డా|| మంతెన సూర్యనారాయణ రాజు
భగత్‌సింగ్ పేరు చెబితేనే రక్తం మోసులెత్తుతుంది. ఆయన 1907 సెప్టెంబర్ నెల 28వ తేదీన శనివారం నాడు ‘ల్యాల్లపురం జిల్లా’ ‘జఠవాలాత హసీలు (మండలం)లో ‘బంగ’అనే ఊరిలో విద్యావతి, సర్దార్ కిషన్ సింగులకు జన్మించారు. భగత్ తండ్రి కిషన్ సింగ్, పినతండ్రి స్వర్ణసింగ్ ఇద్దరూ ఆ రోజుల్లో మాతృదేశ దాస్యశృంఖలాలు తెంచే విప్లవ కార్యక్రమాలలో లా¬ర్ సెంట్రల్ జైలులో బందీలుగా ఉన్నారు. లా¬ర్తో బాటు ‘బర్మా’ కూడా ఆకాలంలో ఇండియాలో భాగంగానే ఉండేదట. భగత్‌సింగ్ మరో పినతండ్రి అజిత్‌సింగ్ బర్మాలోని ‘మాండల్ చెరసాల’లో బందీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఉదార భావాలు గల భగత్సింగు తాత అర్జున్‌సింగ్ ఆర్యసమాజానికి చెందిన వ్యక్తి. జాతీయోద్యమ కార్యకలాపాల వల్ల లాలాలజపతిరాయ్, భాయీపరమానంద, సూఫీ అంబాప్రసాద్, మహాత్మాహంసరాజ్ వంటి స్వాతంత్య్ర పోరాట యోధులతో భగత్‌సింగ్ కుటుంబానికి మిక్కిలి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎక్కడ చూసినా సభలూ, సమ్మెలూ, ఆందోళనలూ జరుగుతున్న కాలం.
‘భగత్’ అంటే అదృష్టం అని అర్థమట. మొదట్లో ‘భగత్’ వాలా’ అని పిలిచేవారు. అన్న పేరు జగత్సింగ్ కావడం వల్ల ఈయన పేరులో ‘వాలా’కి బదులు ‘భగత్‌సింగ్’గా మార్చారని చెబుతారు. ఆయన తల్లి చాలా ధైర్యవంతురాలు, సాహసి. ఎన్ని కష్టాలొచ్చినా చలించని మనస్తత్వం ఆమెది. నాలుగుసార్లు ఆమెను నాగుపాము కాటేసిన ఏమీ కాలేదు. భగత్‌సింగ్ ‘బంగా’లో జిల్లా బోర్డు ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. ఐదవ తరగతి వరకూ ఆయన అక్కడే చదివిన తర్వాత లా¬ర్లోని డి.వి.ఎ.స్కూల్లో చేర్పించారు. అదే స్కూలులో ఆంగ్లం, ఉర్దూ, సంస్కృతమూ తాను చక్కగానే నేర్చుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే గదర్ ఉద్యమం, జలియన్ వాలాబాగ్ హత్యాకాండ భగత్ మీద తీవ్ర ప్రభావం చూపాయి. విదేశాల్లో గల భారత విప్లవకారుల కథలు భగత్‌సింగ్‌ను ఉత్తేజ పరిచాయి. 1916లో ‘సురభ’ అనే ఆయన మితృణ్ణి తెల్లదొర తనం ఉరితీసింది. ‘సురభ’ ఫోటోను జేబులో పెట్టుకుని భగత్ ప్రేరణ పొందడానికి గాను రోజు దాన్ని చూసుకుంటుండేవాడు.
