ఈశ్వరుడు - చైతన్యము
ఓం ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ |
తేనత్యక్తేన భుంజీథా మాగృథః కస్యస్విద్ధనమ్ ||
- ఈశ్వరుడు : సర్వ వ్యాపకమై జీవాత్మ రూపముగా ప్రాణశక్తిని ప్రసాదించి, చైతన్యవంతము చేయువాడు.
- ఐశ్వర్యము : ఈశ్వరత్వము, ఒక్క చైతన్యమే తన ఏకత్వమునకు భంగము లేకుండా, పెక్కు రూపములతో ప్రకాశించుట అనెడి దానిని సంఘటితము చేసి ఆ నానా రూపములను ప్రకాశింపజేయుటను ఐశ్వర్యము అందురు.
- ఈశ్వరుడు - జీవుడు : స్థిర ప్రాణావస్థనుండి చంచల ప్రాణావస్థకు దిగిపోయినప్పుడు ఈశ్వరుడు జీవ భావమును పొందెను. జీవుడు తన చంచల ప్రాణావస్థను స్థిరప్రాణముగా చేసుకొన్నప్పుడు జీవుడు జీవ భావమును తొలగించుకొని ఈశ్వరుడగును.
- ఈశ్వర చైతన్యము : మాయావరణమునందు ప్రకాశించుచు, లోక లోకాంతరములందు సర్వ ప్రాణుల ఆత్మ స్వరూపములను ఆవిర్భవింప జేయుటకు కారణమైన చైతన్యమును ఈశ్వర చైతన్యమందురు. ఈశ్వర చైతన్యమునే విరాట్ శక్తి అని కూడా అందురు.
- ఈశ్వరుని శరీరములు : విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృతములనెడి శరీరములు - సమష్ఠి స్థూల, సమష్టి సూక్ష్మ, సమష్టి కారణ శరీరములు, జీవుల వ్యష్టి స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఈశ్వరుని సమష్టి శరీరములలో అంతర్భూతము.
- ఈశ్వర అహంకారములు : వైశ్వానర, సూత్రాత్మ, అంతర్యామి రూపములు ఈశ్వరాహంకారములు. ఇవి ఈశ్వరుని సమష్టి అవస్థావాసుల అహంకారములు. జీవుల వ్యష్టి అవస్థాత్రయ అభిమానులను విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అందురు.
- ఈశ్వరుని పంచకృత్యములు : సృష్టి, స్థితి, సంహార, నియామక, అను ప్రవేశములు, లేక సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములు.
- ఈశ్వరుని విభూతి: ఐశ్వర్యము, వైభవము, అష్టసిద్ధులు, మొదలైనవి. వివిధముగా కనబడుచున్నవన్నీ ఒకే ఒక్క సర్వాత్మకత్వము యొక్క విభూతులేనని అర్థము.
- ఈశ్వర గుణములు: సర్వజ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వనియంతృత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వాత్మకత్వము, సర్వశక్తిమత్వము మొదలగునవి.
- ఈశ్వర ప్రభుత్వము: కర్తృత్వము, అకర్తృత్వము, అన్యథా కర్తృత్వము.
- ఈశ్వరునిలో లేనివి: క్లేశములు, కర్మములు, కర్మ ఫలితములు, కోర్కెలు, కర్మఫల భోగ సంస్కారములు.
- ఈశ్వరుడు షడ్గుణైశ్వరుడు : జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, శ్రీ, యశస్సు, ఆనందము అనే మార్పు చెందని సహజ లక్షణములు ఆరున్నూ కలవాడు.
- ఈశ్వర జపము : ప్రణవము, ఓంకారమును అర్ధ సహితముగా జపించుటను ఈశ్వర జపము అందురు. ఇది జీవులు చేయవలసిన జపము. ఈశ్వరుడే ఓంకారేశ్వరుడు.
- ఈశ్వర ప్రణిధానము : ప్రణవార్థము యొక్క చింతన ఏది కలదో అది జీవులయొక్క ఈశ్వర ప్రణిధానము.
