శ్రావణ మంగళగౌరీ వ్రత పూజా విధానం
శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.