శంఖము
సనాతన ధర్మములో శంఖానికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. దేవుళ్ళు, దేవతల చేతులలో శంఖము ఉన్నట్టు వర్ణింపబడి ఉంటుంది. శంఖాన్ని పూరించడము వలన అత్యంత శుభములు కలుగుతాయి.క్షత్రియులకు శంఖము ఎలాగ యుద్ధపరమైన ఒక ఆభరణమో, బ్రాహ్మణులకు ఆది ధార్మికపరమైన ఆభరణము. చండీ సప్తశతిలోనూ, భగవద్గీతలోను, ఇతర పురాణాలలోను , దేవతలు దానవులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు , పాండవులు కౌరవులతో మహా సంగ్రామము చేసినపుడు, ప్రతి దినమూ ఆరంభములో శంఖనాదము చేసి గానీ యుద్ధము మొదలు పెట్టరు అని చదువుతాము. అలాగే యుద్ధాని విరమించే సంకేతముగా కూడా శంఖనాదము చేస్తారు.
కృష్ణార్జున శంఖారావం |
బ్రహ్మవైవర్త పురాణములో, శ్రీకృష్ణ పరమ భక్తుడైన గోప సుదాముడు శాపవశమున శంఖచూడుడు అను రాక్షసుడిగా జన్మించి, దేవతలను బాధించుటచే, శంకరుడు అతడిని వధించెననీ, ఆతడి అస్థికలనుండీ మహా శంఖము ఆవిర్భవించెననీ చెప్పబడి ఉంది. దానిని విష్ణువు సంగ్రహించి తన వద్ద ఉంచుకున్నాడు.
మరొక కథనము ప్రకారము, " పంచజన " అనే భయంకరుడైన దానవుడు, సూక్ష్మ రూపములో సముద్ర గర్భములోని ఒక శంఖములో నివశించేవాడు. అవసరమైనపుడు తన నిజరూపము దాల్చి, బయటకు వచ్చి, దేవతలను, మనుషులను పీడించేవాడు.
ఒకసారి వాడు, ’ సాందీపని ’ మహర్షి యొక్క ఏకైన కుమారుడిని అపహరించుకొనిపోయి మింగేసినాడు. అటుతరువాత కొంత కాలానికి, శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపని మహర్షి గురుకులములో విద్యాభ్యాసము పూర్తి చేసిన తరుణములో, గురువు గారిని ’ గురుదక్షిణ స్వీకరించవలసినదనీ, ఏమి అడిగినా ఇచ్చుటకు తాము సిద్ధమనీ ’ ప్రార్తిస్తారు. అప్పుడు సాందీపని మహర్షి, పంచజనుడు ఎత్తుకుపోయిన తన కుమారుని రక్షించి తీసుకురమ్మని గురుదక్షిణగా అడుగుతాడు.
బాలకుని వివరాలు అన్నీ తెలుసుకున్న శ్రీకృష్ణ బలరాములు, సముద్రములోకి దూకి, పంచజనుడిని వెదకి వెళ్ళి పట్టుకుని చంపేస్తారు. అతడు నివసిస్తున్న శంఖాన్ని సంగ్రహించుకుని వస్తారు. అయితే బాలకుడు అప్పటికే మరణించాడని తెలుసుకుని, యమలోకానికి వెళ్ళి, ఆ బాలకుడిని బ్రతికించుకుని తీసుకువచ్చి గురువుగారికి అప్పజెపుతారు.
పంచజనుడి నుండీ వచ్చింది కాబట్టి ఆ శంఖానికి ’ పాంచజన్యము ’ అనే పేరు వచ్చింది. అందుకే, || త్వం పురా సాగరోత్పన్నః, విష్ణునా విధృతః కరే, దేవైశ్చ పూజితస్సమ్యక్ పాంచజన్య నమోఽస్తుతే || అను శ్లోకము ప్రకారము, మనము పూజించే శంఖము పాంచజన్యమే .
ఈ పాంచజన్యము అనే శంఖమును కృష్ణుడు సంగ్రహించి తనవద్ద ఉంచుకొన్నాడు. శంఖము లో బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు. గంగా , సరస్వతీ నదులు మొదలుకొని అనేక తీర్థాల ఆవాస స్థానమే ఈ శంఖము. అందుకే, శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకొని వింటే సముద్రపు హోరు వినిపిస్తుంది. మరే ఇతర వస్తువును పెట్టుకున్నా ఆ హోరు వినపడదు.
