారంతా ఈ దేశ అస్మితకు సంబంధం లేనివారని, అలా దాడులు చేస్తూ మూలవాసులైన వారిని, ద్రావిడులను దక్షిణ భారతం వైపు తరిమికొట్టారని ఇలా రకరకాల 'ఊహాగానాలు వినిపించారు. వాటికి చారిత్రక ఆధారాలున్నాయని కూడా వారు చూపుతున్నారు.
- ➧ హిమాలయాలు, గంగానది, కాశీ నగరాన్ని యూరప్ నుంచి, సెంట్రల్ ఆసియా నుంచి వారు తీసుకురాలేదన్న మౌలిక అంశాన్ని విస్మరించి చేసే వాదనలవి. కాశీనగరం ఏర్పడినప్పుడు, అక్కడ జనపదాలు వికసించినప్పుడు ప్రపంచంలో కూడా నాగరికత వికసించలేదన్నది దాచేస్తే దాగని సత్యం.
- ➧ పదివేల ఏళ్ల అవిచ్ఛిన్న సంస్కృతి సంప్రదాయాలు నాగరికత గల భారతదేశంలోకి ఆర్యులు సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడి ప్రజలకు నాగరికత నేర్పారని ప్రతిపాదించడం విడ్డురంగా ఉంది. అలా వచ్చినవారు హిమాలయాలను, గంగా సరస్వతి నదులను, అక్కడ పుష్పించిన జ్ఞానాన్ని తపోధనాన్ని పట్టుకొచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు, రాదు.
- ➧ మహాభారత యుద్ధం కాలానికే ఈ దేశం అఖండ భారతంగా విలకసిల్లింది. సుదూర ప్రాంతాల రాజ్యాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. హస్తిన, ఇంద్రప్రస్త, ద్వారక లాంటి గొప్ప నగరాల నిర్మాణం జరిగింది. అపూర్వ కౌశలంతో, నైపుణ్యంతో, నాజూకుదనం ఉట్టిపడే 'మయసభ' నిర్మాణం జరిగిందప్పుడే. ఈ జ్ఞానం-ప్రజ్ఞ, పరిజ్ఞానం, పరికరాల సృష్టి, నిర్మాణాల సృజన అంతా స్థానికమే కదా.
వేదవాజ్మయం, హరప్ప, సింధు లోయ నాగరికత ఒక తెగని ధారగా కొనసాగిన వైనం స్పష్టంగా అవగతమవుతున్నా క్రీస్తుపూర్వం రెండువేల ఏళ్ల క్రితం యూరప్ నుంచి వచ్చిన కొన్ని తెగలు (ఆర్యులు) ఈ దేశానికి నాగరికతను మోసుకొచ్చాయని, వారి సంస్కృతినే కొనసాగిస్తున్నామని వాదించడంలో ఏమాత్రం 'పస' లేదు.
భారతదేశ వైద్య పితామహుడు, శస్త్ర చికిత్సలు సైతం అలవోకగా క్రీస్తుపూర్వం ఏడువేల ఏళ్ల క్రితం చేసిన శుభశ్రుతుడిని యూరప్.. ఇండో-యూరప్ వాడిగా పరిగణిస్తామా? పాశ్చాత్య వైద్యశాస్త్రం గ్రీకు వైద్యుడు హిపోక్రాట్స్ ను తొలి వైద్యునిగా పేర్కొంటోంది! ఇతను క్రీస్తుపూర్వం 379 సంవత్సరం వాడిగా పేర్కొంటున్నారు. అయితే అంతకు వేల సంవత్సరాల పూర్వమే వైద్యరంగంలో శిఖరాయమానులైన ధన్వంతరి, చరకుడు, శుశ్రుత లాంటి ఎందరో తమ ప్రతిభను, వైద్యాన్ని ప్రజలకు అందించారు. శుశ్రుత కాశీ నగరంలో ఉంటూ వైద్యం నేర్పాడని, చికిత్స చేశాడని, ఆయుర్వేదాన్ని ఓ మెట్టు పైకి తీసుకెళ్లాడన్న కీర్తి పొందాడు. ఈ అపూర్వ జ్ఞాన సంపదనంతా యూరప్ 'ఆటవిక జాతులైన' ఆర్యులు గడ్డిభూములు వెతుకులాటతో భారతదేశం వచ్చి అందించారా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది కదా?.
ధన్వంతరి, చరకుడు, శుశ్రుత లాంటి మహాపురుషులు కేవలం చికిత్స చేయడమే గాక వైద్య గ్రంథాలు రాశారు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు, బోధించారు. క్రమశిక్షణ గల శిష్యులను తయారుచేశారు. ప్రామాణికతకు పెద్దపీట వేశారు. వేదకాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ గురుశిష్య పరంపర, జీవన జ్ఞానంగా మారిన ఆయుర్వేదం యూరప్ నుంచి మనకు దిగుమతి అయ్యిందా?
