ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కప్పుకున్న ముసుగులు ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి. ఆయన నిజస్వరూపం ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది నవరత్నాలు, సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వం సాగిస్తున్న కైరైస్తవ రాజకీయం అసలు రంగు అద్దంలో ప్రతిబింబంలా స్పష్టంగా దర్శనమిస్తోంది. జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యల పట్ల రాష్ట్రంలో అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నాయి. ప్రజలు ప్రభుత్వ చర్యలను, విధానాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా రాష్ట్రప్రభుత్వం అభాసు పాలవుతున్నది. జాతీయ మీడియాలోనూ ప్రభుత్వ విధానాలు చర్చకు వస్తున్నాయి. పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు సమాధానాలు చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని విషయం మొదలు.. మొన్నటి అంతర్వేది రథం దహనం, నిన్నటి డిక్లరేషన్ వివాదం వరకు ప్రతివిషయంలో అధికార పార్టీ నేతలు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా యథేచ్చగా సాగుతున్న క్రైస్వీకరణ ప్రయత్నాలు, మత మార్పిడులు ఒక ఎత్తయితే, హిందూధర్మం, హిందూ ఆలయాలు, హిందూ ఆచార వ్యవహారాలపై ముఖ్యమంత్రి సాగిస్తున్న మౌన పోరాటం మరొక ఎత్తుగా ప్రజలు భావిస్తున్నారు. నిన్నటి దాకా ప్రభుత్వాన్ని సమర్థించిన మెజారిటీ ప్రజలు ధర్మం మీద దాడిని సహించలేక పోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం 'ఘన'కార్యాల పుణ్యాన ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రాష్ర ఆర్థిక పరిస్థితి జగన్ సరికొత్త విధానాల పుణ్యాన మరింతగా మునిగిపోయింది. ఇప్పటికే రాష్ట్ర ఆదాయంలో ముప్పయ్ ఐదు శాతం చేసిన అప్పుల చెల్లింపులకే పోతోంది. మిగిలిన ఆదాయంలో సింహభాగం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, సంక్షేమ పథకాలకు ఖర్చవుతోంది. ఇక అభివృద్ధి మాటెక్కెడిది దీంతో ప్రభుత్వం అప్పుల వేటలో కొత్తపుంతలు తొక్కాల్సి వస్తోంది. వేరే మార్గం లేక చివరకు డెస్పరేట్ లోన్స్' (తీరని రుణాలు) కోసం కొత్త మార్గాలు వెతుక్కుంటోంది.
మరోవైపు ప్రభుత్వ పాలన కోర్టు కేసుల్లో చిక్కుకుంది. పదహారు మాసాల్లోనే సుమారు డెబ్బయ పైగా కేసులు న్యాయస్థానాల విచారణలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కీలక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేదు తీర్పులు చవిచూసింది. ప్రస్తుత తరం మాత్రమే కాదు భావితరాలు కూడా మూల్యం చెల్లించవలసి వచ్చే స్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలు ఇటు ఆర్థిక వ్యవస్థను అటు సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తున్నాయనే చెప్పాలి.
ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ, ఆర్థిక విధానాలు ఒక చేత్తో ఇచ్చి నాలుగు చేతులతో లాక్కునే విధంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే నిర్మాణరంగం మొదలు ఏ రంగంలోనూ ఉపాధికి అవకాశమే లేకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలయినా ఇంతవరకు స్పష్టమైన ఇసుక పాలసీ లేదు. మరోవైపు సిమెంట్ ధరలు (బహుశా సిమెంట్ వ్యాపారులతో పార్టీ, ప్రభుత్వ పెద్దలకు ఉన్న ఆర్థిక అనుబంధం కారణంగా కావచ్చు) విపరీతంగా పెరిగి పోవడంతో నిర్మాణరంగం కుదేలైపోయింది. చేతివృత్తులు ఇతరత్రా అసంఘటిత రంగంలోని వారికి ఉపాధి లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల పెన్షన్లే వారికి జీవనాధారంగా మారాయి. గతంతో పోల్చితే ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. సంక్షేమ పథకాల మాటునఓటుబ్యాంకు రాజకీయాలు చేసే ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరుగుతోంది.