- ఎవరు షద్గుణైశ్వరులు : జీవులు యోగము వలన విశుద్ధమందు జ్ఞానమును, అనాహతమందు ఐశ్వర్యమును, మణిపూరకమందు శక్తిని, స్వాధిష్ఠానమందు బలమును, మూలాధారమందు వీర్యమును, ఆజ్ఞయందు తేజమును కలిగి యుందురో వారే షడ్గుణైశ్వర్యులు. వారే భగవాన్ అని పిలిపించుకొనుటకు యోగ్యులు.
పరమేశ్వరుడు : సృష్టికి మూలాధారము.
- ✽ మహేశ్వరుడు : సర్వభూతాంతర్యామి, సర్వ ప్రాణాధిపతి
- ✽ ఉమామహేశ్వరుడు : అర్థనారీశ్వరుడు, సత్, ఋతము, సదాత్మకము, నిర్వికారి, తన బ్రహ్మరంధ్రములోనే రేతస్సును నిగ్రహించబడియున్న మహా యోగి, యతీంద్రుడు, విశ్వ రక్షకుడైన పరమాత్మ.
- ✽ ఈశ్వరీయ మౌనము : సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ ఆకర్షణలు, త్రిగుణములు లేకుండా పోవుట. ఇది దక్షిణామూర్తిత్వము, మాయత్పరము, తత్పరము, అచల పరిపూర్ణము, బట్టబయలు.
- ✽ ప్రజాపతి : జీవాత్మలనెడి అనేకమునకు ప్రభువు.
- ✽ హిరణ్యగర్భుడు : సద్రూపమైన పరమాత్మ, పరబ్రహ్మయందు ఆవిర్భవించిన ప్రథమాత్మ, ప్రజాపతి, సకలమును సృష్టించి, వాటి ఆత్మలను తన సమష్టి ఆత్మతో చైతన్యవంతము చేసి, వాటిని పరిపాలించువాడు. జగత్కర్త, తత్మాయా రూపమైన సగుణ బ్రహ్మ, ప్రకృతిని తన గర్భములో ఉంచుకొనినవాడు. జగత్కారణుడు బంగారమువలె విశ్వమునందు ప్రకాశించే చైతన్య జ్యోతిని గర్భితమైయున్నవాడు.
- ✽ తత్పురుష : హిరణ్య గర్భుడే. జీవులలో బుద్ధికుశలతను పెంచువాడు.
- ✽ ఈశాన : హిరణ్యగర్భునికి ప్రభువు. విద్యాధిపతి, వేద పరిరక్షకుడు, శుభప్రదాత, శాంతి ప్రదాత, ప్రణవ రూపుడు.
- ✽ సద్యోజాత : జ్ఞానమూర్తి, జ్ఞానులకు భవబంధమును తొలగించువాడు. ఆత్మ సమర్పణతో ఆశ్రయించిన వారికి సద్యోముక్తిని అనుగ్రహించువాడు.
- ✽ వామదేవ : ఉదార స్వభావుడు, సృష్టిలో జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు. కాలాను గుణ్యమైన మార్పులను నియంత్రించువాడు. బలప్రదాత, దమన శక్తి ప్రదాత, మనస్సులను చైతన్యవంతము చేయువాడు.
- ✽ అఘోర : దక్షిణామూర్తి, వివిధ ప్రవృత్తులను రంజింపచేయువాడు. సాత్విక ప్రవృత్తికి నిర్దేశము. ఘోర స్వరూపమనగా రాజస వృత్తి, ఘోరతర స్వరూపమనగా తామస వృత్తి. అందువలన ఆ రెండు వృత్తులు లేని శుద్ధ సాత్విక ప్రవత్తి రూపమును అఘోరయందురు.
- 1. శివతత్త్వము
- 2. శక్తి తత్త్వము
- 3. సదాశివ తత్త్వము
- 4. ఈశ్వర తత్త్వము
- 5. శుద్ధ విద్యాతత్త్వము.
అన్ని చిదంశలయందు సమానముగా వ్యాపించియున్న చైతన్యము.