ఆర్యులు తమ వెంట బలమైన, మేలుజాతి గుర్రాలను ఈ దేశానికి తీసుకొచ్చారన్న వాదనలు వినిపిస్తుంటారు. మహాభారత కాలానికి ముందే ఈ దేశంలో మేలుజాతి గుర్రాలున్నాయన్న విషయం విస్మరిస్తే ఎలా? అశ్వమేధ యాగాలు జరిగాయన్న సంగతి మరచిపోతే ఎలా? 'అశ్వశాస్త్రం' అప్పటికే అందుబాటులో ఉన్నదన్న మాటను తమ సౌకర్యార్థం పక్కన పెడితే ఎలా? ఇలా అన్ని రంగాలకు చెందిన శాస్త్రాలు లిఖించేనాటికి యూరప్, మధ్య ఆసియా దేశాల్లో భాష కూడా లేదన్నది సత్యం. ఇక గ్రంథాల మాటెలా ముందుకొస్తుంది? లిపి, భాష, గ్రంథాలు లేని జాతులు ఆర్యులు భారత గడ్డపై, జంబూద్వీపంపై కాలుమోపి గొప్ప నాగరికతకు ఊపిరిలూదారనడం విడ్డురం గాక ఇంకేమవుతుంది?
కాల్పనికాలు - సత్యాలు:
- ➧ సంస్కృత భాష నుంచే యూరోపియన్ భాషలు ఆవిర్భవించాయన్న విషయాన్ని జర్మన్ వాళ్లే అంగీకరిస్తున్నారు. మరి ఆ సంస్కృత భాష హిమాలయాలు, గంగానది, కాశీనగరం గల భారతదేశంలో పరిధవిల్లిందే గదా? కాశీనగరం సంస్కృత భాష విస్తృతికి మూల కందకమని విస్మరించరాదు కదా?
- ➧ వలస పాలనను సమర్థించినవారు, తమజాతి మూలాలు గొప్పవని ప్రకటించుకునే పాశ్చాత్య పండితులు ఈ ఆర్యుల దండయాత్రలు - మహా వలనల సిద్దాంతాన్ని నృష్టించి ప్రచారంలో పెట్టారన్నది జగమెరిగిన సత్యం. ఈ 'దారం' పోగును చేసుకుని వామవక్ష భావజాలంతో ప్రభావితమైన కొందరు చరిత్రకారులు సైతం ఆ వాదనే సరైనదని తమదైన వ్యాఖ్యానం చేశారు. చేస్తూనే ఉన్నారు. పాశ్చాత్య పండితులకు ఈ దేశ సంప్రదాయ సంస్కృతి మూలాలు - పరిమళాలు తెలియక ఆ వాదన చేస్తే మరి ఈ దేశ చరిత్రకారులకైనా హిమాలయాల గూర్చి, గంగానది కాశీ గూర్చి తెలియాలి కదా?
- ➧ మొహంజోదారో కన్నా ముందే ఇంద్రప్రస్త, హస్తిన, ద్వారక నగరాల నాగరికత ఉందని వేదకాల సంస్కృతి జ్ఞానం, భాష, కళలు, కాంతులు అవిచ్చిన్నంగా కొనసాగుతున్నాయన్న.. కొనసాగుతాయన్న చారిత్రక సత్యం తెలిసుండాలి కదా?.
- ➧ యుద్ధంలో ఉపయోగించే రథాలు సైతం యూరప్ నుంచి ఆర్యులు తెచ్చారన్న మాట కూడా వినిపిస్తోంది. వీరు క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాల క్రితం ఇక్కడకు వాటిని తెచ్చారట 'చక్రం' ఆ రోజుల్లోనే కనుగొన్నారట.. మరి మహాభారత యుద్ధ సమయంలో ఉపయోగించిన గొప్ప గొప్ప రథాలు, వేగంగా పరుగెత్తే గుర్రాలు వాటి సామర్థ్యం, రథాల నిర్మాణ కౌశలం భారతదేశం నలుమూలల ఉన్న ఆయా రాజ్యాల రాజులు సైతం తమ సైన్యం, గుర్రాలు-రథాలతో వచ్చి యుద్ధంలో పాల్గొన్న సంగతి, ఆ సంపూర్ణ సాహిత్యం, గీతా సారాంశం.. ఇదంతా 'చరిత్ర' కాదా? అనాటి సాహిత్యం, మునుల, ఋషుల, మహర్షుల మాటలు తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమవగా అది చరిత్ర గాకుండా పోతుందా? యూరప్ రథాల కన్నా వేల సంవత్సరాల పూర్వమే మహాభారత యుద్ధం జరిగిందన్న సంగతి మరువరాదు కదా?
