శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ఈనెల 16న ఆణివార ఆస్థానంను పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్‌పై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షణగా వచ్చి ఆలయ శద్ధి కార్యక్రమం నిర్వహించారు.
ఆనందనిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయంలోని ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రిని శుభ్రం చేశారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమతించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఈవో తెలిపారు.
_vsk ap