యుగ ధర్మములు:
కాలము:
- ☀ రెప్పపాటు కాలము = 1 నిమేషము,
- ☀ 8 నిమేషములు = 1 కాష్ట,
- ☀ 13 కాష్టలు = 1 కల (కళ),
- ☀ 30 కలలు = 1 క్షణము,
- ☀ 12 క్షణములు = 1 పగలు + 1 రాత్రి,
- ☀ 30 ముహూర్తములు = 1 పగలు + 1 రాత్రి,
- ☀ 1 పగలు + 1 రాత్రి = 1 దినము,
- ☀ 15 దినములు = 1 పక్షము,
- ☀ 2 పక్షములు = 1 మాసము,
- ☀ 2 మాసములు = 1 ఋతువు,
- ☀ 6 ఋతువులు = 1 సంవత్సరము,
- ☀ 3 ఋతువులు = 1 అయనము,
- ☀ 6 ఋతువులు = 1 ఉత్తరాయణము + 1 దక్షిణాయనము,
- ☀ మానవుల 1 నెల = పితృ దేవతలకు 1 దినం,
- ☀ మానవుల 1 సంవత్సరము = దేవతలకు 1 దినం,
- ☀ 1 దేవతల సంవత్సరము = 360 మానవ సంవత్సరములు,
యుగ సంధికాలము:
- ☀ కృతయుగములో 400 దేవత సంవత్సరములు
- ☀ త్రేతాయుగములో 300 దేవత సంవత్సరములు
- ☀ ద్వాపరయుగములో 200 దేవత సంవత్సరములు
- ☀ కలియుగములో 100 దేవతల సంవత్సరములు
దశవిధ ప్రళయములు:
- ☀ 21600 జీవహంసల అజపము X 2 యవలు = 43,200
- ☀ కలియుగము = 43,200 X 10 = 4,32,000 సంవత్సరములు.
- ☀ ద్వాపరయుగము = 2 X 4,32,000 = 8,64,000 సంవత్సరములు
- ☀ త్రేతాయుగము = 3 X 4,32,000 = 12,96,000 సంవత్సరములు
- ☀ కృతయుగము = 4 X 4,32,000 = 17,28,000 సంవత్సరములు
- ☀ ఒక మహాయుగము = పై నాల్గు యుగముల కాలము = 43,20,000 సంవత్సరములు
- ☀ 71 మహా యుగములు = 1 మన్వంతరము
- ☀ 14 మన్వంతరములు = బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మకు 1 పగటి కాలము, అంతే రాత్రికాలము = బ్రహ్మకు 1 దినము. అట్టి 365 దినములు = బ్రహ్మకు 1 సంవత్సరము. బ్రహ్మ ఆయుష్కాలము = అట్టి 100 సంవత్సరములు = బ్రహ్మ ప్రళయము.
- ☀ 1 బ్రహ్మ ప్రళయము = విష్ణువుకు ఒక మాసము.
- ☀ విష్ణువు యొక్క 1 మాసము X 12 X 100 సంవత్సరములు = 1 విష్ణు ప్రళయము.
- ☀ 1 విష్ణు ప్రళయము = నీలకంఠునికి 1వరోజు.
- ☀ నీలకంఠుని 1రోజు X 365 X 100 = నీలకంఠ ప్రళయము.
- ☀ 1 నీలకంఠ ప్రళయము = రుద్రమూర్తికి 1 రోజు
- ☀ రుద్రమూర్తి 1 రోజు X 365 X 100 = 1 రుద్ర ప్రళయము = మహేశ్వరునికి 1 యామము.
- ☀ మహేశ్వరుని 1 యామము X 8 X 365 X 100 = మహేశ్వర ప్రళయము. (8 యామములు = 1 రోజు)
- ☀ 1 మహేశ్వర ప్రళయము = సదా శివునికి 1 ముహూర్తము
- ☀ సదాశివుని 1 ముహూర్తము X 30 X 365 X 100 = 1 సదాశివుని ప్రళయము. (30 ముహూర్తములు = 1 రోజు)
- ☀ 1 సదా శివుని ప్రళయము = విరాట్ పురుషునికి 1 క్షణము.