- చిదంశ : చిదంశ అనగా ఆత్మ స్వరూపము తోచకుండుట. అదే సమయములో ఆత్మ స్వరూపము ఆవరించబడగా, అచ్చోటనే సృష్టి పదార్థములు వ్యక్తమగుట. ఇది అధ్యాస. సృష్టి అనగా అనేక చిదంశలు నానాత్వముగా, భిన్నములుగా, సవికారముగా, అనిత్యముగా కనుపించుట. ఒక చిదంశ రూప జీవునిలో ఆవరణ, ఆధ్యాస కలుగగా, క్షోభపడి స్పందించుట విక్షేపము. ఈ మూడూ కలసి అవిద్య, ఈ క్రమమునకు కారణము జడశక్తి.
- పరశివతత్త్వము : అనంతమైన చిదంశలు ఏర్పడక ముందున్న అఖండముగా, అవిభాజ్యముగా, నిర్వికారముగా, శాశ్వతముగా నున్న పూర్ణము. ఎప్పటికీ చిదంశలు ఏర్పడనిదేదో, ఉన్నదున్నట్లున్నది అచల పరిపూర్ణము.
- 2. శక్తితత్త్వము :
- ఒక్కొక్క చిదంశలో సామాన్య చైతన్యముగానున్న శివతత్త్వము నేను, నేను అని స్ఫురించుట మరియు అనేక చిదంశలలో అనేక నేనులు స్ఫురించుటలో ఆ స్ఫురణ శక్తియే శక్తితత్త్వము.
- 3. సదాశివతత్త్వము :
- నేను నేను అని అనుకొను శివతత్త్వము చైతన్య ప్రధానమై అవిద్యను ఆవరించినప్పుడు అది సదాశివతత్త్వము.
- 4. ఈశ్వరతత్త్వము :
- అవిద్యయే తానైనట్లుగా అనుకొనుచు ఇది నేను ఇది నేను అని తలచినప్పుడు అది ఈశ్వరతత్త్వము. అవిద్య ప్రధానమై, చైతన్యమును ఆవరించినప్పుడు అది ఈశ్వరతత్త్వము.
- 5. శుద్ధ విద్యాతత్త్వము :
- సదాశివ తత్త్వమునకు, ఈశ్వరతత్త్వమునకు భేదాభేదములను విమర్శించి, గ్రహించు శక్తి శుద్ధవిద్యాతత్త్వమందురు
- శుద్ధ విద్య : నేను ఇది, ఇది నేను అను రెండు విధములైన భావనలుండును. అంతర్గతముగా నున్న నేను అనెడి చైతన్యమును గుర్తించుచుండుటను శుద్ధ విద్య అందురు.
- బ్రహ్మ : పృథివితత్త్వము వలన సృష్టి చేయుచు, జీవునికి జాగ్రత్ రూపమున సుఖానుభవమును కలిగించుచుండును.
- విష్ణువు : జలతత్త్వము వలన రక్షించుచు, స్వప్నరూపమున జీవునికి అనేక వినోదములను కల్గించుచుండును.
- రుద్రుడు : తేజము వలన లయము చేయుచు, జీవునికి సుషుప్తి రూపమును సర్వ శూన్యతను కలిగించును. జీవుని ఒక్కనిగా వేరుగా నుండునట్లు జేసి సుషుప్తిలో హాయిని కలిగించును.
- మహేశ్వరుడు : వాయుతత్త్వము వలన జీవునికి భ్రమ కలిగించుచు, తురీయ రూపమున అవస్థాత్రయ సాక్షిని చేయును.
- సదాశివుడు : ఆకాశ తత్త్వము వలన తెలివి కలిగించుచు, జీవుని తురీయాతీత రూపమున ఆనంద రూపునిగా చేయును.
ఈక్షించుట లేక వీక్షించుట అనగా, చూడబడుట ఎవరి వల్లనో అతడిదే ఈక్షణ. చూచుటయందు కర్తృత్వము లేకపోయినను, దృశ్యము తోచినందున, అది చూడబడుచుండగా దానిని ఈక్షించుట అందురు. ఈక్షణ వలన కలిగిన సంకల్పము, ఊహ, ఆలోచన, స్వప్నము, జ్ఞానము అనేవి ఏవైనా ఈక్షణకు పర్యవసానము. ఈ విధముగా ప్రకృతి ఈశ్వరుని చేత ఈక్షించబడినది. ప్రలయ దశలో ఉన్న నిర్వికల్ప బ్రహ్మకు మొదటగా కలిగిన స్పందన ఈక్షణగా బయలుదేరినది.
