22018లో పాత గుంటూరు పోలీసు స్టేషనుపై ముస్లిం యువత దాడి జరిపిన సంఘటన విదితమే. ఆ దాడిలో పాత్రులైన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, డిజిపి 17.02.20వ తేదీన సదరు కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. సదరు లేఖని ఆమోదిస్తూ ప్రభుత్వం 12.08.2020వ తేదీన జి.ఒ. ఆర్.టి 776 విడుదల చేస్తూ ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకొవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ అంశంపై తాజాగా Legal Rights Protection Forum హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటీషన్ వేసింది.
పిటీషనర్ తరఫున న్యాయవాదులు పి.ఎస్.పి. సురేష్ కుమార్ మరియు చాణక్యలు తమ వాదనలు వినిపిస్తూ సాక్షాత్తూ పోలీసు స్టేషన్ పై జరిగిన దాడిలోనే పోలీసులు ప్రసిక్యూషన్ ఉపసంహరించుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం అని, ఇటువంటి నేరాలు భవిష్యత్తులో పునరావృతం అయ్యేందుకు ఈ జి.ఒ. తావిస్తున్నదని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టును కోరారు. వాదనలు విన్న జస్టిస్ రాకేష్ కుమార్ మరియు జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ జి.ఒ లోని భాషను సైతం తప్పు పట్టింది. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో జి.ఒలో నేరుగా “ముస్లిం యువత” అని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఈ పిటీషన్లో ఎన్.ఐ.ఎ ని కూడా పార్టీగా చేర్చాలని పిటీషనర్ తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. తక్షణమే ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ, సదరు జి.ఒ ను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసి, కేసును అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేసింది.
_____విశ్వ సంవాద కేంద్రము