- ☀ విరాట్ పురుషుని 1 క్షణము X 360 X 365 X 100 = 1 విరాట్ పురుషుని ప్రళయము.(360 క్షణాలు = 1రోజు)
వీరందరూ, అంతవరకు చిదచిద్రూపిణీ, పంచదశీ మహా త్రిపుర సుందరీ అయిన త్రిగుణాత్మికయగు బ్రాహ్మణీయందు లయించి యుండును. కనుక ముక్తియనగా దశవిధ ప్రళయానంతరము కూడా పునరావృత్తి లేకుండుట. దీనినే పరమపదమని, అచల పరిపూర్ణమని అందురు.
అనంత కాలము:
బ్రహ్మకు 1 రోజు = 864 కోట్ల సంవత్సరములు.బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరములు తీరిన వెంటనే రోమశ మహర్షికి 1 రోమము రాలును. ఆ మహర్షి యొక్క 33 కోట్ల రోమములు రాలిపోయే సరికి 33 కోట్ల బ్రహ్మలు పుట్టి చచ్చెదరు. అప్పటికి రోమశ మహర్షి చచ్చును. అప్పుడు అష్టావక్రునికి 1 వంకర సరియగును. ఆషావక్రుని 8 వంకరలు సరియగు సరికి 8 మంది రోమశ మహర్షులు పుట్టి చచ్చెదరు. ఈ విధముగా కాలమును లెక్కించుట ఎవరితరము కాదు. ఇది అనంత కాలము.
మన్వంతరములు:
- 1. స్వాయంభువు
- 2. స్వారోచిష
- 3. ఉత్తమ
- 4. తామస
- 5. రైవత
- 6. చాక్షుష
- 7. వైవస్వత
- 8. సావర్ణి
- 9. దక్షసావర్ణి
- 10. బ్రహ్మసావర్ణి
- 11. ధర్మసావర్ణి
- 12. భద్రసావర్ణి
- 13. వేదసావర్ణి
- 14. ఇంద్రసావర్ణి
కల్పములు:
1.శ్వేతవరాహ, 2. నీలలోహిత, 3. వామదేవ, 4. రాధాంతర, 5. రౌరవ, 6. దేవ, 7. బ్రహ్మ, 8. కందర్ప, 9. సద్యస్, 10. ఈశాన, 11. తమస్, 12. సారస్వత, 13. ఉదాస, 14. గారుడ, 15. కార్మ, 16. నారసింహ, 17. సమాన, 18. ఆగ్నేయ, 19. సోమ, 20. మానవ, 21. తత్పురుష, 22 వైకుంఠ, 23. లక్ష్మీ, 24. సావిత్రి, 25. ఘోర, 26. వరాహ, 27. వైరాజస, 28. గౌరి, 29. మహేశ్వర, 30. పితృ అనెడి 30 కల్పములు.పంచ ప్రలయములు:
- 1. నిత్య ప్రలయము,
- 2. నైమిత్తిక ప్రలయము (అవాంతర ప్రలయము),
- 3. దైనందిన ప్రలయము,
- 4. బ్రహ్మప్రలయము,
- 5. మహా ప్రలయము,
కాల మహిమ:
- ☀ మంత్రము, ఔషధము ఫలించుటకు పట్టే సమయము కాలానికి లోబడి ఉండును.
- ☀ పద్మములు, కలువలు దివారాత్రముల ననుసరించి వికసించును.
- ☀ చెట్లు, చేమలు పుష్పించి ఫలించుటకు పట్టే సమయము కాలమహిమ.
- ☀ పక్షులు, జంతువులు, ఎదకు రావడము కాల మహిమ.
- ☀ విత్తనము అంకురించుట, మొక్కలు పెరుగుట కాల మహిమ.
- ☀ బాలింతకు పాలు పడుట, పోవుటలు కాల మహిమ.
మాయ యొక్క పంచ కంచుకములైన:
- 1. కాలము
- 2. కళ
- 3. నియతి
- 4. విద్య
- 5. రాగములలో కాలము యొక్క పాత్ర అనివార్యము.
