కేరళలోని కాసరగోడ్ జిల్లా ఎడానూరు మఠాధిపతి పూజ్య శ్రీ కేశవానంద భారతీ స్వామీజీ సెప్టెంబర్ 6 ఆదివారం తెల్లవారుజామున నిర్యాణం చెందారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని వివరించే ఒక మైలురాయిగా నిలిచిపోయిన విషయం మనకు తెలిసిందే.
పూజ్య కేశవానంద భారతి మంజతయ శ్రీధర భట్ మరియు పద్మావతి దంపతులకు జన్మించారు. 19 సంవత్సరాల వయస్సులో ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. తరువాత 1960 లో ఎడానూరు మఠానికి అధిపతి అయ్యారు. ఎడానూరు మఠానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మఠం శ్రీ ఆది శంకరాచార్యుల మొదటి నలుగురు శిష్యులలో ఒకరైన శ్రీ తోటకాచార్య యొక్క పరంపరకు చెందినది.
శ్రీ కేశవానంద భారతి నేతృత్వంలోని న్యాయ పోరాటం మఠాల యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షించే క్రమంలో జరిగిన అత్యంత చారిత్రకమైన, సుదీర్ఘమైన కేసులలో ఒకటి. ‘కేశవానంద భారతి కేసు’ అని పిలువబడే ఈ కేసు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో “సౌభ్రాతృత్వం” అనే పదానికి స్పష్టమైన నిర్వచనాన్ని కనుగొన్న కేసు. కేశవానంద స్వామీజీ 1971 లో జరిగిన 29 వ రాజ్యాంగ సవరణను, 1969 లో జరిగిన కేరళ భూ సంస్కరణల చట్టాన్ని, 1971 లో జరిగిన కేరళ భూ సంస్కరణల సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని అనుసరించి, కేశవానంద స్వామి ప్రాథమిక హక్కుల సవరణను ప్రశ్నించిన మొదటి పిటిషనర్ అయ్యారు. ఈ కేసు యొక్క రాజకీయ ఔచిత్యం కారణంగా, అప్పటి పాలక వ్యవస్థ కూడా మొదటి నుంచీ కోర్టుపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. 13 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు పూర్తి ధర్మాసనం ఈ కేసును 66 రోజులలో విచారించి మరో చరిత్ర సృష్టించింది. కేశవానంద భారతి కేసు ఆ కాలంలో ప్రతిరోజూ దేశంలోని వార్తాపత్రికల ముఖ్యాంశాలలో చోటు దక్కించుకుంది.
సామాన్య ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగాన్ని సవరించవచ్చని ప్రభుత్వం కోర్టులో వాదించింది. రాజ్యాంగం యొక్క స్వభావం మరియు ప్రాథమిక నిర్మాణంపై న్యాయవ్యవస్థ మరియు ప్రభుత్వం కోర్టులో మాటల యుద్ధం జరిగింది.
చివరగా, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పార్లమెంటు సవరించలేదని సుప్రీంకోర్టు 6-7 మెజారిటీతో తీర్పు చెప్పడంతో న్యాయవ్యవస్థ విజయం సాధించింది. ఈ చారిత్రక తీర్పును ఏప్రిల్ 24, 1973 న ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన న్యాయమూర్తులకు తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వాలు పదోన్నతులు నిరాకరించిన సంగతి మనకు తెలిసిందే.
Source : Organiser. - విశ్వ సంవాద కేంద్రము