గోవు ఇచ్చే అత్యుత్తమమైన ఉత్పత్తి గోమయము. (ఆవు పేడ.). గోవు అంటే ఆవు, ఎద్దు, ఆడ దూడ , మగ దూడ ఇవన్నీ గోసంతతి లో భాగము. సంపద నివ్వడములో ఆవు పాలు, పాల ఉత్పత్తులు అనేవి గోమయము తరువాతే. మన పెద్దలు ఈ విషయాన్ని అర్ధము చేసుకొనే " " గోమయే వసతి లక్ష్మీ " ( గోమయము లో సంపద ఉంది) అని చెప్పారు. గోమయమును మట్టిలో కలిసేటట్లు వాడి, ఆవు కడుపులో ఉండే ఎన్నో రకాల సూక్ష్మ జీవులను మట్టిలో ఉండేటట్లు చేయడమే మనిషి తన విచక్షణతో చేయవలసిన పని. అటువంటి మట్టి నుండి వచ్చే పంటలు పంచభూతాలలోని భూతత్వమును అధికముగా కలిగి ఉండి ఆరోగ్యమును, ఆర్ధిక స్థిరత్వమును, అనందమును ఇస్తాయి.
దేశవాళీ గోమయము |
మట్టిలోని సారమును పెంచడములో ఆవు పేడ విలువను తెలియజెప్పడానికే శ్రీ కృష్ణుడు భగవానుడు గోవులతో సంచారము చేసేవాడు. గోవులు గడ్డి తింటూ , తిరుగుతూ మట్టిలో పేడ వెయ్యడము వలన భూములు సారవంతము అవుతాయి. శ్రీ కృష్ణుడు ఆవులను తిప్పుతూ వనాలను, బృందావనాలను ఇలానే తయారుచేసినాడు.
గడిచిన గత యాభై సంవత్సరాలలో అధిక పాలకోసము జరిగే ప్రయత్నాలలో దేశీ ఆవు ( భారత దేశములోని వివిధ రాష్ట్రాలలో మూపురం తో ఉండే సహజ ఆవులు ) స్థానములో జేరిశీ అనే జీవి వచ్చింది. అందువలన మనకు తెలియకుండానే వ్యవసాయ ఎరువులో ఆవు పేడ ఉండే స్థితి తగ్గుతూ వచ్చింది. దేశీ ఆవులు తగ్గిన పరిస్థితులలో ఇప్పటికి ఉన్న తక్కువ ఆవులతోనే ఎక్కువ వ్యవసాయము సహజముగా జరగడానికి సుభాష్ పాలేకర్ గారు "జీవామృతము" అనే సూక్ష్మజీవుల ద్రవమును ఆవిష్కరించారు. ఒక ఆవు ఉంటే రైతే దీనిని పొలము దగ్గర తయారు చేసుకొన వచ్చును.10kg లు ఆవు పేడ, 10 లీటర్ల ఆవుమూత్రము, 2 kg ల బెల్లము, 2Kg ల పప్పుల పిండితో 200 లీటర్ల నీరు, దోసెడు మట్టి కలిపి రెండు రోజులు పులియ బెట్టి జీవామృతమును చేసుకొనవచ్చును. దీనినే మొక్క ఆకుల మీద, మట్టి మీద 15 రోజులకు ఒకసారి జల్లుకొంటారు. ఒక లీటరు జీవానృతమునకు 10 లీటర్ల నీరు కలిపి జల్లుకోవాలి. అలా తయారు అయ్యే జీవామృతము ఒక ఎకరానికి వస్తుంది. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానమునకు రైతు పొలములోనే తయారయ్యే జీవామృతమే మూలము.
ఈ భూమి మీద జీవమును పుట్టించి నప్పుడు మట్టి సారమును కాపాడడానికి భగవంతుడు ఎటువంటి సూక్ష్మ జీవులను మట్టిలో ఉంచాడో అవే సూక్ష్మ జీవులు ఆవు కడుపులో నుండి ఈ భూమిని సారవంతము చేయడానికి ప్రతిరోజూ గోమయము ( ఆవు పేడ ) ద్వారా వస్తూనే ఉంటాయి. మనిషి సృష్టించిన రసాయనాలతో భూమిలోని సారము విధ్వంసము అయినది. వ్యవసాయభూములలోని మట్టి లో సారమును తొందరలోనే ఆవు పేడ లేదా జీవామృతము తిరిగి తీసుకొని రాగలదు. గోవు (గోసంతతి సంచారము) మన దేశములోని వ్యవసాయ విధానాలకు, ఆర్ధిక స్థిరత్వానికి, ఇక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు ఎంతో అనుకూలమైనది.
గోసంతతి అంటే ఆవు, ఎద్దు, ఆడ దూడ, మగ దూడ ఇవ్వన్నీ కూడా కలిపితేనే గోసంతతి. ఆవు ఒకదానినే గోవు అన్నట్లుగా ఇప్పటి తరాల వారము మారిపోయాము. ఈ దృక్పధమును మనము మార్చుకోవాలి. గోసంచారము జరగాలి. గోసంతతి పెరగాలి. భూములు సారవంతము అవ్వాలి. మన దేశమునకు ఆరోగ్య, ఆర్ధిక భద్రత ఇంకా ఇంకా పెరగుతూ ఉండాలి.
వ్యాసమూలము: ప్రకృతి వ్యవసాయ ప్రచార కేంద్రము, భాగ్యనగరం. 040-27635867, letssave@gmail.com,