హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ మండిపడ్డారు. విజయవాడలోని మాచవరం పోలీస్స్టేషన్లో కొడాలి నానిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తితిదేలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చే అంశం ఎప్పటి నుంచో అమల్లో ఉందన్నారు. దేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేవుని విగ్రహాలను బొమ్మలుగా వ్యాఖ్యానించడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లేనని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు(నాని) గారి వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్త నిరసనలలో భాగంగా ఈ రోజు విజయవాడలో ఆంజనేయస్వామి వారి ఆలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు,రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి మంచి బుద్ధులు ప్రసాదించమని స్వామి వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
హిందువుల మనోభావాలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నదని,ఆచారాలను, ధర్మకార్యాలను ప్రశ్నించే వింత పోకడలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో మంత్రిగారి వ్యాఖ్యల పట్ల ఐ.పి.సి 295,295A,153A సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేయుటకు పోలీస్ వారికి ఫిర్యాదు చెయ్యడం జరిగింది.
_విశ్వ సంవాద కేంద్రము