ఆశ్రమ ధర్మములు
ఆశ్రమము :
కావాలని మనస్ఫూర్తిగా ఒక దిశవైపు పెట్టే శ్రమ, ఆధ్యాత్మిక సాధనవైపు పెట్టే శ్రమను ఆశ్రమము అందురు.ఆశ్రమ ధర్మములు :
1. బ్రహ్మ చర్యము : సద్గురు సేవ, భిక్షాటన, స్త్రీ సంపర్కము లేకుండుట మొదలగునవి2. గృహస్థాశ్రమము : యజన యాజన, అధ్యయన అధ్యాపన, దాన ప్రతి గ్రహములు అనెడి ఆరు ధర్మములు.
3. వాన ప్రస్థము : శరీర దండనము, ఉపవాసము, మౌనము మొదలగునవి.
4. సన్న్యాసాశ్రమము :
- 1. సర్వ సంపదలు ఉన్నవాడైనను, వాటిని త్యజించి, తీవ్ర వైరాగ్యము కలిగి, ప్రాపంచిక భోగముల యెడ విరక్తుడై, మోక్షాభిలాషచే ప్రేరేపింప బడినవాడు. ఇతడు స్వభావ సన్న్యాసి.
- 2. తినుటకు లేకనో, కుటుంబమును పోషించలేకనో, కలహము పెట్టుకొనియో సన్న్యసించువాడు ఆభావసన్న్యాసి.
- 3. దేహ సంబంధ వాసనలు విడచి, దేహి సంబంధ వాసనలను కూడా విడచినవాడు. అనాదినుండి వచ్చి దృఢపడి వచ్చుచున్న ఘనరూపమైన జన్మార్జిత వాసనలను సమూలముగా నశింపజేసికొని, ఆది కారణమైన మూలావిద్యను కూడా విచ్ఛిన్నము చేసుకొన్నవాడు, తీవ్ర సాధన, అనుష్ఠానము చేసినవాడు ఉత్తమ సన్న్యాసి. ఉత్తమ సన్న్యాసి అనగా ముక్తుడే. కేవల ఆశ్రమ ధర్మాచరణకు ఫలము పుణ్యము.
ఆశ్రమ సాధనలు :
బ్రహ్మచర్యము :
ఈ వ్రతమును నియమ నిష్ఠలతో నడపడము, గురువును ఆశ్రయించడము, అధ్యయనము గావించుట, అగ్ని కార్యము నడపుట, గురువు యొక్క అవసరమును బట్టి సంచారము చేయుట, భిక్షమెత్తుట వంటి విధులను నిర్వర్తించవలెను.
- వేదాధ్యయనము, గురుసేవ చేయుచు, కాలక్షేప మాటలు మానుట, భిక్ష గ్రహించుచు బ్రతుకుట, రాగద్వేషములు లేకుండుట, ఉత్తమ కర్మలు చేయుట, ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండుట.
- బ్రహ్మచర్య సమయములో గురుసన్నిధిలో శుశ్రూషలు చేయుచూ దాసునివలె ఉండవలెను. గురువు సంతుష్ఠి అయ్యేలా ప్రవర్తించవలెను. గురువు భుజించిన తర్వాతనే భుజించవలెను. గురువు నిద్రించిన తర్వాతనే నిద్రించవలెను. గురువుకంటే ముందే మేల్కొనవలెను. రుచి, వాసనల వంటి విషయములపైకి మనస్సును పోనీయరాదు. గురువు నిర్ణయించిన వేళలోనే వేదాధ్యయనము చేయవలెను.
- స్త్రీ గురించి మనసుతో స్మరించుట, స్త్రీ విషయమై ఆసక్తితో సంభాషించుట, విషయోద్దేశముతో స్త్రీని స్పృశించుట. ఈ మూడూ ఉండకూడదు.
చతుష్పాద బ్రహ్మచర్యము :
- 1. ఆచార్య వచనమునందు శ్రద్ధ, అనన్య భావన, శుచి, విద్యాగ్రహణము
- 2. గురువు, గురుపత్ని, గురుపుత్రుడు - వీరియందు పవిత్ర భావన, శ్రద్ధ, శుశ్రూష.
