అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సెప్టెంబర్ 30న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్కే యాదవ్ ఈ తీర్పు వెలువరించనున్నారు. నిందితులంతా తీర్పు రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.
ఈ కేసులో భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్, వినయ్ ఖతియార్ సహా మొత్తం 32 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 1 నాటికి ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయని, ప్రత్యేక న్యాయమూర్తి తీర్పును సిద్ధం చేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఈ కేసులో 351 మంది సాక్షులను, కేసుకు సంబంధించి 600 పత్రాలను సీబీఐ.. కోర్టు ముందు ఉంచింది.
1992 డిసెంబర్ 6న కరసేవకులు అక్కడి వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును త్వరితగతిన విచారణ పూర్తిచేసి రెండేళ్లలో తీర్పు వెలువరించాలని 2017లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇన్నాళ్లూ తీర్పు వాయిదా పడుతూ వస్తోంది. సెప్టెంబర్ 30లోగా తీర్పు వెలువరించాలని ప్రత్యేక న్యాయస్థానానికి గడువు విధించిన నేపథ్యంలో గడువుకు చివరి రోజైన 30న తీర్పు వెలువడనుంది. కాగా, ఇటీవలే వాంగ్మూలం ఇచ్చిన అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు రాజకీయ కుట్రలో భాగంగా తమ పేర్లను ఈ కేసులో ఇరికించారని వివరణ ఇచ్చారు.
_విశ్వ సంవాద కేంద్రము