కాలంలో ప్రయాణం :- ఐన్ స్టీన్ సాపేక్ష సిద్దాంతానికి, కాలంలో ప్రయాణానికి సంబంధించి చక్కని ఉదాహరణలు మన ప్రాచీన హిందూ గ్రంథాలలో లభిస్తాయి.
హిందూ పురాణాల ప్రకారం 864 కోట్ల మానవ సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజుతో సమానం. నాలుగు యుగాలు కలిపి ఒక చతుర్యుగం. (ఒక చతుర్యుగం అంటే 43.2 లక్షల మానవ సంవత్సరాలు) ఒక చతుర్యుగం 71 సార్లు పునరావృతమైతే అది ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు కలిపి బ్రహ్మకు ఒక పగలు. అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు. మరో 14 మన్వంతరాలు కలిపి బ్రహ్మ కు ఒక రాత్రి. అంటే మానవులకు, దేవతలకు కాలం ఒకేరీతిగా సాగదు.
రాజా కకుద్మి లేక రైవతుడు :-
పూర్వం కృత యుగంలో దయాళువైన, ధైర్యవంతుడైన ‘కకుద్మి’ (లేదా రైవతుడు) అనే రాజు వుండేవాడు. ఆయనకు రేవతి అనే అందమైన కూతురు ఉండేది. తన కూతురికి తగిన వరుడు ఈ భూమండలం మొత్తం గాలించినా అతడికి దొరకలేదు. అందుకని ఆ రాజు తన మనోబలముతో తన కూతురిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు.
వారు బ్రహ్మ లోకం వెళ్ళే సరికి బ్రహ్మ దేవుడు గంథర్వుల సంగీత విభావరిని వింటున్నాడు. ఆ కార్యక్రమం పూర్తయ్యేదాకా రాజు రైవతుడు, అతడి కుమార్తె రేవతి వేచిఉన్నారు. అప్పుడు బ్రహ్మ దేవుడు రైవతుడిని తన సమస్య ఏమిటని అడిగాడు. అప్పుడు రైవతుడు “ నా పుత్రిక కోసం తగిన వరుడిని మీరు పుట్టించారా లేదా అన్నది తెలుసుకొని వెళ్దామ”ని వచ్చానన్నాడు.
అప్పుడు బ్రహ్మ దేవుడు నవ్వుతూ ఇలా అన్నాడు. : “ వివిధ లోకాలలో కాలం వివిధంగా గడుస్తుంది. ఈ దివ్య లోకంలో మీరు గడిపే కొద్ది నిమిషాలు భూమి మీద ఎన్నో యుగాలతో సమానం. మీరు ఈ లోకంలో గడిపిన కొద్ది సమయంలో భూమి మీద 27 చతుర్యుగాలు (ఒక చతుర్యుగం అంటే 43.2 లక్షల మానవ సంవత్సరాలు) గడిచి పోయాయి. ఓ రాజా ! నీ మంత్రులు, రాణులు, బంధుజన సపరివారం సమస్తం కాలగతిలో కలిసి పోయారు. ఇప్పుడు భూమి మీద నీ గురించి గానీ, నీ వంశస్థుల గురించి గానీ ఎవరికీ తెలియదు. ”
దాంతో దిగ్భ్రాంతి చెందిన కకుద్మి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని బ్రహ్మను అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు : “ నువ్వు ఇప్పుడు బయలు దేరి భూమి కి చేరితే అక్కడ 28వ మన్వంతరంలోని ద్వాపర యుగం పూర్తికావస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న శ్రీ కృష్ణుని సోదరుడు, ఆదిశేషుని అవతారము అయిన బలరామునితో నీ కుమార్తెకు వివాహం జరిపించు. మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ” అని అంటూనే బ్రహ్మ దేవుడు మరొక్క మాట చెప్పాడు. “రేవతిని నీ వెంట ఈ లోకానికి తీసుకొని రావడం చాలా మంచిదైంది. ఈ కారణం వల్ల ఆమె వయస్సు ఎంతమాత్రము పెరగలేదు.”
రైవతుడు మరియు అతడి కుమార్తె రేవతి బ్రహ్మదేవునికి ప్రణామాలర్పించి భూమికి తిరుగు ప్రయాణమవుతారు. ఆ తర్వాత రైవతుడు తన కుమార్తెను బలరాముడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ గాథ మహాభారతం, భాగవత పురాణం, విష్ణు పురాణం, గార్గి సంహిత, దేవీ భాగవతం లలో కనబడుతుంది.
బ్రహ్మ |
బ్రహ్మ విమోహన లీల :-
ద్వాపర యుగంలో ఒకరోజు బృందావనం లో శ్రీ కృష్ణుడు గోవులతోను, గోపబాలురతోనూ ఆడుకుంటూ ఉన్నాడు. ఆ చిన్నికృష్ణుడే మహావిష్ణువు అవతారమని బ్రహ్మ దేవుడు నమ్మలేక పోయాడు. ఆ విషయాన్ని నిర్థారించుకోవటానికి శ్రీ కృష్ణుని గోవులను, గోపబాలురను అపహరించి, వారిని ఒక గుహలోకి తీసుకువెళ్ళి తన మాయా శక్తితో వారిని సుషుప్తావస్థలో ఉంచుతాడు.