ఇంకో ముచ్చటేమిటంటే మూడేళ్ల వయసులోనే గడ్డి మొక్కల్ని నాటుతూ ఆయన బందూకుల్ని నాటుతున్నాననే వాడు. ఆ నాడే బ్రిటిషు ప్రభుత్వంతో పోరాటం చేస్తానని జబ్బలు చరి చేరినాడు. చిన్నతనంలోనే దేశం పట్ల ప్రేమ, స్వాతంత్య్ర కాంక్ష రంగులు కున్నాయి. అందుచేత తల్లి అతనితో పెళ్ళి ప్రస్థావించినప్పటికీ ‘తాత నన్ను దేశానికి వదిలేసాడు’ అని వివాహం చేసుకోకుండా ఢిల్లీ వెళ్లిపోయి ఒక పత్రికలో చేరి స్వాతంత్య్రోచ్ఛతో రచనలు చేయసాగాడు. నాయనమ్మ నీ పెళ్లి చూడాలంటోంది, పెళ్ళి నిశ్చయించాం రమ్మంటే భగత్ సింగ్ ‘మీ ఉత్తరం చదివి నేను ఆందోళన చెందాను. మీ వంటి దేశభక్తుడు, వీరుడు ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకుంటే ఇక సామాన్యుడి మాటేవిటి? నా గురించి, నాయనమ్మ గురించి ఆలోచించకుండా కోట్లాది దేశ ప్రజల గురించి ఆలోచించరేం’ అంటూ ఎదురు ప్రశ్న వేసాడు. భగత్‌సింగ్ ఒక వ్యక్తి కాదు. మహా విప్లవ శక్తి అని చెప్పుకోవాలి.
అన్యాయాల్ని, అణచివేతలను నిర్భయంగా ఆయన ఎదిరిస్తుండేవారు. బాల్యంలో పౌరుషంతో బాటు భగత్‌సింగ్ కళల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి కనబరిచేవారు. సంగీతంలో ప్రవేశం, నాటకాలు వేస్తుండేవారు. తాను మిక్కిలి హాస్య ప్రియుడు. తరగతిని ఎగ్గొట్టాలంటే స్నేహితులతో ఏకమై గురువుని అప్రస్తుత ప్రసంగంలోకి లాగి వారందరితో క్లాసులోంచి ఆయనే పొమ్మనేటట్లు ప్రణాళికను తయారు చేసుకోగల బుద్ధిశాలి కూడా. సాహిత్యంలో ఆయనకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి. ఏ దేశ పోరాట చరిత్రైనా సాహిత్యంతో ముడిపడి ఉంటుందని ఆయన ప్రగాఢమైన విశ్వాసం. నేను టెర్రరిస్టును కాను, ఒక విప్లవ కారుడిని అనే వారు. ”జలియన్ వాలాబాగ్’ సంఘటనతో ఆయనకు బ్రిటిష్ వారి మీద విపరీతమైన ఆగ్రహం కలిగింది. ‘డయ్యర్’ చేసే దురాగతాలను చూసాక ఆయనలో పాలకుల పీచమణచాలనే పట్టుదల పెరిగింది. ఒకసారి అమృత సర్ రోడ్డుమీద నగర వాసుల్ని ”డయ్యర్” బొర్లా పడుకుని పాకేటట్లు చేసాడు. అది చూసిన భగత్‌సింగ్ చలించిపోయాడు. హత్యలు జరిగిన స్థలాన్ని చూసొచ్చి ఆ ప్రాంతంలో గల రక్తసిక్తమైన మట్టిని సీసాలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. రోజు ఆ సీసా మీద గౌరవ భావంతో పువ్వుల్ని పెడుతుండేవాడు. వయసులో చిన్నవాడైనా ఆయన గుండె నిండా దేశభక్తి నిండుగా ఉండటం విశేషమే కదా! దేశం కోసం ఏదైనా తన వంతుగా మంచి పని, ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేదాన్ని చెయ్యాలని ఉవ్విళ్లూరుతుండేవాడు. ఇటువంటి పట్టుదల, దేశభక్తి భారతీయుల్లో ఎంతోమందికి ఆరోజుల్లో నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అందువల్లే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలి పోయింది.
ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. చింకిచొక్కాలైనా ధరిస్తుండేవాడు భగత్‌సింగ్. ఫణీంద్రదాస్‌తో ఆయన ”సామ్రాజ్యవాద పెట్టుబడి దారీ వ్యవస్థ యిక అంతిమ క్షణాలు లెక్క బెడుతోంది, నేను రేపు జీవించి వుండకపోయినప్పటికీ నా భావాలు కడ వరకూ సామ్రాజ్యవాద దోపిడీ దారులను వెంటాడుతూనే వుంటా” అనేవారు.
ఆయన ఎంతటి ధైర్యశాలో అంతటి సత్యవాది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అసెంబ్లీ మీద బాంబు వేసినప్పుడు తప్పించుకునే వీలూ, అవకాశం ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా అరెస్టు అవుతాడు, కోర్టును కూడా ఒక రాజకీయ ప్రచార వేదికగా తయారు చేసుకోదలిచి, అందుకే స్వచ్ఛందంగా లొంగిపోయి చరిత్రాత్మకమైన వాంగ్మూలున్ని కోర్టులో ఇవ్వడం విశేషం. ‘బటు కేశ్వర దత్తు’తో బాటు భగత్‌సింగ్‌ని అరెస్టు చేసినప్పుడు ఆయన కోర్టులో ఇచ్చిన వాగ్మూలం విస్మరించలేనిది. సమగ్రమైన వాగ్మూలంలో భగత్ సింగ్ `మా దృష్టిలో దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ దశలో దిక్కులు పిక్కటిల్లేలా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. మాకు తోచిన రీతిలో మేము ఏప్రిల్ 8వ తేదీన 1929న అసెంబ్లీలో రెండు బాంబులు విసిరాం అవి పేలవడం వల్ల అతి కొద్దిమందికి స్వల్పమైన గాయాలు తగిలాయి. ఛాంబర్లో గందర గోళం ఏర్పడింది. ప్రేక్షకులూ, సభ్యులూ అసెంబ్లీలోంచి బయటకు వచ్చారు. నలుగురైదుగురికి స్వల్పమైన గాయాలయ్యాయి. ఒక బెంచీ మాత్రం కాస్త దెబ్బతిన్నది. తప్పించుకునే సావకాశం ఉన్నప్పటికీనీ నేనూ నా సహచరుడు బటుకేశ్వర దత్తూ స్వచ్ఛందంగా లొంగిపోయాం! ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఎంతో అవసరమనిపించి మాత్రమే మేమీపని చేసాం’ అన్నాడు.
ఆయన స్నేహితులు కానీ, సహచరులు కానీ, సమకాలీనులు కానీ ఎవరూ భగత్‌సింగ్ గురించి మాట్లాడాల్సి వచ్చినా ముందుగా అతని విస్తృతమైన, లోత్తైన అధ్యయనాన్ని గురించి ప్రస్తావించనిదే మరేమాటా మాట్లాడుకపోవడం విశేషంగానే భావించాలి. చిరిగిపోయిన ఆయన కోటు జేబులో కూడా తప్పనిసరిగా ఒక పుస్తకం మాత్రం ఉండేది. విప్లవమంటే బాబులు, పిస్తోళ్లు కాదని భగత్ సింగ్ స్పష్టం చేసేవాడు ఎప్పుడు. 1931 మార్చి 23న సాయంకాలం సమయంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేశ్ – ముగుర్నీ నిర్దాక్షిణ్యంగా ఉరి తీసి హింసావాదాన్ని మరో పర్యాయం నిరూపించుకున్నది. చనిపోయే ముందు భగత్‌సింగ్ ఉరి కంబం ఎక్కడానికి కొద్దిగా ముందు అక్కడున్న ఇంగ్లీషు మేజిస్ట్రేట్‌ని చూసి ”సార్! మీరు నిజంగా అదృష్టవంతులు. ఒక భారతీయ విప్లవకారుడు తన మహత్తరమైన లక్ష్య సాధనకోసం నవ్వుతూ ఎలా ప్రాణాలర్పిస్తున్నాడో చూసే అవకాశం మీకు దక్కింది” అన్నాడు.
__విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)