యుగమును బట్టి మారే ధర్మములు
కృత యుగము:
చేయదగినదేదో అది కర్తవ్యముగా భావించబడును. దానికి భిన్నముగా మరో ఆలోచనగాని, పద్ధతి గాని ఉండదు. ధర్మము నాలుగు పాదములుగా నడచును. విష్ణువు తెల్లని వర్ణములో ప్రకాశించుచు లోకపాలన గావించును. సనాతన ధర్మమే కృతయుగ ధర్మము. చతుర్వర్ణముల వారు ఒకే వేద కర్మను అనుసరించుదురు. ఫలితమును ఆశించే కోరికలే ఉండవు. అందరూ ముక్తులై పుణ్యలోకములు పొందుదురు. అసూయ, అభిచారము, గర్వము, కార్పణ్యము, విరోధము, క్రోధము, మదము, మత్సరము, భయము, దిగులు, వ్యాధి ఉండవు. జనక్షయమయ్యే ఉపద్రవములు ఉండవు.త్రేతాయుగము:
ధర్మము నాలుగింట మూడు పాదములుగా నడచును. ప్రజలు సత్వగుణమును ఆశ్రయించి ఉందురు. యజ్ఞములు, తపస్సు, దానము, వీటిని ఆచరించెదరు. విష్ణువు రక్తవర్ణుడై ప్రజాపాలన గావించును.ద్వాపర యుగము:
ధర్మము నాలుగింట రెండు పాదములుగా నడచును. వేదములు నాలుగు విధములై వర్తించును. ఆ వేదములను అనుసరించి ధర్మకామములు వర్తించును. జనులలో సత్యము, శమము తగ్గిపోవును. కోరికల దృష్టితో యజ్ఞయాగములు చేయుదురు. విష్ణువు నల్లవర్ణుడై జగత్తును పాలించును.కలియుగము:
ధర్మము ఏకపాదముగా నడచును. విష్ణువు పసుపు వర్ణుడై ప్రజాపాలన గావించును. ప్రజలు తమోగుణముతో నిండియుందురు. కామక్రోధాది దోషముల వలన ధర్మాధర్మ విచక్షణను కోల్పోవుదురు. అయితే తపస్సు, దానము మొదలగు సత్కర్మలు అల్ప ప్రమాణములో చేసినను అధిక ఫలితములనిచ్చును.మానవుల పతనము
ప్రథమ కల్పములో మానవులు అత్యంత నిర్మలత్వము, ధర్మతంత్రత కలిగి యుండిరి. వారు మహాసత్వ సంపన్నులు. సత్యముగా సంకల్పించేవారు. బ్రహ్మభూతాత్ములై స్వచ్ఛంద జీవులుగా జీవించుచు దేవతా వాహనములమీద సంచరించుచు ఉండేవారు. ఎలాంటి శ్రమ లేకుండా అధిక ఫలసిద్ధిని పొందేవారు.కాలాంతరములో రాను రాను, వారిలో కామక్రోధాది గుణములు ప్రవేశించెను. వారి బ్రతుకంతా మాయ, మోసములతో నిండిపోయెను. దానితో దేవతలు వారిని వదలివేసిరి. వారు అల్పాయుష్కులై, బలవీర్యములు తగ్గినవారై, వ్యాధి బాధలకు గురియగుచుండిరి. దరిద్రులైరి. ప్రయత్నమునకు తగిన ఫలితమును పొందుటలేదు. స్వార్థపరులై, పాపాత్ములై, నాస్తికులై తిర్యగ్యోనులలో జన్మించుచు నరకాగ్నిలో కాలిపోవుచూ చచ్చుచూ, పుట్టుచూ జనన మరణ చక్రములో చిక్కుకొని పోయిరి. మానవులు కాల ప్రభావమున పతనము కాసాగిరి.
యుగాచార్యులు :
- 1. కృతయుగములో కపిలాచార్యులు సత్పురుషులకు జ్ఞానము నందించిరి.
- 2. త్రేతాయుగములో దత్తాత్రేయాచార్యులు వేదాంత తత్త్వజ్ఞానమును బోధించిరి.
- 3. ద్వాపర యుగములో వ్యాసభగవానులు వేదాంతార్థములను, బ్రహ్మ జ్ఞానమును ఉపదేశించిరి.
- 4. కలియుగములో ఆదిశంకరాచార్యులు ఉపనిషద్విద్య లేక బ్రహ్మ విద్యను వ్యాపింపచేసిరి.