పూర్వ సృష్టికి సంబంధించిన జ్ఞానము ఆ నిర్వికల్ప బ్రహ్మయందు వాసనా రూపములో నున్నందున పరాశక్తి ప్రేరణ వలన ఆ వాసన ప్రకారమైన సృష్టి ఆవిర్భవించుటకు గాను ఈక్షణగా ప్రారంభమై, పునఃసృష్టికి అంకురార్పణ జరిగినది. ఈక్షణా వృత్తి ఎవరియందు కలిగి, గట్టి పడినదో, దాని వలన మొదటగా జీవత్వము ఏర్పడినదో, అతడే ప్రథమ జీవుడు. అతడే ఈశ్వరుడు. అప్పుడు ఈక్షణ అనునది ఈశ్వరునికి చెందినదైనది. అతడే ప్రథమ ప్రాణుడు, ప్రథమాత్మ, హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడనగా సమష్టి మనస్తత్వము. ఈక్షణ అనగా సంకల్ప శక్తి. సంకల్పమనగా ఊహలకు ఆరంభస్థితి. సంకల్ప శక్తి అనగా మాయా శక్తి. మాయ అనగా ఏది లేదో అది ఉన్నట్లు కనబడుట.
హిరణ్య గర్భుని ఊహా పరంపరలో ఊహ యొక్క ఆరంభస్థితి సృష్టి, ఊహ కొనసాగుతూ ఉండుట స్థితి, ఊహ యొక్క అంతము లయము. ఈ సృష్టి స్థితి లయములు ఆవృతమగుటను సంకల్ప వికల్పములందురు. దీర్ఘ వికల్పమే ప్రలయ కాలము. సంకల్ప వికల్పములనెడి చలనములే వికారములు. ఊహ దేని గురించియో అది నామరూప జగత్తు. ఆ జగత్తు నందలి జడ పదార్థములందు హిరణ్య గర్భుని ఊహ అంతర్భూతము. ఊహ లేనిదే జగత్తు లేదు. ఊహ ఉన్నంత వరకే జగత్తు ఉన్నది. కనుక జగత్తు, ఊహ కలసియే ఉన్నవి. జగత్తు జడము, ఊహయే ఈశ్వర చైతన్యము. నామరూపములు తోచని ఊహగా ఉన్న ఈశ్వర చైతన్యమే పరమాత్మ. దానిని శుద్ధ చైతన్యమందురు. దీనివలన జగత్తు ఊహ కల్పితమని నిశ్చయమగుచున్నది. దీనికంతకు మాయా శక్తి కారణమగుట చేత జగత్తు మిథ్య, అనగా ఈ జగత్తునకు నిజ అస్తిత్వము లేదు. కనబడుట మొదలై, అది మార్పు చెందుచూ, అనిత్యమైన స్థితులుగా ఉండి, కనుమరుగగుచుండును. జగత్తు అనగా సృష్టించబడి, గతిస్తూ, చివరికి నశించుచున్నదని అర్థము.