బ్రహ్మదేవుడు తనకు పరీక్ష పెడుతున్నాడని గ్రహించిన శ్రీ కృష్ణుడు తన శక్తితో అచ్చు అలాంటి గోవుల, గోపబాలుర రూపాలను ధరిస్తాడు. బ్రహ్మదేవునికి తన లోకంలో త్రుటి కాలం గడిచిన తర్వాత భూమి మీద ఒక సంవత్సర కాలం గడిచినట్లు గ్రహిస్తాడు. (త్రుటి అంటే సెకనులో 33,750 వ వంతు) అప్పుడు బృందావనంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని బ్రహ్మదేవుడు తన హంస వాహనం మీద వెళ్లి పరిశీలిస్తే శ్రీకృష్ణుడు యథాప్రకారం తన గోవులతో, గోపబాలురతో ఆడుకుంటూ కనిపిస్తాడు.
అచ్చు ఒకేలా ఉన్న గోపబాలురు, గోవులు ఒకే సమయంలో అటు గుహలో సుషుప్తావస్థలోనూ, ఇటు శ్రీకృష్ణుడితో బృందావనంలో ఆడుకుంటూ ఉండటం చూసి బ్రహ్మదేవుడు, శ్రీకృష్ణుడు మహావిష్ణువు అవతారమని గ్రహిస్తాడు. దాంతో శ్రీకృష్ణునికి క్షమాపణలు చెప్పి అతని గోవులను, గోపబాలురను తిరిగి అతనికి అప్పజెప్పి బ్రహ్మ తిరిగి తన లోకానికి వెళ్లి పోతాడు. అప్పుడు ఆ గోవులకు, గోపబాలురకు నకళ్ళైన శ్రీకృష్ణుని రూపాలు అదృశ్యమవుతాయి. ఒక సంవత్సరం తర్వాత మేలుకున్నప్పటికీ ఆ గోపబాలురకు ఒక్క క్షణమే గడిచినట్లుగా అనిపిస్తుంది. ఒక సంవత్సరం క్రితం విషయాలే వారికి గుర్తుంటాయి.
రాజా ముచికుందుడు :-
ఒకసారి త్రేతాయుగంలో దేవలోకం మీదకి రాక్షసులు దండెత్తి వచ్చినపుడు దేవేంద్రుడు ఇతర లోకాలలోని వీరుల సహాయం కోరతాడు. అప్పుడు భూలోకం నుండి ముచికుందుడనే ఇక్ష్వాకు రాజు దేవలోకం వెళ్లి రాక్షసులతో పోరాడతాడు. ఒక సంవత్సరం పాటు జరిగిన ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులను ఓడిస్తారు. యుద్ధం పూర్తయ్యాక ఇంద్రుడు ముచికుందుడిని ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు ముచికుందుడు తాను తిరిగి భూలోకానికి వెళ్లి తన కుటుంబాన్ని కలవాలనుకుంటున్నట్లు చెబుతాడు.
దానికి ఇంద్రుడు గంభీరంగా ఇలా సమాధానం చెబుతాడు : “నువ్వు ఇక్కడ యుద్ధం చేసింది ఒక సంవత్సర కాలమే అయినా ఈలోపు భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచి పోయాయి. కాబట్టి ఇప్పుడు నీవారెవరూ భూమి మీద లేరు.”
అప్పుడు ముచికుందుడు తాను సంవత్సరం పాటు క్షణమైనా నిద్ర పోకుండా యుద్ధం చేసి అలిసి పోయానని, కాబట్టి ఎలాంటి అవాంతరం లేని నిద్రని తనకు కావాలని, తన నిద్రకు ఎవరైతే భంగం కలిగిస్తారో వారు నిలువెల్లా భస్మం కావాలని వరం కోరతాడు. ఇంద్రుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.
ఈ పురాణ గాథలను బట్టి వివిధ లోకాలలో కాలం వివిధంగా గడుస్తుందని తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే ఐన్ స్టీన్ చెప్పిన ‘టైం డైలేషన్’ (కాలం యొక్క సాపేక్షత) అనే భావన హిందూ పురాణాలలో ఉందని తెలుస్తుంది. స్థల కాలాల గురించి, కాలం యొక్క సాపేక్షత గురించి నేడు శాస్త్రవేత్తలు, రోదసీ వ్యోమగాములు కొత్తగా కనుక్కొంటున్న ఇలాంటి శాస్త్రీయ విషయాల ప్రస్తావన వేల సంవత్సరాల క్రితమే హిందూ గ్రంథాలలో ఉండడం విశేషం.