గ్రహముల ప్రభావము:
వినత, దితి, సురభి, సరమ, కరంజ, కద్రువు, లోహితాస్య - వీరంతా కుమార మాతృకలు. వీరు శిశువులను పీడించుచుందురు. కాని బలి, మంత్రోపహారము, దానములు, తర్పణములు మొదలగు వాటివలన తృప్తిపొంది, శిశువులకు 16 సంవత్సరముల వరకు ఆరోగ్యమును కలిగించెదరు. బాలారిష్టములు తొలగును. 16 సంవత్సరముల వయస్సు దాటిన వారిని బాధించే గ్రహములు - నిద్ర, మెలకువలో దేవతలను చూచి భ్రమపడి పలవరించెదరు. ఇది దేవగ్రహము యొక్క పని. పితృగ్రహము పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు భ్రమకొల్పును. గాంధర్వ గ్రహము, గంధర్వుడైన తాను కనిపించే భ్రమ కలిగించును. కాల విపర్యయములో భ్రమింప జేసేది యక్షగ్రహము. వాతము, పైత్యము, కఫములకు కారణము కూడా గ్రహ దోషమే. ఇవన్నీ 70 సంవత్సరముల వయస్సు వరకు ఉండును. ఆ తరువాత ఏ గ్రహసంబంధ బాధ, భ్రమ ఉండదు.నియమ నిష్ఠలతో ఉంటూ, ఇంద్రియాలను నిగ్రహించి, శుచిగా ఉండే తేజోవంతులను ఏ గ్రహములు ఏమీ చేయజాలవు.
మహాభారతము రచించుటకు పట్టిన కాలము:
మరో పనిపెట్టుకోకుండా అదే పనిగా రచించుటకు మూడు సంవత్సరములు పట్టెను.
బ్రహ్మీ ముహూర్తము:
భూమి తన చుట్టూ తాను తిరుగుచుండగా సూర్య ప్రకాశములేని కాలములో ఉదయము 3-30 నుండి 4-30 వరకు ఓజోన్ అనే వాయువు ద్రవించును. ఆ వాయువు భూమిపైకి వచ్చి సర్వ జీవులలో చేరి ఉత్తేజమున కలిగించును. సాధకులలో మరింత ఉత్తేజము కలుగును. నిద్రించుచున్న వారిలో మందముగా నుండును. అందువలన సాధకులు ఈ బ్రహ్మీముహూర్త కాలమందు ఏ సాధన చేసినా గాని అధిక ఫలము లభించును.
సంధ్య:
సమ్యక్ జ్ఞానమునే సంధ్య అందురు. సంధ్యావందనమనగా కాలాధి దేవతను అందుకొనుటకు గాను చేసే ఆరాధన. సంధిలో ఉండేది సంధ్య. రెండు వృత్తుల మధ్యలో ఏ వృత్తిలేని స్థితియే సంధ్య. అందువలన సంధ్య అనే ఖాళీలో స్వయం చైతన్యము స్పష్టమగును. అట్టి స్వయం చైతన్యానుభవమును గుర్తించి స్థిరపడిపోతే అదియే ఆత్మ.మహాకాలీ:
కాలము అనగా కదిలేది. కదిలేది, కదిలించేది ఒక మహాశక్తి. ఈ మహాశక్తి కాల స్వరూపిణి. ఈ శక్తినే మహాకాలీ అందురు. ఈమె కాలమునకు అధిదేవత. ఈ దేవత యొక్క బాహ్య రూపమే భూత వర్తమాన భవిష్యత్తులు. అచలమైన తత్త్వమునుండి వేరే చలన శీలమైన మాయా శక్తి తనకు తానే వెలువడి పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనెడి నాలుగు దశలలో దిగి జీవ ఈశ్వర జగత్తులైనది. ఈ కాలాధి దేవతను కాలముల ద్వారా అందుకుని, ఆ దేవతయొక్క అనుగ్రహమును పొందవలెను. అన్ని శుభములు కలుగును. మహాకాలీ అనుగ్రహమున్నప్పుడు మాయ అడ్డు తొలగి, భ్రమ రహితమగును.
శ్లో|| పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్ |
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ||
సంకలనం: చల్లపల్లి విజ్ఞాన స్వరూప్