ఈశ్వరుడు కూడా ఆభాస రూపుడే. అట్టి ఈశ్వరుని బహిఃప్రజ్ఞ సమష్టి స్థూల ప్రపంచముగా తోచగా, అది ఈశ్వరుని జాగ్రదవస్థ. అప్పుడా ఈశ్వరుని పేరు విరాట్ పురుషుడు. ఈశ్వరుని అంతఃప్రజ్ఞ సమష్టి సూక్ష్మ ప్రపంచముగా తోచగా, అది ఈశ్వరుని స్వప్నావస్థ. అప్పుడా ఈశ్వరుని పేరు సూత్రాత్మ. ఈశ్వరుని ప్రజ్ఞ ఘనమైనప్పుడది జాగ్రత్ స్వప్నముల అవ్యాకృతము. అనగా ప్రళయము అనగా ఈశ్వరుని సుషుప్త్యావస్థ. అప్పుడా ఈశ్వరుని పేరు అవ్యాకృతుడు. అదే మాదిరిగా సంకల్ప సృష్టి యొక్క ఆరంభ దశయందు ఈశ్వరుని సృష్టికర్తయైన బ్రహ్మ అని అందురు. సంకల్పము కొనసాగుచుండగా, ఆ సృష్టించిన పదార్థములు స్థితి కలిగియున్నప్పుడు ఈశ్వరుని స్థితికర్త లేక పోషక కర్తయైన విష్ణువందురు. పోషించుట ద్వారా సృష్టికి స్థితి కలుగుచున్నది. పోషించుటను ఆపివేసినప్పుడు సంకల్ప మాత్ర సృష్టి కూడా లయమగుచున్నది. అప్పుడు ఈశ్వరుని లయ కర్త అయిన రుద్రుడని అందురు. అందువలన ఒక్క ఈశ్వరుడే త్రిమూర్తులుగా పిలువబడుచున్నాడు.
ఈశ్వరుడు మొదట ఈక్షించుచుండగా కర్తృత్వ భోక్తృత్వములు లేకపోయినను, క్రమముగా చూడబడిన దృశ్యమందు ఆసక్తి కలిగి కర్తగా భోక్తగా మారెను. భోగేచ్ఛ అధికము కాగా దృశ్యములతో తాదాత్మ్యత కలిగి అనేక జీవులయ్యెను. కేవల సత్వగుణము విజృంభించుట వలన శుద్ధసత్వ మాయ తోచి ఆ శుద్ధ సత్వమాయయందు ప్రతిఫలించిన బ్రహ్మ ప్రకాశము వలన (1) అధిష్ఠాన బ్రహ్మ ప్రకాశము (2) శుద్ధ సత్వ మాయ అనెడి ఉపాధి (3) ఆ ఉపాధిలో ప్రతిఫలించిన ప్రకాశము - ఈ మూడూ కలిసి ఈశ్వరుడయ్యెను. తరువాత తమోరజో గుణములు కూడా విజృంభించగా మలిన సత్వమాయ తోచి, ఆ మలిన సత్వమాయయందు ప్రతిఫలించిన బ్రహ్మ ప్రకాశము వలన (1) అధిష్ఠాన బ్రహ్మ ప్రకాశము (2) మలిన సత్వమాయ అనెడి ఉపాధి (3) ఆ ఉపాధిలో ప్రతిఫలించిన ప్రకాశములు - ఈ మూడూ కలిసి అనేక జీవులయ్యెను. ఈ కారణము వలన ఈశ్వరుడు శుద్ధ సత్వమాయోపాధికుడు. జీవులు మలిన సత్వమాయోపాధికులు. తమోరజోగుణములు రెండూ కలిసి అవిద్య అనబడును. గనుక జీవులు అవిద్యోపాధికులు.
ఈ భేదముచేత ఈశ్వరుడు సర్వజ్ఞుడు, మాయకు వశుడు కాదు. ఏకత్వానుభూతి కలిగియున్నవాడు. జీవులు కించిజ్ఞులు, మాయకు వశులైనవారు. (1) జీవునికి జీవునికి భేదము (2) జీవునికి ఈశ్వరునికి భేదము (3) జీవునికి జగత్తునకు భేదము (4) ఈశ్వరునికి జగత్తునకు భేదము అనునవి కలిగి నానాత్వముగాను, భేదములుగాను, వికారిగాను భ్రమ చెందెను. భ్రమ కారణముగా యద్భావంతద్భవతి అనే సూత్రము ననుసరించి జన్మకర్మ చక్రములో తిరుగుచు ప్రాకృతమైన శరీరములను పొందుచు, విడదీయుచు బద్ధుడయ్యెను. ఈశ్వరునికి ప్రాకృత శరీరము లేనందును ఈశ్వరుని ఈ అర్థములో నిరుపాధికుడని అందురు. బద్ధత్వము లేనందున ఇదంతయు ఈశ్వర విలాసము. నిజానికిది మాయా విలాసము.
