కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ 2020) అమలులో విద్యార్థులకు భారతీయ సంప్రదాయాన్ని మరింత చేరువ చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఇందుకోసం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలతో బోధన చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. దానితో పాటు ఆత్మ నిర్భర భారత్ మిషన్ కింద విద్యార్థులకు సంప్రదాయ బొమ్మల తయారీకి సంబంధించిన మెలకువలు కూడా నేర్పించనున్నట్లు మంత్రి తెలిపారు.
”2020 జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ప్రధాని మోడీ ఆకాంక్ష మేరకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలు, తోలుబొమ్మలను బోధనా సాధనాలుగా ఉపయోగిస్తాం. అలానే వాటి తయారీ మెలకువలు కూడా విద్యార్థులకు నేర్పిస్తాం. దీని ద్వారా జాతీయ లక్ష్యాలు, యువత సాధించిన విజయాలు ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ఉద్యమంలో స్ఫూర్తిని పెంచుతాయి” అని మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఈ ఏడాది జరిగే కళా ఉత్సవంలో బొమ్మల తయారీ ప్రధాన అంశంగా పరిచయం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలానే ఎన్ఈపీ అమలుకు సంబంధించి సలహాలు, సూచనలు అందివ్వాల్సిందిగా విద్యాశాఖ పలువురు ఉపాధ్యాయులు, విద్యావేత్తలను కోరింది.
__విశ్వ సంవాద కేంద్రము