ఇక అంచెల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన జగన్ కొత్త మద్యం పాలసీకి తెరలేపారు. మద్యాన్ని ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీలోని తమ వారికి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆశించిన దాని కంటే సుమారు 12 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పుడు అదీ చాలదన్నట్లు, దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వమే 'లిక్కర్ మాల్స్'ను ప్రారంభించి ఎక్కువ ధరలుండే మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర పన్నులను విపరీతంగా పెంచి ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారం మోపింది. విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు ప్రజలపై భారం మోపి సంక్షేమ పథకాలకు పది రెట్లు ప్రజల నుంచి వసూలు చేస్తోంది. అయితే, ఈ ఇలా అనేక విధాలగా నిజాన్ని దాచేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ అది దాచేస్తే దాగని సత్యం ముఖ్యమంత్రి ఎంత మౌనంగా ఉన్నా, తనను తాను విశ్వాస పాత్రుడిగా, బుద్ధిమంతుడిగా చూపించే ప్రయత్నం చేసినా సోషల్ మీడియా పుణ్యాన అన్నీ బహిర్గతమవుతూనే ఉన్నాయి.
ప్రభుత్వ పరంగానే కాదు, రాజకీయంగానూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో పలచనవుతోంది. ఇంతకాలం గోప్యంగా ఉంటూ వచ్చిన అజెండాలు ఒక్కొక్కటి గా బయట పడుతున్నాయి. వైసీవీ నిజరూపాన్ని జనం గుర్తిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన ఒక్కొక్క వర్గం మెల్లమెల్లగా పార్టీకి దూరమవుతున్నది ఇది ఎవరో అన్న మాట కాదు, కొద్దిరోజుల క్రితం వరకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన ఒక నేత వ్యక్తపరిచిన అభిప్రాయం.
ముఖ్యంగా, అంతర్వేది రథం దహనంతో రాజుకున్న అగ్గి రాజకీయంగానూ సెగలు పుట్టిస్తోంది.ఆ ఘటనకు కొనసాగింపుగా తెర పైకి వచ్చిన విజయవాడ కనకదుర్గమ్మ రథం వెండిసింహాల మాయం, తిరుమల తిరుపతి డిక్లరేషన్ వివాదం. ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి కొడాలి నాని చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్నే సృష్టించాయి. నాని హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అందుకేనేమో ఈ వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎక్కడా పెదవి విప్పలేదు. బహుశా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే కావచ్చు ప్రభుత్వంలో 'నెంబర్ టు'గా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ప్రభుత్వానికి, పార్టీకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే, ఇంతవరకు నాని చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని, అప్పుడే విలేకరులు తమ దృష్టికి తెచ్చినట్లు అబద్ధాన్ని అతికించేందుకు ఆయన చేసిన ప్రయుత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే నాని రాజీనామా/బర్తరఫ్ కు బీజేపీ చేస్తున్న డిమాండ్ కు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ధోరణిలో మాత్రం ఏ మార్పు కనిపించడంలేదు. 'నేనింతే' అన్నట్లుగా వ్యహారిస్తున్నారు. ఆయన నిజంగానే నిబ్బరంగా ఉన్నారో లేదా నిబ్బరంగా ఉన్నట్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నారో తెలియడం లేదు. జగన్ ఒక వ్యూహం ప్రకారమే పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే బేఖాతరు ధోరణిని అవలంబిస్తున్నారనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మత విస్తరణకు క్రైస్తవ మతం అనుసరించిన మార్గంలోనే "జగన్ పేదరికాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారని" రాజకీయ వ్యాఖ్యాతలు విశ్లేషిస్తున్నారు. అందుకే సంక్షేమంపైనే దృష్టి పెట్టి ఇతర పరిపాలనా బాధ్యతలను, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని నిపుణులు
విశ్లేషిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఏ సంక్షేమ పథకాలనయితే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటిపై రాజకీయ పందిళ్లు అల్లుకున్నారో, ఏ మత విశ్వాసాలపై అయితే ఆయన రాజకీయ ఆశలు పెంచుకున్నారో అవే ఆయన రాజకీయ చిరునామాను మార్చేసేలా తయారయ్యా యనే చేదు నిజాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అర్ధంచేసుకుంటే మంచిది
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్ - జాగృతి