పవిత్రమైన దినాలలో పండుగలు జరుపుకోవడం అన్ని మతాలలోనూ ఉంది. తత్త్వ బోధలను వినడం ద్వారా, పురాణాది కథల ద్వారా సామాన్య జనులు కూడా ఎంతోకొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించినా, పూజాపునస్కారాలు, కొంత కర్మకాండ లేకుండా వారికి తృప్తి, మనశ్శాంతి కలుగవు. నోములు, దీక్షలు, వ్రతాలను పాటించటం వల్ల, పూజలు, పండుగ దినాల వల్ల ఇటువంటి తృప్తి వారికి దొరుకుతుంది. వీటిని అచరించిన ఫలితంగా ఇంద్రియ నిగ్రహం, మనశ్శాంతి ఆనందం లభించటయే కాక సమాజంలో ఐకమత్యం పెంపొంది పరస్పర సహాయసహకారాలు, మతసంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ కూడా జరుగుతుంది. మనస్సును నిరంతరం తత్త్వవిచారణలో నిమగ్నం చేయడం ఆందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అలాంటి సమయాల్లో మనస్సు విషయసుఖాలపైకి పోకుండా నిరోధించటానికి కూడా పూజలు, పండుగ దినాలు ఉపయుక్తాలవుతాయి.
అటువంటి విశేషమైన దినాల్లో ఇతర దినాల కంటే విశేషంగా దైవపూజ, ధ్యానం, సంకీర్తనలు చేయటానికి ప్రయత్నించాలి. ఈ రోజుల్లో రకరకాల పిండివంటలతో మనం ఆరగించే విందు, ఎక్కువ జపధ్యానాదులు అనుష్ఠించి మనం స్వీకరించవలసిన ఆధ్యాత్మిక విందుకు
ప్రతీక. కాని కేవలం పిండివంటలు ఆరగించడంతోనే ముగిస్తే పండుగలకు అర్థం ఉండదు. పర్వదినం సెలవు దినం అవుతుందంతే!
ఈ పండుగ, పర్వదినాలు మహాపురుషుల పుట్టినరోజులై ఉండవచ్చు ఉదాహరణకు రామనవమి లాంటివి. లేదా మనదేశపు ధార్మిక, సాంస్కృతిక చరిత్రలో మైలురాళ్ళు కావచ్చు. ఉదాహరణకు; గీతాజయంతి. లేదా ప్రకృతిమాతకు మనం కృతజ్ఞతలను సమర్పించే సంక్రాంతి మొదలైన పర్వదినాలు కావచ్చును. దీపావళి, దసరాలాంటి పండుగలు పురాణ ప్రాశస్త్యం కలిగినవి. ఇటువంటి రోజుల్లో విశేషంగా ఉపవాసం ఇంద్రియనిగ్రహం, దైవపూజ, పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులను పొందటం, తర్వాత బంధుమిత్రాదులతో విందు భోజనం చెయ్యటం, పరస్పరం గృహాలకు వెళ్ళి కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం మొదలైనవి వాడుకగా వస్తూ ఉన్నాయి. అయితే ఇవేవీ కూడా పర్వదినాలలో ఆచరించవలసిన జపతపాలకు ఆటంకంగా పరిణమించకూడదు.
ఉత్తర భారతదేశంలో దసరా కాలంలో శ్రీరామలీల దుర్గాపూజ మొదలైన ఉత్సవాలను ఎంతో ఆడంబరంగా జరుపుతారు. దక్షిణాన వినాయక చతుర్థిని ఘనంగా జరుపుకుంటారు. హోలీ, కృష్ణాష్టమి ఇత్యాది పండుగలను అన్ని ప్రాంతాలవారు వైభవంగా జరుపుకుంటారు.
దురదృష్టవశాత్తూ ఇటీవల వీటిలోని ధార్మికప్రభావం తక్కువై జుగుప్స కలిగించే వికృత చేష్టలు, హింసాత్మక ధోరణులు ప్రబలుతున్నాయి. హిందూసమాజం మేల్కొని ఇటువంటి అనుచిత క్రియాకలాపాలకు చోటులేకుండా చేసి ఈ పండుగల పవిత్రతను, వైశిష్ట్యన్ని, మహత్తా్వన్ని
కాపాడేందుకు ప్రయత్నించాలి.
రచన: స్వామి హర్షానంద