ఒక అతి ముఖ్యమైన విషయము మీరు గమనించి ఉంటారు. కలిప్రభావము అని చెప్పినా కూడా, ఈ తరములో విపరీత భావాలు, రాక్షస ప్రవృత్తి గల వారు అధికముగా పుట్టుకొని వస్తున్నారు. ఒక తరము వెనుక ఇంతటి సంఖ్య లో ఉండేవారు కాదు. ఇంకా వెనుకటి తరాలలో అస్సలు ఇటువంటి మనుషులు ఉండేవారు కాదు. దీనికీ, శంఖానికీ ఒక అతి దగ్గర సంబంధము ఉంది.
శంఖాన్ని పూజించేటప్పుడు చెప్పే శ్లోకాలలో,..
|| గర్భా దేవారి నారీణాం విశీర్యంతే సహస్రశః |
తవ నాదేన పాతాళే పాంచజన్య నమోఽస్తుతే || అని పూజిస్తాము.
శంఖాన్ని గట్టిగా పూరిస్తే, ఆ నాదానికి రాక్షసులు , దానవులు, దైత్యులు బెదరి పారిపోవడమే కాదు, ఆ నాదము విన్న ఆయా రాక్షసుల భార్యలు గనక గర్భవతులై ఉంటే, వారి గర్భాలు విఛ్ఛిన్నమై పోయి పాతాళములో పడిపోతాయి.
సనాతన ధర్మములో చేసే పూజలలో శంఖ పూజ, శంఖనాదము చాలా ముఖ్యమైనవి.
- ➣ఇప్పటికీ కాశీ వంటి శివ క్షేత్రాల్లో , పూజలో అందరూ శంఖాన్ని పూరిస్తారు. జంగమ దేవరలు ఇంటింటికీ వచ్చి శంఖాన్ని పూరించేవారు. ఇప్పుడేదీ? శంఖాన్ని చూచిన వారు ఎందరు ? ఇంట్లో పెట్టుకున్నవారు ఎందరు ? పూజించేవారు, పూరించే వారు ఎందరు ?
- ➣శంఖ భయమనేది లేక పోవడముతో, ఇళ్ళలో శంఖ నాదాలు వినపడకపోవడముతో, , దానవ అంశతో , దానవ వాసనలు గల ఆత్మలు నిర్భీతిగా, నిరాటంకముగా మనుషులకు సంతానముగా పుడుతున్నాయి. అందుకే ఇటువంటి విపరీత ధోరణులున్న మానవులు పుట్టుకొస్తున్నారు.
- ➣శంఖములో నుంచిన నీరు దేవతలకు ప్రీతి పాత్రములు. శంఖనాదము దేవతలకు ఆహ్వానము వంటిది. శంఖము ప్రతిధ్వనించు ప్రదేశమున శ్రీమహాలక్ష్మి సుస్థిరముగా ఉంటుంది. శంఖజలముతో స్నానము చేయువారు సర్వ తీర్థములలోను స్నానము చేసినట్లే. శంఖము ఉన్నచోట అమంగళములు ఉండవు.
- ➣శంఖములో పోసిన నీటికి అత్యంత ప్రాశస్త్యము కలదు. అది అతి పవిత్రమైనది. సర్వ దోషములను పోగొట్టగల జలమే, శంఖ జలము. అందుకే శంఖములో పోస్తే గానీ తీర్థము కాదు అన్నారు.
శంఖము |
ఇక ఈ శంఖాలలో అనేక రకాలున్నాయి
- వామావర్తము[ శంఖ మూలాన్ని పైనుండీ చూస్తే, ఎడమవైపున తెరచుకొని ఉండేది ],
- దక్షిణావర్తము [ కుడివైపున తెరచుకొని ఉండేది ] అని రెండు రకాలు. వీటిలో దక్షిణావర్తము ప్రశస్తమైనది అని చెపుతారు.
ఇవి కాక, నాలుగు వర్ణాల వారికీ నాలుగు రకాల శంఖాలు చెపుతారు.
- 1. కృష్ణుడి శంఖము పేరే పాంచజన్యము.
- 2. అర్జునుడి శంఖము పేరు ’ దేవదత్తము ’
- 3. యుధిష్టిరుడి శంఖము పేరు ’ అనంత విజయము ’
- 4. భీముడి శంఖాన్ని ’ పౌండ్ర ’ అంటారు.
కుబేరుడికి ఉన్న నవ సంపదలలో శంఖము కూడా ఒకటి.
శంఖాలు ఇంకా అనేక ఆకృతుల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. కొన్ని ’ గోముఖ ’ ఆకారంలో సహజంగా ఏర్పడి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ’ గోముఖ శంఖము ’ బొమ్మ మాయింటిలోనిది. ఇందులో కూడా సముద్ర ఘోష వినిపిస్తుంది. దీనినే గణేశ శంఖము అని కూడా అంటారు.
సంకలనం: జనార్ధన శర్మ