- 3. ఆచార్యులు చేసిన ఆత్మలాభ, ఉపకారమునకు కృతజ్ఞత భావము, సంతుష్ట హృదయము.
- 4. ప్రాణవిత్తములచేత ఆచార్యునికి ప్రియము చేకూర్చుట, సర్వవిధ శుశ్రూషలు.
- 1. స్థూల బ్రహ్మచర్యము : వ్యాయామ ఆసనాదులచేత శరీర శుద్ధి చేసుకొనుట
- 2. సూక్ష్మ బ్రహ్మ చర్యము : మనో నిర్మలతను సాధించుకొనుట
- 3. కారణ బ్రహ్మచర్యము : ఆత్మ శుద్ధికి ప్రయత్నము, మూలావిద్య అనెడి మూల కారణమును నశింపజేసుకొనుట.
- 4. సాత్విక బ్రహ్మచర్యము : సాత్వికాహారము భుజించుచు, ఉపవాస వ్రతమునాచరించుచు, భక్తి భావనను పెంపొందించుకొనుట.
- 5. స్వాత్మ బ్రహ్మచర్యము : స్వాత్మయందు బ్రహ్మభావనను కుదిరించుకొనుట.
- 6. నైష్ఠిక బ్రహ్మచర్యము : మనోవాక్కాయములచేత ఏ కాలమందును, విషయములందు ప్రవర్తించక బ్రహ్మమునందు సదా నిష్ఠ కలిగి యుండుట.
- పైన చెప్పబడిన దోషములను విసర్జించుట. విషయములను స్మరించుట, కీర్తించుట, యత్నించుట, ప్రవర్తించుట, క్రీడించుట అను వాటిని జననము నుండి మరణము వరకు దోషములుగా గుర్తించి, నిర్దోషముగా నుండుట.
- గార్హపత్య బ్రహ్మచర్యము : ఋతుకాలములో మాత్రము స్వపత్నితో ధర్మముగా ప్రవర్తించుచూ, మిగిలిన కాలమునంతా బ్రహ్మచర్య వ్రతమును పాటించుట.
- విధుర బ్రహ్మచర్యము : భార్య మరణించినను, ఉండినా గాని, విరక్తుడై ఆచరించే బ్రహ్మచర్యము.
- కాయక బ్రహ్మచర్యము : శరీర సంబంధమును విడచినట్టిది.
- వాచిక బ్రహ్మచర్యము : వాక్కులందు విషయలంపటము లేకుండుట.
- మానసిక బ్రహ్మచర్యము : విషయ సంకల్పము లేకుండుట.
- బ్రహ్మచర్య మహిమ : పూర్ణ యశస్సు, బ్రహ్మ తేజస్సు, బలము, వీర్యము, అపార ప్రజ్ఞ, శ్రీ, మహత్తైన యశస్సు, గొప్ప పుణ్యము, భగవత్ప్రీతి లభించును.
గృహస్థాశ్రమము :
శౌచమును పాటించుట, స్వపత్నిని సంతృప్తిపరచుట, పంచ మహాయజ్ఞములను నిర్వర్తించుట, వేదశాస్త్రములపై అభిరుచి కలిగి యుండుట, దానములు, హోమములు నిర్వర్తించుట, దయాపరుడై యుండి, అతిథి అభ్యాగతులను ఆదరించుట. స్వభార్యయందు మాత్రమే అనురక్తి కలిగియుండుట. ఓర్పు, సజ్జన సాంగత్యము, సత్యము, పితృకార్యములను నియమ పూర్వకముగా చేయుట, నాల్గు ఆశ్రమ వాసులకు శక్త్యానుసారము సహాయమునందించుట.గురువు గార్కి తన శక్తికి తగిన గురుదక్షిణ సమర్పించి, ఆయన ఆజ్ఞకు లోబడి సమావర్తన క్రియ జరిపి, వివాహము చేసుకొని, యజ్ఞ యాగాది కార్యములను, అగ్ని కార్యములను చేయుచు అతిథులను, బంధువులను ఆదరించుచు, నిత్య సత్య వ్రతమును ఆచరించుట. స్వభార్యయందు పుత్రులను పొంది, వారిని యోగ్యులుగా తీర్చిదిద్దవలెను.
