పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భాజపా నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల భాజపా శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో భాజపానేత విష్ణువర్థన్‌రెడ్డి, తిరుపతిలో భానుప్రకాశ్‌రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని కొడాలి నాని అవమాన పరచారని మండిపడ్డారు. గుడివాడలో భాజపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
__విశ్వ సంవాద కేంద్రము