అభాస రూప జీవులు, ఆభాసరూప ఈశ్వరుడు లేకపోగా, నిర్వికార చేతన రూప బ్రహ్మమే ఉన్నది. అది అచల పరిపూర్ణము. ఏ బ్రహ్మ వలన జీవేశ్వర జగత్తులు తోచెనో ఆ బ్రహ్మను మాయాశ బలిత బ్రహ్మమందురు.
ఈశ్వరుని చతుర్వ్యూహము :
- 1. వాసుదేవ వ్యూహము : నరనారాయణ రూపుడగు పురుషుని ఆశ్రయించి, ఆ పురుషునితో ఐక్యత భావము పొందిన ప్రకృతి, లేక మాయాశక్తి నిర్గుణుడైన పురుషోత్తముని సగుణునిగా చూపించుచు 'శ్రీ' అన్న పేరుతో వెలయుచుండగా, అట్టి పురుషుని రూపము వాసుదేవ వ్యూహము. నిర్గుణ నారాయణుని మాయా శక్తి ఆశ్రయించగా సగుణ నారాయణునిగా తోచును. ఆ సగుణ నారాయణుని శ్రీమన్నారాయణుడని అందురు. శ్రీ అనగా మాయావరణలోని ప్రకాశము. శ్రీ లేనిచో, నిరావరణమందు తాను తానుగా ప్రకాశించుకొను ప్రకాశ రూపము. ఈ వాసుదేవ వ్యూహములోని పురుషుడు శ్రీ యొక్క ఆశ్రయము వలన షడ్గుణైశ్వరుడగుచున్నాడు. భక్తులకు ఉపాస్యమైన వ్యూహములో నున్నాడు. వ్యూహాతీత పురుషుడు పురుషోత్తముడుగా నిర్గుణముగా, జ్ఞానుల లక్ష్యమై యున్నాడు.
- 2. సంకర్షణ వ్యూహము : భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, దిక్కులు, కాలము, అహంకారము, మహత్తు, మూల ప్రకృతి - ఇవన్నీ ఒకదానికంటే మరొకటి క్రమముగా పదేసి రెట్లు సూక్ష్మ తరము. పురుషుడు వీటన్నింటికంటె సూక్ష్మాతిసూక్ష్ముడై వీటియందే అణోరణియాన్గా వ్యాపించి ప్రతిదానిలోను అంతర్యామియై యున్నాడు. జగత్కారణుడుగాను, అతీతుడుగా కూడా ఉన్నాడు. ఈ పురుషుని వ్యూహము సంకర్షణ వ్యూహము. కర్షణ అనగా ఆకర్షణ శక్తి. మూడు పాదములు అతీతమైన మోక్ష స్థానము కాగా, ఒక్క పాదమందు మాయాశక్తి వలన ఏర్పడిన వాటిలో అంతర్యామియమై, వ్యూహాత్మకముగా సంసారాగ్నిలో తపించుచున్న జీవులను తనలోనికి చక్కగా ఆకర్షింపచేసుకొని మోక్షము నందించుచున్నాడు గనుక సంకర్షుణుడు మోక్ష ప్రదాతయగుచున్నాడు.
- 3. ప్రద్యుమ్న వ్యూహము : ఏకకాలములో ప్రకృతి రూపము, పురుష రూపము - రెండూ తానే అయినట్టి వ్యూహములోని పురుషుడిని ప్రద్యుమ్నుడని అందురు. ఇతడు ఈ వ్యూహములో సత్వగుణముచేత సృష్టిని రక్షించుచు, పోషించుచు, తన భక్తులకు ఉపకారము చేయగల శక్తి సంపన్నుడై యుండును. పురుషుడే చేయుచున్నట్లు కనబడుచున్నను, శ్రీ శబ్దము యొక్క ఆశ్రయము చేతనే అన్నియు జరుగుచున్నవి గాని, పురుషుడు మాత్రము ఏమీచేయని నిర్గుణుడు అనగా పురుషోత్తముడే.
