భారతదేశంలోని వివిధ పత్రికలు కమలా హారిస్ నామినేషన్ను భారతీయులు గర్వించవలసిన గొప్ప విషయంగా కీర్తిస్తూ కథనాలు వెలువరిస్తున్నాయి. ఆ విషయంలో దేశంలోని వామపక్ష మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. వామపక్ష మీడియా చైనా – భారత్ వివాదం నేపథ్యంలో ఏ విధంగా అయితే చైనా అనుకూల, భారత వ్యతిరేక వైఖరిని నిస్సుగ్గుగా అవలంబిస్తూ ఉందో అదే విధంగా భారత వ్యతిరేక వామపక్ష భావజాలం కలిగిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి నామినేట్ కావడాన్ని సహజంగానే కీర్తిస్తోంది.
గతంలో భారతదేశ వ్యవహారాలపై వివిధ సందర్భాలలో ఆమె చేసిన ప్రకటనలు చూస్తే భారత దేశం పట్ల ఆమె వైఖరి ఏమిటో మనకు అవగతమవుతుంది. గత సంవత్సరం హారిస్ డెమోక్రాటిక్ నామినేషన్ కోసం సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 వ అధికరణను భారత ప్రభుత్వం తొలగించడాన్ని తప్పు పట్టడమే కాకుండా బహిరంగ వేదికలపై ప్రశ్నించారు కూడా. ఆ సందర్భంలో ఆమె మాట్లాడుతూ “వారు (కాశ్మీరీలు) ఒంటరిగా లేరని, మేము అన్నింటినీ చూస్తున్నామని వారికి గుర్తుచేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా మేము ఆ పరిణామాలని గమనించటం లేదని అనుకుంటారేమో నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. మేం ఆ మొత్తం పరిణామాలను గమనిస్తూ ఉంటాం.” అని ఆమె భారత ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు కూడా. మళ్ళీ అక్టోబర్లో కూడా ఆమె భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న ధోరణిలోనే మాట్లాడారు.
జో బిడెన్, కమలా హారిస్ |
మానవ హక్కుల పేరుతో భారత్ ను నిందించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ ప్రమీలా జయపాల్, కమలా హారిస్ లు వదలుకోలేదు. అదే జమ్మూ కాశ్మీర్ లో పాక్ ప్రేరిత ఉగ్రవాదుల చేతుల్లో హతులైన లక్షలాది మంది హిందువుల బాధలు మాత్రం వీళ్ళకి ఏనాడూ పట్టలేదు. పాకిస్థాన్ లోని హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినప్పుడు వీళ్ళు ఏ ప్రకటనలూ చెయ్యలేదు. లడాఖ్ లోని భారత్ – చైనా సరిహద్దుల వద్ద చైనా దుర్మార్గంగా భారత సైనికులను పొట్టనపెట్టుకున్నప్పుడు కూడా వీళ్ళు చైనాను పల్లెత్తు మాటనలేదు. ఎందుకంటే వాళ్ళు వామపక్ష భావజాల ప్రేరితులు. కమ్యూనిస్టు చైనాకు వ్యతిరేకంగా వాళ్ళు సహజంగానే వ్యాఖ్యానించరు. అవసరమైన సమయంలో, అవసరమైన అంశంపై, అవసరమైన మేరకు వ్యూహాత్మకంగా స్పందించే అవకాశవాద బృందమది. వారికి భారతదేశం పట్ల ఏమాత్రం మమకారం లేదన్నది సుస్పష్టం.
ఎందుకంటే ప్రమీలా జయపాల్, కమలా హారిస్ లు ఇద్దరికీ భారత్ బాధితురాలిగా ఉన్న ఏ సందర్భంలోనూ తమ భారతీయ మూలాలు గుర్తుకురాలేదు. అసలు వారు భారతీయ సంతతి వారమన్న సంగతి ఏనాడో మరచిపోయారు. కానీ ఇప్పుడు ప్రమీలా జయపాల్ కి తన 35 సంవత్సరాల వయస్సు వరకూ తాను భారతీయ పౌరురాలిగానే ఉన్నానన్న విషయం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. కమలా హారిస్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన రోజునే కమలా హారిస్ సోదరి మాయా హారిస్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వారి తల్లి షర్మిలా హారిస్ కూడా ఉన్నారు. తమ తల్లి చెన్నై నగరం నుంచి యు. ఎస్ వెళ్ళి అక్కడ స్థిరపడినట్లుగా కమలా హారిస్ అందులో పేర్కొని ఉన్నారు. తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించటంతో తన తల్లి, సోదరి ఇప్పుడు సంతోషంగా ఉన్నారని కూడా కమలా హారిస్ అందులో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఆ వీడియో అనేకమంది భారతీయ అమెరికనుల ప్రశంసలందుకుంది. ఆమె రాజకీయ అవసరాలకు అనుగుణంగా భారత్ లోని వామపక్ష మీడియా కూడా ఆమెను భుజానికెత్తుకుంది.