గృహస్థుల ప్రవృత్తి ధర్మము :
అతికాంక్ష లేక, సముచిత వృత్తి కలిగి, కాలమునకు తగినట్లుగా నిత్యమూ ధర్మప్రధాన భావముతో అర్థకామములను తీర్చుకొనుటయే ప్రవృత్తి ధర్మము.గృహస్థుల నివృత్తి మార్గము :
దాంతి కలిగి, భూత కోటిపై దయ కలిగి, సత్య దృష్టిని, వైరాగ్యమును దృఢవ్రతముగా బూని, ఇంద్రియములను శాంతపరచి, యోగనిష్ఠుడై యుండుట నివృత్తి మార్గము. దీని లక్ష్యము మోక్షము.పంచగతులు :
- 1. తపస్సు చేత, యజ్ఞముల చేత దేవతలను ప్రసన్నము చేసుకొనుట.
- 2. తపస్సు చేత వైరాగ్య స్వభావమును పొందుట.
- 3. వైరాగ్యము చేత ప్రకృతిని జయించుట.
- 4. సన్న్యాసము చేత బ్రహ్మకర్మమును పొందుట.
- 5. జ్ఞానముచేత కైవల్యమును పొందుట.
వాన ప్రస్థము :
భార్యతో కలిసి గాని, ఒంటరిగా గాని అడవులకు వెళ్ళి మానాభిమానములు వదలి, ఇంద్రియములను కట్టడిచేసి, జటధారియై, తాపసులు చదువుకునే శాస్త్రములను పఠించుట, వారితో సద్గోష్టి జరుపుట. అడవిలో దొరికే కందమూలములు, దుంపలు, ఆకులు, పళ్ళు, కాయలు మాత్రమే, లభించిన వరకు సేకరించి భుజించుట. బ్రహ్మచర్యమును పాటించుట.జింక చర్మమును వస్త్రముగా ధరించుట. అతిధి పూజ గావించి, వారు భుజించగా మిగిలిన దానిని గ్రహించుచు తపస్సు చేసుకొనుట. భార్యతో కూడా అడవులకు వెళ్ళినవారు పై చెప్పబడినవి ఆచరించుచు ఒకరికొకరు సహాయము చేసుకొనుట. విషయములను త్రికరణ శుద్ధిగా వదలియుండుట. ఉపవాసము మొదలగు సాధనల ద్వారా శరీరమును క్షీణింపచేసికొనుచూ శరీర విసర్జన లక్ష్యముతో జీవించుచుండుట.సన్న్యాశ్రమము :
ఎక్కడో తలదాచుకొనుచు, ఆకలికి ఏదో ఒకటి తినుచు, ఎక్కడ రాత్రి అయితే అక్కడే పరుండుట. అగ్ని హోత్రమును మానివేయుట, దేనినీ కోరకుండుట, పరిగ్రహించకుండుట. ఇంద్రియములను పూర్తిగా అదుపులో పెట్టుకొని, భోగాసక్తి వీడి, మెప్పు, గౌరవము ఆశించక బ్రతికి యుండియూ చచ్చినవానివలె ఉండుట. కోపము లేకుండుట, ఎవరితోనూ సాంగత్యము లేకుండుట, ఓర్పుగా, లేమితో ఉండుట. ఆర్జవము కలిగి యుండుట. శుచిగా నుండుట. శాంతాత్ముడైన పిమ్మట సన్న్యాసము స్వీకరించ వలెను. సన్న్యాసము బలవంతముగా గాని, తొందరపాటుతో గాని సమాజము కుటుంబముపై అలిగి గాని తీసుకొనకూడదు. విరక్తి వైరాగ్యములు కలిగిన తరువాతనే తీసుకొనవలెను.ఆత్మలోనే అగ్నిని ఆరోపించుకొని యజ్ఞము చేయవలెను. మిత్రత్వ శత్రుత్వములకు దూరముగా ఉండవలెను. తలబోడి చేసుకొనవలెను. స్థిర నివాసము కూడదు. చెట్టు మొదలే నివాసము. కపాలము చేతబూని భిక్ష ఎత్తుకొనవలెను. ఏకాకిగా ఉండవలెను. అరిషడ్వర్గము, సుఖదుఃఖములు ఉండకూడదు. నిందా స్తుతులను పట్టించుకొనకూడదు. ఎవరితోనూ మాట్లాడరాదు. అంతటా తానే ఉన్నట్లుగా భావించవలెను. ఏది దొరికితే అదే తినవలెను. ఏదో ఒకటి ఒంటికి కట్టుకొనవలెను. జనసమూహములకు దూరముగా పోవలెను. వారిని పామును చూచినట్లుగా చూచి ప్రక్కకు తొలగిపోవలెను. స్త్రీ తనను చూచిన ఒక శవమును చూచినట్లు చూడవలెను.
