పద్మనాభస్వామి వారి దేవాలయం విషయంలో ధర్మ విజయం
మరో దేవాలయాన్ని నాశనం చేద్దామని లౌకిక ప్రభుత్వాలు (బీజేపీ కాదు) పన్నిన కుట్రని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు నీరుగార్చి ధర్మాన్ని నిలబెట్టింది.
శ్రీ పద్మనాభస్వామి వారి దేవాలయం నిర్వహణ వందల సంవత్సరాలుగా ట్రేవెన్కోర్ రాజ వంశీయుల చేతుల్లోనే ఉంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వారిని తప్పించాలి అని చేసిన ప్రయత్నం ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో విఫలం అయ్యింది. ఇదే విధంగా దేశంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరగాలి అని ఆ పద్మనాభుడిని కోరుకుందాం.
ఇందులో కీలకపాత్ర పోషించిన మిత్రులు, సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది శ్రీ సాయి దీపక్ అయ్యర్ (Sai Deepak Iyer J) గారికి యావత్ హిందూ సమాజం రుణపడి ఉండాలి. ప్రభుత్వ కుట్ర కనుక నెరవేరి ఉంటే లక్ష కోట్లకు పైగా ఉన్న దేవాలయ సంపదను క్రమంగా గాదె కింద పందికొక్కులలా రాజకీయ నాయకులు తినేసేవారు. సమానత్వం, లౌకికవాదం లాంటి పేర్లు ఉపయోగించి మెల్లగా దేవాలయం యొక్క సంప్రదాయాలను నాశనం చేసేవారు.
మన దేశంలో ఉన్న అత్యద్భుతమైన ఆలయాలలో పద్మనాభస్వామి వారి దేవాలయం ఒకటి. నా అదృష్టం కొద్దీ నేను కొంత కాలం క్రితం ఆ ఆలయాన్ని దర్శించుకున్నాను. ఉదయం నాలుగు గంటలకే దర్శనానికి వెళ్ళాను. నా అదృష్టం ఏంటో గానీ, ఆరోజుకి స్వామిని దర్శించుకున్న మొదటి వాడిని నేనే. నేను రెండో వాడిని అయినా, నేను చాలా దూరం నుండి వచ్చాను అని నా ముందున్న వ్యక్తి వెనకకు వచ్చి నాకు మొదటి దర్శన భాగ్యం కల్పించారు. అంతేకాక అక్కడి నుండి నా ప్రయాణ ప్రణాళిక అంతా కూడా ఆయనే చెప్పారు. అందువల్లనే నా ప్రణాళికలో భాగం కాని కొన్ని ఇతర దేవాలయాలను కూడా దర్శించుకోగలిగాను.
చెప్తే కొంచెం అతిశయంగా ఉండవచ్చు గానీ, స్వామిని దర్శించుకునప్పుడు పొందిన అనుభూతి నిజంగా వర్ణనాతీతం. ఆరోజు నా అదృష్టం ఏమిటో కానీ, ఎందరో భక్తులు ఉన్నా, నేను దర్శనం చేసుకుని కొంచెం వెనకకు వచ్చి స్వామిని చూడగలిగేలా నిలబడ్డా, నన్ను ఎవ్వరూ వెళ్ళమని అనలేదు. దాదాపు 15 - 20 ని. ల పాటు స్వామిని చూడగలుగాను. స్వామిని మొదట చూసిన వెంటనే ఒక మహాద్భుతాన్ని చూసిన భావన నాకు కలిగింది. ఆనందం మనసంతా నిండిపోయి ఇక అక్కడ చాలక నా కంటివెంట నీరులా బయటకు రావడం నాకు ఇప్పటికీ గుర్తే. ఇది రాస్తున్న ఈ సమయంలో కూడా నా కళ్ళు చమ్మగిల్లాయి అంటే స్వామి దర్శన ప్రభావం నా మీద ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.
ఆ మూర్తి ఒక మహాద్భుతం, ఆ అనుభూతి అనిర్వచనీయం. పడుకున్న స్వామే దాదాపు 5 అడుగులు ఉంటారు. మూడు ద్వారాల ద్వారా మనం స్వామిని చూడాలి. మొదటి ద్వారం నుండి కేవలం ముఖం మాత్రమే కనబడుతుంది. నాకు తెలిసి స్వామి పొడవు బహుశా 20 అడుగులు ఉంటుందేమో. పద్మనాభస్వామి వారిని ప్రతీ హిందువూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరాలి. అక్కడి అర్చకులు ఆ దేవాలయాన్ని ఎంత నిష్ఠగా నిర్వహిస్తారో, అక్కడ కొంత సమయం గడిపితే మనకు అర్థం అవుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో విజయం సాధించి ఉంటే, దానివలన జరిగే నష్టం అపారం. ఆ పద్మనాభుడు మన మీద దయతలచి, అలా జరగకుండా చూశాడు.
శ్రీ పద్మనాభాయనమః