ఆ విధంగా భారతీయ అమెరికనుల హృదయాలను హత్తుకునేలా రూపొందించబడిన ఆ వీడియో ఇప్పుడే ఎందుకు విడుదలైంది? అంటే దాని వెనుక ఒక బలమైన కారణముంది. నిజానికి డెమోక్రాట్లు కమలా హారిస్ ను తమ అభ్యర్ధిగా ప్రకటించడంలోనే గొప్ప రాజకీయ చతురత దాగివుంది. ఆమె తండ్రి జమైకాకు చెందినవాడు. తల్లి ఆసియాకు చెందినది. కనుక హారిస్ అభ్యర్ధిత్వం ద్వారా అటు ఆఫ్రికన్ ఓటర్లను, ఇటు ఏషియన్ ఓటర్లను ఉమ్మడిగా ఆకర్షించగలమన్నదే డెమొక్రాట్ల వ్యూహం. అమెరికా ఎన్నికలలో భారతీయుల ఓట్లే ప్రస్తుతం అత్యంత కీలకం. అవే గెలుపోటములను నిర్ణయించేది. అమెరికాలో భారతీయ మూలాలున్న ఓటర్లు షుమారు 10 మిలియన్ల మంది ఉన్నారు. అక్కడి ఓటింగ్ లో ఇది షుమారు 5 శాతం. చాలా గణనీయమైన, శక్తివంతమైన ఓట్ బ్యాంకది. ఆ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే కమలా హారిస్ లక్ష్యం. ఆమెను కేవలం భారతీయ మూలాలున్న వ్యక్తిగా గుర్తించి సంబరపడిపోతే అది పొరపాటే అవుతుంది. భారతదేశానికి ప్రయోజనాన్ని కలిగించే వివిధ అంశాలపై, దేశంలోని వివిధ సమస్యలపై, దేశానికి ఎదురవుతున్న వివిధ సవాళ్ళపై ఆమె దృక్పథాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన, పరిశీలించవలసిన అవసరముంది. దాన్ని అనుసరించే మనం నిర్ణయాలు తీసుకోవలసిన అవసరమూ ఉంది.
భారత్ పట్ల, భారత ప్రభుత్వం పట్ల, భారత్ లోని అంతర్గత సమస్యలు, శత్రువుల పట్ల అమెరికా పాలకుల యొక్క వైఖరి పైననే అమెరికా, భారత్ భవిష్యత్ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. కనుక భారత ప్రయోజనాలను, ప్రభుత్వ విధానాలను సమర్థించే నాయకత్వం ఉంటేనే అది భారత్ కు లాభిస్తుంది. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలను గ్రుడ్డిగా వ్యతిరేకిస్తూ భారత్ లోని వేర్పాటు వాద శక్తులకు మద్దతు ప్రకటించే కమలా హారిస్ వంటి వారి వల్ల భారత్ కు ఏమిటి ప్రయోజనం? అంతర్జాతీయ అంశాలలో భారత్ కు అండగా నిలవని కమలా హారిస్ లాంటి వారి వల్ల భారత్ కు తీరని నష్టం సంభవించే అవకాశముంది కదా? కనుక ఇలాంటి వారి పట్ల, వారికి మద్దతు ప్రకటించే వారి పట్ల భారతీయులందరూ ఒక కన్నేసి ఉంచి దేశ హితానికే పెద్ద పీట వేయాల్సిన అవసరముంది. తస్మాత్ జాగ్రత్త.
రచన – శ్రీరాంసాగర్. - విశ్వ సంవాద కేంద్రము