తన వలన ఏ ప్రాణికీ భయం కలుగకూడదు. దేనివలనను తాను భయపడకూడదు. అహింసా ధర్మమును పాటించవలెను. దేనినీ అంటక ఆకాశము వలె ఉండవలెను. అట్టివాడు అమృత హృదయుడై సర్వశరణ్యుడగును.
మధుకర వృత్తి :
మధుపము ఏ పుష్పమును బాధించకయే మధువును ఎట్లు గ్రోలునో, అట్లే సన్న్యాసి గృహస్థులకు ఎలాంటి కష్టము కలుగకుండా, భిక్షను గైకొను పద్ధతిగా చేయు వృత్తిని మధుకర వృత్తి అందురు. వంటలు పూర్తికాకముందు పోరాదు. భక్తితో నొసంగిన భిక్షను కొంచెమైనను, దానితో సంతుష్టి పొందవలెను. భిక్ష ఈయజాలని వారివద్దకు వెళ్ళరాదు. భిక్ష ఈయని వారిని దూషించరాదు, ద్వేషించరాదు. పవిత్ర హృదయముతో మౌనియై యుండవలెను.నిజమైన సన్న్యాసము :
అహంకారము అనే పుత్రుడిని, అభిమానము అనే ధనమును, భ్రమ అనే అన్నదమ్ములను, మోహము అనే గృహమును, ఆశ అనే భార్యను ఏ నిర్బంధము లేని ఇష్టప్రకారము వదలుట.- కుటీచక సన్న్యాసము : శిఖ, యజ్ఞోపవీతములు వీడి, గంత, గుడ్డ ధరించి, కుటీరమందుండి భిక్షాన్నమును భుజించుచూ, మంత్రమును జపించువాడు.
- బహూదక సన్న్యాసము : పై వలెనే ఉండి, ఎనిమిది కబళముల భిక్షాన్నము మాత్రము భుజించుచూ, కుటీరమందుండక ఊళ్ళు తిరుగువాడు.
- హంస సన్న్యాసము : జడలు ధరించి, ఇంతని గాక, దొరికినంత భుజించు వాడు, కౌపీనధారి.
శరీరమంతా విభూతి పూసుకొని, ఐదు ఇళ్ళనుండి మాత్రము భిక్షను స్వీకరించువాడు. దీనిని తురీయ సన్న్యాసము అని కూడా అందురు.
తురీయాతీత సన్న్యాసము :
గోవువలె నోటితో భుజించువాడు. మూడు ఇళ్ళ నుండి మాత్రమే భిక్షమెత్తువాడు. దిగంబరియై, శరీర వృత్తి రహితుడై యుండువాడు.
అవధూత సన్న్యాసము :
ఏ నియమము లేనివాడు. అజగర (కొండ చిలువ) వృత్తి అనగా దగ్గరకు వచ్చిన అన్నమునే గ్రహించి భుజించువాడు, భిక్షమెత్తని వాడు. లేనిచో పస్తులుండువాడు.
