- తీర్థయాత్రల ముఖ్య ఉద్దేశ్యం -
ఎలాంటి మార్పు, వైవిధ్యంలేని యాంత్రిక జీవనం మనస్సును మొద్దుబారుస్తుంది. అటువంటప్పుడు తీర్థయాత్రలు చేస్తే, బ్యాటరీ ఛార్జీ అయినట్లు మనస్సుకొక కొత్త ఉత్సాహం, పట్టుదల, ఆనందం లభిస్తాయి. ఏ విధంగా పాలు సూక్ష్మంగా ఆవు శరీరమంతటా ఉన్నా కూడా పొదుగు నుండే మనకు లభిస్తాయో అలాగే దేవుడు సర్వవ్యాపియైనా కూడా తీర్లక్షేతాలలో ఆయన ఉనికిని స్పష్టంగా కాంచవచ్చు.
ఇటువంటి పుణ్యక్షేత్రాలు మన దేశంలో వేలకొలది ఉన్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని విరజిమ్మే రమణీయమైన స్థలాలలో, ఉదాహరణకు సముద్రతీరంలో, నదీతీరాలలో, గుహలలోనో, కొండలపైననో, కొండల క్రింద లోయలలోనో, అరణ్యాలలోనో ఈ తీర్షక్షేత్రాలు వెలిసి పురాణ ప్రాశస్త్యం కలిగి, మహాత్ముల జీవితాలకు సంబంధించినవై ఉంటాయి.
వేలకొలది సంవత్సరాల నుండి కోటానుకోట్ల భక్తుల సందర్శనంతో ఇవి పునీతమై ఉంటాయి. కనుక వీటిని భక్తిశద్దలతో సందర్శించినపుడు వీటి ఆధ్యాత్మిక ప్రభావం ఏ కొంచమైనా మన మీద పడుతుంది. మన పాపాలు సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకైనా తొలగిపోతాయి. కనుకనే అన్ని మతాలలోనూ పుణ్యతీర్థాలకు, తీర్థయాత్రలకు మహాత్త్వం ఆపాదించబడింది.
తీర్థయాత్రలకు సంబంధించిన నియమాలను సంగ్రహంగా ఇలా చెప్పవచ్చు: పంచాంగం చూసి మంచిరోజు నిర్ణయించాలి. దానికి ముందు రోజు ఉపవాసం వుండి, మనస్సును నిగ్రహించాలి. బయలుదేరే రోజున శిరోముండనం, స్నానం, గణేశ పూజ, నవగ్రహ పూజ, ఇష్టదేవతా పూజ - ఇవన్నీ చెయ్యాలి. తర్వాత సంకల్పం చేసుకొని బయలుదేరాలి. యాత్రాకాలంలో ఆయా స్థలాలలో ఉన్న పద్ధతిని బట్టి పూజలు, దానాలు చేయాలి; తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ గణేశాడది దేవతల పూజలు చేసి తెచ్చిన తీర్థప్రసాదాలు భక్తులకు పంచి ఇవ్వాలి. (యాత్రాస్థలాలలో వాటిని సందర్శించినందుకు చిహ్నంగా తమకు ప్రియమైన పండ్లనో, కూరగాయలనో త్యాగం చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తారు కొందరు: తర్వాత జీవితాంతం వాటిని ముట్టకూడదు. అందువల్ల ఆ తీర్ధయాత్రాస్థలం మాటిమాటికీ గుర్తుకు వచ్చి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.) కారణాంతరాల వల్ల ఎవరైనా యాత్రలు చేయటానికి అశక్తులైతే వారు యాత్రకు పోయేవారిలో ఎవరైనా ఒకరి మూలకంగా యాత్రాసందర్శన ఫలితాన్ని ప్రతినిధి క్రియ' ద్వారా పొందవచ్చు. దర్శలతో చేయబడిన బొమ్మను ఆ ప్రతినిధి తనతో తీసుకువెళ్ళి, ప్రతీకకు దేవతాదర్శనం, తీర్థస్నానాదులను చేయిస్తాడు. దీనిని 'ప్రతినిధి క్రియ' అంటారు.
శ్రీ (శారదాదేవి శ్రీరామకృష్ణుల ఛాయా చిత్రాన్ని తీసుకువెళ్ళి జగన్నాథుల దర్శనం చేయించారని వారి జీవిత చరిత్రలో ఉంది.) తీర్థయాత్రలను చేసేటప్పుడు అక్కడ వెలసిన దైవంపైనే మన మసస్సు లగ్నమవ్వాలి గాని అక్కడ జరుగుతుండే అనాచారాలపై కాదు. (అలాంటి వాటిని మనం అన్నిచోట్లా చూస్తూనే ఉంటాం.) ఒకవేళ అటువంటివేమైనా కన్పిస్తే ఆ క్షేత్ర నిర్వాహకుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్ళవచ్చు.అంతేకానీ దాన్నే మనస్సులో ఉంచుకొని తీర్థయాత్రల ముఖ్యోద్దేశాన్ని మరువకూడదు. సాంసారిక విషయాలనుండి మనస్సును మరల్చి భగవంతునివైపు త్రిప్పటమే తీర్థయాత్ర ముఖ్యోద్దేశం.
రచన: స్వామి హర్షానంద