- 4. అనిరుద్ధ వ్యూహము : జీవుల కర్మలను నశింపజేయుచు, సకల ప్రాణుల కర్మలను నిర్వర్తింపజేయు పురుషుని వ్యూహము అనిరుద్ధ వ్యూహము. ఈ వ్యూహములోని పురుషుడు అర్చారూపమున భక్తుల పూజలను, అర్చనలను స్వీకరించుచు, భక్తులను అనుగ్రహించుచుండును. అనిరుద్ధమనగా నిరుద్ధమును లేకుండా చేయుట. అందువల్లనే భక్తులకు, భగవంతునికి మధ్య అడ్డుగానున్న వాటిని నిరోధించును. అనగా భగవదైక్యమును అనుగ్రహించును. అందువలన ఈ వ్యూహములో నిజభక్తుల యొక్క కర్మలను నివర్తింపజేయును.
కర్మాధ్యక్షుడు :
పరమాత్మకు అధీనమై, సృష్టి స్థితి లయములను, కర్మఫల నియమములను నిర్వహించు వానిని కర్మాధ్యక్షుడందురు. ఇతనికే (1) ఆధ్యాత్మికముగా ప్రాణుడు, వైశ్వానరుడు అని పేరులు. (2) ఆధి భౌతికముగా వాయువు, మాతరిశ్వుడని పేరులు (3) ఆధిదైవికముగా హిరణ్యగర్భుడు, సూత్రాత్మ అని పేరులు.
క్షరము :
ప్రధానతత్త్వమనే పేరుతో ప్రకృతి తత్త్వమును కల్పించిన చేతన బ్రహ్మ, ఆ ప్రకృతికి చేతనత్వమును కలిగించెను. చేతనత్వమును పొందిన ప్రకృతి క్షరము అనగా నశించునది.
అక్షరము :
చేతనత్వమును, ప్రకృతి తత్త్వమును వేరుచేసి చూచినప్పుడు కేవల చేతనత్వము విలక్షణము కాగా ఆ కేవల చేతన బ్రహ్మమే అక్షరము.
ఐతరేయము :
ప్రకృతి అంతటికిని వేరైయుండి, అయినా అంతా తానే అయికూడా ఉండుట. వ్యూహములలో అంతర్యామియై, విలక్షణమై యుండి, అన్నియూ తానే కూడా అయి వుండుటను ఐతరేయమని అందురు. ఇతరములకంటే ఇతరమైన అద్వితీయ పురుషుడే ఐతరేయుడు. ఇతర సంబంధములేని అసంగుడైన పురుషుడే పురుషోత్తముడు.
అంతర్యామి :
ఎవడు అష్ట ప్రకృతులయందుండునో అష్ట ప్రకృతులతడిని ఎరుగవో, వాడు అంతర్యామి. ఎవనికి అష్ట ప్రకృతులు ఉపాధులో, ఎవడు వాటిని తనలోనికి ఈడ్చుకొని పోగలడో, వాడు అంతర్యామి. ఎవడు సకల జీవోపాధులందు చరాచర జగత్తునందు అణోరణియాన్గా ఉంటూ, వాటికి ఆత్మగాను, అమృతుడుగాను ఉండునో, వాడు అంతర్యామి.
సృష్టిలో ప్రవేశించి, ఆ సృష్టిని తన వశములో ఉంచుకొని, తన మూలముగా, సర్వమును లీలగా దర్శించు తత్త్వమును అంతర్యామిత్వము అందురు. అది సర్వమును తన విభూతిగా దర్శించు తత్త్వము.
అంతర్యామి లక్షణములు :
సర్వసాధారణమైనది, సర్వమునందు అణగి యుండునది, అగోచరమైనది, సర్వోపాధికత్వము, సర్వమును తనలోనికి ఆకర్షించుకొని, అవ్యక్తము చేయునది, సర్వమునకు ఏకాత్మగా, విశ్వమునకును ఏకాత్మగా ఉండునది - ఇవన్నీ అంతర్యామి లక్షణములు.
సంకలనం: చల్లపల్లి