పరమహంస పరివ్రాజకులు :
సంవర్తక, ఆరుణి, శ్వేతకేతు, దుర్వాస, ఋభు, నిదాఘ, జడభరత, రైవత, దత్తాత్రేయ మొదలగువారు.
పరమహంస యొక్క విశేష దృష్టి :
ఒకే పరమాత్మ విభిన్న ఉపాధులలో విభిన్నమైన రూపనామ గుణాదులతో విభిన్న జీవాత్మలవలె ప్రతిబింబించు చున్నాడు; అయినా సర్వ దేహాదులలో అఖండము, అవిభాజ్యము, అప్రమేయము, అవ్యయము అయిన ఒకే ఆత్మ ప్రకాశించుచు ఉన్నది. నేనే అనేక దేహములలో అనేక రీతులుగా దర్శనమగుచున్నాను. నా విభూతి నాకు వినోదమగుచున్నది అనే విశేష దృష్టియే పరమహంసయొక్క విశేష దృష్టి.
యతీశ్వరుల భాగ్యము :
- 1). ప్రతిబంధకము లేని భిక్షాన్నము
- (2). అనుకూల మఠ నివాసము
- (3). సత్పురుషుల సహవాసము
- (4). దృశ్య విషయములందు విరక్తి
- (5). మహా వాక్యార్థ మననము
- (6). వేదాంత వాక్య శ్రవణము
- (7). పరమాత్మ జ్ఞానము.
నిత్యసన్న్యాసి :
ఈ దృశ్యము ఇలా ఉన్నదెందుకు? అనబడే ద్వేషము గాని, ఇది ఇలాగే ఉండాలి అనే ఆకాంక్ష గాని, ఎప్పుడైతే ఏ మాత్రమూ ఎవడికి ఉండదో వాడే నిత్య సన్న్యాసి.
వివిదిషా సన్న్యాసము :
తత్త్వ జ్ఞానమును సంపాదించు ఇచ్ఛతో చేయబడు సన్న్యాసము. జిజ్ఞాసులు తత్త్వ జ్ఞానమును ప్రధానముగాను, మనోనాశ్, వాసనా క్షయములను రెండవ ప్రధానముగాను చేసే అభ్యాసము. ఇది విదేహముక్తికి ప్రథమ సాధనము.
విద్వత్సన్న్యాసము :
తత్త్వ జ్ఞానము కలిగిన తరువాత చేయబడు సన్న్యాసము. జ్ఞానులు వాసనాక్షయము, మనోనాశనముల సంబంధించిన సాధనలను ప్రధానముగాను, తత్త్వజ్ఞాన సముపార్జనను రెండవ ప్రధానముగాను చేసే సాధన. ఇది జీవన్ముక్తికి ప్రథమ సోపానము.
యతి పంచకము :
1. సమర్పణ 2. శరణాగతి 3. వినయము 4. వైరాగ్యము 5. ఆత్మనిష్ఠ. ఈ అయిదూ ఉన్నవాడే యతి.
యతీశ్వరుల కర్తవ్యము :
భిక్షాన్నము, ప్రణవాది మంత్ర జపము, స్నానము, బహిరంతర శౌచము, దేవతార్చన, ఆధ్యాత్మ జ్ఞానము.
యతులు ఎవరు ? :
ఆత్మ జ్ఞానము కొఱకు యత్నించువారు. ప్రకృతి విలక్షణమగు ఆత్మను గూర్చి నిరంతరము చింతించువారు.
అవధూత :
భాగవత శ్రేష్ఠులు, వేదవర్ణార్థములను ఎరిగినవారు. వేద వేదాంతములను బోధించువారు. (అ:వ:ధూ:త)
- అ : ఆశాపాశములనుండి విడుదలైనవారు. త్రికరణ శుద్ధులు. సదా బ్రహ్మానంద భరితులు.
- వ : వాసనా త్రయమునుండి విడువబడినవారు. దుఃఖవర్జితులు. సదా నిస్సంకల్పులు. వర్తమాన భోగములయెడ ఔదాసీనులు.