- భాగవత పురాణం ‘కాలం యొక్క సాపేక్షత’ గురించి ఇలా చెబుతుంది : “ ……ఇతర గ్రహాలలోని వివిధ కాలాలతో పోల్చి చూస్తే భూమి మీద మానవుని పూర్ణాయువు వంద సంవత్సరాలు మాత్రమే ……….అణువు నుండీ బ్రహ్మ యొక్క జీవితకాలంలోని సమయ విభాగాల దాకా వివిధ నిరూపకాలను నియంత్రించేది ఆద్యంతరహితమైన కాలం మాత్రమే. అయినప్పటికీ అది పరమాత్ముని నియంత్రణలోనే ఉంటుంది. సత్యలోకం మరియు ఇతర ఊర్థ్వ లోకాల విషయంలోనైనా సరే దేహ స్ఫృహ కల వారికే కాలభావం అనేది వర్తిస్తుంది.”
- న్యూటన్ భావించినట్లు ఈ విశ్వమంతా గడియారాలు ఒకే రీతిలో నడవవని ఐన్ స్టీన్ నిరూపించాడు. భూమి మీద ఒక సెకను కాలం, అంగారక గ్రహం మీద ఒక సెకను కాలం సమానం కాదని ఐన్ స్టీన్ తెలిపాడు.
- ‘యోగ వాసిష్టము’ మొదలైన గ్రంథాలలో యోగ సాధనతో వెనకటి కాలానికి వెళ్ళడం, పూర్వ జన్మలోని అనుభవాలను తెలుసుకోవడం, అలాగే భవిష్యత్తును దర్శించడం మొదలైన అనేక రకాల వర్ణనలు కనిపిస్తాయి. వివిధ లోకాలలో కాలం వివిధంగా గడుస్తుందనే భావన ‘యోగ వాసిష్టం’లో కనబడుతుంది. ఈ భావనలన్నీ ఐన్ స్టీన్ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నాయి.
- 'యోగ వాశిష్టం' అనే గ్రంథం వసిష్టునికి, శ్రీ రామునికీ మధ్య జరిగిన సంవాద రూపంలో ఉంటుంది. ఇందులో కాలానికి అతీతంగా జీవించే, చిరంజీవి ఐన 'కాక భుషుండి' అనే మహాయోగి ప్రస్తావన ఉంది. ఈయన కాకి రూపంలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. అతడు చక్రీయంగా తిరిగే కాలంలో, ఎన్నో కల్పాలను, ప్రళయాలను చూశాడు. అతడు మహాయోగి కావడం వల్ల తన ధారణ శక్తితో ప్రళయకాలంలో కూడా తన శరీరాన్ని కాపాడుకున్నాడు.
మహామేరు పర్వత సమీపంలో ఉన్న ఈయనను వసిష్టుడు సందర్శించినప్పుడు భుషుండుడు ఇలా అంటాడు :
"వశిష్టునిగా నీకిది ఎనిమిదవ జన్మ. మనమిలా కలవడం ఇది ఎనిమిదవ సారి. నేను ఎన్నో కల్పాల పాటు ఇదే చోట ఉన్నాను. ఐదు సార్లు ఈ భూమిని విష్ణుమూర్తి కూర్మావతారంలో రక్షించడం, పన్నెండు సార్లు క్షీరసాగర మథనం జరగడం, ఆరు సార్లు మహావిష్ణువు, పరశురామునిగా అవతరించడం, వంద కలియుగాలలో బుద్ధుడు తిరిగి తిరిగి అవతరించడం, ముప్పై సార్లు త్రిపురాలు అగ్నికీలలకు ఆహుతి అవ్వడం, రెండు సార్లు దక్ష యజ్ఞం జరగడం, పదకొండు సార్లు రామాయణం, పదహారు సార్లు మహాభారతం విభిన్న ఫలితాలతో జరగడం నేను ప్రత్యక్షంగా చూశాను."
అంటే ఈయన కాల చక్రానికి అతీతంగా ఉండి అందులో చక్రీయంగా జరిగే అన్ని సంఘటనలకు సాక్షీభూతంగా ఉన్నాడని తెలుస్తోంది. అంతే కాక ఉపపరమాణు స్థాయిలో బహుళ విశ్వాలు లేక సమాంతర విశ్వాలు ఉంటాయని 'యోగ వాశిష్టం' చెబుతుంది. మనకు అనుభవంలోకి రాని అనేక నిరూపకాలు (కొలతలు) ఉన్నాయని, ఆ నిరూపకాలలో అనేక విశ్వాలుంటాయని నేడు శాస్త్రవేత్తలు భావిస్తున్న 'బహుళ విశ్వ భావన' (Multiverse Theory) లేక 'సమాంతర విశ్వ భావన' (Parallel Universes) తో ఇది సరిపోలుతోంది.
సంకలనం: వేమూరి మణి కుమార్