హర్యానాలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో మహాభారత కాలం నాటి అవశేషాలు లభ్యమయ్యాయని భారత పురాతత్వ శాఖే ప్రకటించింది. మరి అది చరిత్ర గాకుండా ఎలా పోతుంది?
సప్తసింధు పదం నుంచి హిందువు అన్న పదం వచ్చిందని, సింధు - సరస్వతి నదుల సారవంతమైన భూములు ఇక్కడి ప్రజలను జ్ఞానవంతులను చేశాయని, అండం నుంచి బ్రహ్మాండం వరకు అధ్యయనం చేసే జ్ఞానం అభివృద్ధి పరచారని, లక్షల జీవరాశుల శ్రేయస్సు కోరడమే గాక వాటి ఉనికిని గుర్తించి, అంతరిక్షాన్ని ఎంతో సునిశితంగా పరిశీలన చేసి అధ్యయనం చేసి, గ్రహ గతులను పేర్కొన్న అద్భుత పాండిత్యం, శాస్త్రాలు ఈ నేలపై పురుదడు పోసుకున్నాయి. పుష్పక విమానాన్ని ఉపయోగించిన భరద్వాజుడి విమాన నిర్మాణ శాస్త్రం ఇక్కడే వెలుగు చూసిందని, దాని ఆధారంగానే 20వ శతాబ్దంలో రైట్స్ బ్రదర్స్ కన్నా ముందే విమానాన్ని ముంబయ్ లో ఎగరేశారని చరిత్ర చెబుతున్నా,వలసవాదుల వాదన సరైనదని, వారి దృష్టికోణమే సబబైనదని ఆర్యుల నిద్ధాంతంపై ఇంకా భారతదేశంలో పుస్తకాలు, పరిశోధనా ప్యాసాలు ప్రచురితం కావడం విడ్డూరం. వలసవాదులు (ఆర్యుల) వల్లనే భారత ఉపఖండం విరాజిల్లిందనడం విషాదం.
ఆర్యుల భిక్ష? వెర్రితనమా?
యజ్ఞాలు, యాగాలు, ధర్మం, దైవచింతన గురుకులాలు, చార్వాకులు, ఆర్ష సంప్రదాయం - సంస్కృతి ఇదంతా వలసవాదులైన ఆర్యుల భిక్ష అనుకోవడం వెర్రితనం కాక ఏమవుతుంది?
- ➧ హిమాలయాలు, గంగానది, కాశీనగరం సంస్కృత భాష ఇక్కడి నైసర్గిక పరిస్థితులకు చెందినవే. వీటి నేపథ్యమే సనాతన ధర్మం.. హిందూ ధర్మం సభ్యత - సంస్కారం.
- ➧ జ్ఞానం - పరిజ్ఞానం. వీటి వ్యాప్తి, పరివ్యాప్తి ఈ జంబూద్వీపం అంతటా జరిగింది. అంతేగాని ఇండో-యూరప్ జాతుల భిక్షగా దీన్ని అభివర్ణించడం భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదు.
భారతీయ అస్మితకు ఆధారాలు లేవు కాబట్టి ఇదంతా పుక్కిటి పురాణంగా కొట్టివేయడం, చరిత్రగా గర్తించబోమని ఎడమ చేత్తో పక్కకు నెట్టేయడం ఏమాత్రం సబబు కాదు. విశ్వాసం గొప్పది. విశ్వసనీయత గొప్పది. ఆ విశ్వాసమే ఆధారంగా వేల సంవత్సరాల చరిత్ర మౌఖికంగా కొనసాగుతోంది. శాస్త్రీయ అధ్యయనంలో 'మౌఖిక చరిత్ర' కూడా ఒక భాగమే అవుతుంది. మరలాంటప్పుడు ఆర్యుల దండయాత్ర - మహా వలస, గడ్డి భూములు, మేలు జాతి గుర్రాలు నాణ్యమైన రథాలే ఈ నేల ఇతిహాసం.. చరిత్ర అంటే ఎలా? మౌఖిక సాహిత్యాన్ని గుర్తించాలి కదా?
చార్వాకులను చదివినా, జైనులను చదివినా, బౌద్ధులను చదివినా, అనంతర కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలించినా భారతదేశ మూలాలు గంగానది తీరంలో, కాశీ నగరంలో, హిమాలయ వర్వత సానువుల్లో కనిపిస్తాయి గాని యూరోపియన్ నేలలో కాదు.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు, వుప్పల నరసింహం