శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్శిల్ రావడంతో స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో దేవస్థానం ఇన్‌ఛార్జి చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీహరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సదరు పార్శిల్‌ను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టగా ఆలయంలోని పర్యాటక శాఖలో పనిచేసే ఓ ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి అది వచ్చినట్లు చిరునామా ద్వారా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో నిత్యావసర వస్తువులను సదరు క్రిస్టియన్ సంస్థ పంపినట్లు తేలింది. దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలంలో అన్యమత ప్రచార కార్యకలాపాలు నిషిద్ధం. ఈ నేపథ్యంలో అన్యమత పార్శిల్ కర్నూలు నుంచి శ్రీశైలానికి రావడంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
__విశ్వ సంవాద కేంద్రము