''స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్
భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్
లక్షం తు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్"
అని రుద్రాక్షమాల గురించి "జాబాలోపనిషత్"లో పేర్కొనబడింది. అంటే 'భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించినటువంటి భక్తులు ఏరోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తాయి. రుద్రాక్షలను దర్శించడం వల్ల లక్ష జన్మల పుణ్యం, ధరించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందీ అని అర్ధం.రుద్రాక్ష చెట్టు "ఎలయో కార్పస్" వర్గానికి చెందినది. రుద్రాక్షలకు నేపాల్ పుట్టినిల్లు. నేపాల్లోని పంచక్రోశి సమీపంలోని రుద్రాక్షారణ్యంలో మొదటిసారిగా రుద్రాక్ష జన్మించినట్లు చెప్పబడుతూ ఉంది. సంహరించడంతో నేపాల్, బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, ముంబై ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూలు తెల్లగా ఉండి ఆకులకన్నా చిన్నవిగా ఉంటాయి. ఈ చెట్టు ఫిబ్రవరిలో పూతకు వస్తుంది.
రుద్రాక్ష నామం?
రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధము. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.
"ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే"
అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి.రుద్రాక్షలలో వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు వున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది.
ఉపయోగాలు :
- 1. ఏకముఖి రుద్రాక్ష : ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.
- 2. ద్విముఖి : అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
- 3. త్రిముఖి : ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
- 4. చతుర్ముఖి : బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.
- 5. పంచముఖి : గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
- 6. షణ్ముఖి : కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
- 7. సప్తముఖి : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించద
- 8. అష్టముఖి : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
- 9. నవముఖి : భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.
- 10. దశముఖి : జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.
- 11. ఏకాదశముఖి : 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.
- 12. ద్వాదశముఖి : 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.
- 13. త్రయోదశముఖి : కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.
- 14. చతుర్దశముఖి : 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.
- 15. పంచదశముఖి : పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.
- 16. షోడశముఖి : 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.
- 17. సప్తదశముఖి : విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.
- 18. అష్టాదశముఖి : 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.
- 19. ఏకోన్నవింశతిముఖి : 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.
- 20. వింశతిముఖి : 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.
- 21. ఏకవింశతిముఖి : 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.
నిజమైన రుద్రాక్షలను గుర్తించడానికి ఎలా:
- 1. ఏకముఖి రుద్రాక్షలు ప్లాస్టిక్ లో వస్తాయి జాగ్రత్త వహించాలి.
- 2. ఏకముఖి రుద్రాక్షలు కెమికల్స్ తో కూడ వస్తాయి జాగ్రత్త వహించాలి.
- 3. "7"ముఖాల రుద్రాక్ష దగ్గర నుండి పెద్ద ముఖాల రుధ్రాక్షలు గీతలు చెక్కుతారు గమనించాలి.
- 4. రుధ్రాక్షకు ఏటువంటి పరీక్షలు గాని ఉండవు అనుభవంతో మాత్రమే గమనించాలి.
రుద్రాక్ష ధారణా నియమాలు :
- ♦️ సరైన రూపంలో లేని రుద్రాక్షలను, ముల్లులేని రుద్రాక్షలను, పురుగులు తిన్న, పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు. వీటిని అన్ని జాతుల, కులాలవారు ధరించవచ్చు. వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతోగూర్చిగానీ ధరించాలి. రుద్రాక్ష్లను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.
- ♦️ సంభోగ సమయంలో వీటిని ధరించకూడదు. ఒకవేళ ఆ సమయంలో పొరపాటున ధరించిన యెడల తరువాత వాటిని ఆవు పాలతో శుద్ధి చేయాలి. రుద్రాక్షను ధరించేముందు "ఓం నమశ్శివాయ" శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
- ♦️ సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు 'మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం' చేయడం మంచిది. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది. రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, మాంసాహారమును మానివేయడం మంచిది.
- ♦️ వివిధ రకాలైన సమస్యలతో బాధపడేవారు, వివిధ నక్షత్రాలు, రాసులవారు పండితుల సలహా మేరకు ఆయా ముఖాల రుద్రాక్షలను ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, మూర్చ, జలుబు, గొంతు వాపు అజీర్ణం, శ్వాసకోశ వ్యాధులు మొదలైన వ్యాధులకు రుద్రాక్ష ఉపయోగపడుతుంది.
సంకలనం: కోటేశ్వర్