- ధూ : దుమ్ము ధూళిగా నున్న శరీరేంద్రియములుండి, వాటి ఎరుక లేనివారు. ఆత్మ జ్ఞానమగ్నులు. ధ్యానాదులను అతిక్రమించి, ధ్యేయాకారులై యున్నవారు.
- త : సర్వదా తత్త్వ చింతనాపరులు, అజ్ఞాన అహంకారాదులు నశించి యున్నవారు.
కాలత్రయ జ్ఞానము కలవారు. ఆకాశ గమనము మొదలైన చమత్కారములు జరుపువారు. అష్టసిద్ధులు కలవారు. ఈ సిద్ధులను వినియోగించుటకు ఆసక్తి కలవారు. తత్త్వజ్ఞానము దృఢముగా లేనివారు.
2. కేవల పరమహంస పరివ్రాజకులు :
బ్రహ్మ తత్త్వమును విచారించి తెలుసుకున్నవారు. సిద్ధులు, చమత్కారములు ఉండవచ్చు, లేకపోవచ్చు. ఉన్నప్పటికిని వినియోగించుటయందు విరక్తులు, అనాసక్తులు, బ్రహ్మ జ్ఞానాతిశయము వలన ఎప్పుడైనా విధి నిషేధములను ఉల్లంఘించెదరు.
3. యోగులైన పరమహంస పరివ్రాజకులు :
1. కేవల యోగులందున్న దోషములు. 2. కేవల పరమహంస పరివ్రాజకులందున్న దోషములు లేనివారు. ఇట్టి నిర్దోషులు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు. ఏ పురుషుడు అజ్ఞానమునే కాక జ్ఞానమును కూడా విడచి కేవల స్వరూపముగా ప్రకాశించునో అతడే సాక్షాత్ పరబ్రహ్మ. బ్రహ్మవేత్తలందరూ సాక్షాత్ పరబ్రహ్మ కారు. బ్రహ్మవేత్తలు జ్ఞానమును విడచి ఉండరు. యోగియైన పరమహంస పరివ్రాజకుడిని నిత్య పూతస్థుడు అందురు. నిత్య పూతమనగా పరబ్రహ్మమే, పరబ్రహ్మ స్వరూపుడని అర్ధ్థము.
అద్వైత ఆశ్రమములు : దృష్టి భేదమును బట్టి మూడు విధములు.
- 1. హీన దృష్ట్యాశ్రమము : అహంకారము, మమకారము అను తేడాలు లేవని అంతా బ్రహ్మస్వరూపమేనని శ్రవణము మాత్రము చేసినది.
- 2. మధ్య దృష్ట్యాశ్రమము : అభేదమును మననము కూడా చేసినది.
- 3. ఉత్తమ దృష్ట్యాశ్రమము : అభేద రూప బ్రహ్మము బుద్ధిలో ధృడమై తదనుగుణముగా జీవింపజేయునది.
ఉత్తమ దృష్ట్యాశ్రమము తరువాత ఇక చలించక, స్థిరమై యుండుట. నిదిధ్యాస వ్యవసాయాత్మక బుద్ధిని అందుకున్నప్పుడు కలిగేది ఆశ్రమ నిష్ఠ. పై మూడు దృష్టులు లేనిది.
పరమహంసలు :
ఆనందాత్మను నేను అనే జ్ఞానము గలవారు పరమ హంసలు. ప్రాచీనులలో సంవర్తకుడు, అరుణి, శ్వేతకేతు, దుర్వాసుడు, ఋభువు, నిదాఘుడు, దత్తాత్రేయులు, రైవకుడు మొదలగువారు పరమ హంసలు. ఇప్పుడు మనకు తెలిసినవారిలో రామకృష్ణ పరమహంస ఒకరు. యతీశ్వరులను పరమ హంసగా పిలిచెదరు. పరమ హంసకు భిక్ష మొదలైనవాటిలో విధిగాని, నియమముగాని ఉండదు.సంకలనం: చల్లపల్లి